Asianet News TeluguAsianet News Telugu

‘వివక్ష’: సినీ హీరోలు కొత్త దేవుళ్లయ్యారు

గాంధీజీ ట్రంక్ పెట్టెను గిరాటు వేసి రైల్ కోచ్ నుంచి ఆయన్ని బయటకు గెంటివేసాక, ఆ పెట్టెను తీసుకుని దక్షణ ఆఫ్రికా నుంచి ఆయన భారత్ వచ్చిన తర్వాత గాని - ‘స్వదేశీ వివక్ష’ విరాట్ స్వరూపంలో ఆయనకు కనిపించడం మొదలు కాలేదు. 

The forms of discrimination in Indian society

‘వివక్ష’ కు ఉన్న రూపాంతర (ట్రాన్స్ ఫార్మింగ్) లక్షణం అమూర్తమైన (ఇన్ విజిబుల్) కారణంగా, ఆధునికానంతర జీవనంలో- అన్నిసార్లు దాన్ని ఇది అని ఒక రూపంగా చూపించడం కుదరదు. మన దేశం లోపల అది ‘కుల’ వివక్షగా అమలులో వుంటే, దేశం బయట అది ‘వర్ణ’ వివక్షగా వుంది. అలాగే - ఇక్కడ ‘వివక్ష’ అమలు చేసే వర్గం, దేశం బయట మరొకరి నుంచి దాన్నిఎదుర్కొంటూ ఉండవచ్చు! దేశం లోపల తమ కంటే బలహీనుల మీద దాన్ని అమలు చేస్తున్నవారు, దేశం బయట - వీరి కంటే ఉన్నతులం అనుకుంటున్న వారి నుంచి దాన్ని ఎదుర్కొంటున్నారు. 

అప్పుడు మనకు  ఒక సందేహం వస్తుంది – ఇక్కడ వీరు తమకున్న ఆధిపత్య స్థాయిని విడిచి మరీ, అక్కడ అటువంటి వివక్ష భరించడానికి, దాన్ని సర్దుకుపోవడానికి కారణం ఏమిటి? అని. క్లుప్తంగా చెప్పాలంటే – ఇక్కడి కంటే ‘మెరుగైన జీవన పరిస్థితుల కోసం’ అనేది వస్తున్న జవాబు. మరి వారు ఇక్కడ స్వదేశంలో వివక్షను అమలు చేస్తున్నది ఎవరి మీద? ఇక్కడ కూడా అదే జవాబు వస్తున్నది - గతం కంటే ‘మెరుగైన జీవన పరిస్థితులు’ వెతుక్కుంటున్న వారి మీద. స్థూలంగా దీని సారాంశం ఏమంటే - కొందరి ఎదుగుదలను మనం ఎప్పటికీ నిరాకరిస్తూ, మనం మాత్రం నిరంతరం ఎదగాలని కోరుకుంటున్నాము! 

The forms of discrimination in Indian society

గాంధీజీ ట్రంక్ పెట్టెను గిరాటు వేసి రైల్ కోచ్ నుంచి ఆయన్ని బయటకు గెంటివేసాక, ఆ పెట్టెను తీసుకుని దక్షణ ఆఫ్రికా నుంచి ఆయన భారత్ వచ్చిన తర్వాత గాని - ‘స్వదేశీ వివక్ష’ విరాట్ స్వరూపంలో ఆయనకు కనిపించడం మొదలు కాలేదు. అనుభవం అయితే గాని తత్త్వం బోధపడదు అంటుంటారు, ఇటువంటప్పుడే! అయితే తర్వాత కాలంలో చరిత్రలో గాంధీజీ ‘విజేత’ గా నమోదు కావడానికి, కలిసి వచ్చింది - జాతీయ ఉద్యమమా లేక సంస్కరణోద్యమమా అంటే, రెండింటినీ మళ్ళీ మనం ఇప్పుడు వేరు చేయలేము. 

అయితే- అప్పటికి ఆయన ‘కుల’ వివక్షను మాట మాత్రంగా అయినా ప్రస్తావించడం వల్ల, ఆ తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో అయన పేరు పెట్టుకుని కొనసాగిన నాయకులకు తమ మ్యానిఫ్యాస్టోలో చేర్చుకోవడానికి - ‘హరిజనోద్యమం’ ఒక అంశం అయింది. 

The forms of discrimination in Indian society

దేశానికీ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది, 
ప్రపంచీకరణకు - పాతికేళ్ళు అయినా, ఇంకా ‘వివక్ష’ రూపాలు విస్తరిస్తున్నాయి. ఎందుకని? ఈ ఏడాది మే -జూన్ నెలల్లో మన దేశంలోనూ - దేశం బయట జరిగిన రెండు సంఘటనలను తీసుకుని దీన్ని పరిశీలిద్దాం. ఏభై ఏళ్ళ డాక్టర్ ప్రియంవద గోపాల్ గత 17  ఏళ్ళుగా కేంబ్రిడ్జి  యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో అధ్యాపకురాలు. ఆమె 1994  నుంచి ఇప్పటివరకు 15 పైగా గ్రంధాలు రాసారు ‘లిటరరీ రాడికలిజం ఇన్ ఇండియా’ ‘నేషన్ అండ్ ది ట్రాన్సిషన్ టు ఇండిపెండెన్స్’ వాటిలో తాజావి. అయితే, ఈ మధ్య ‘ది టైమ్స్’  ‘గార్దియన్’ వంటి బ్రిటన్ పత్రికల్లో తరుచు ఈమె వార్తల్లో వుంటున్నారు. 

అప్పుడప్పుడు ఆ వార్తలు మన దేశంలో కూడా కనిపిస్తాయి. ఇంతకీ విషయం ఏమంటే – డా. ప్రియంవద గోపాల్ తను పనిచేస్తున్న యూనివర్సిటీలోనే తాను వర్ణ ‘వివక్ష’ ఎదుర్కొంటున్నానని అంటున్నారు. చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఆ యూనివర్సిటీ అటెండర్లు కూడా - నా స్థాయిని గుర్తించి నన్ను గౌరవించడం లేదు, ‘వాళ్ళు నన్ను ‘డాక్టర్’ అనకుండా ‘మేడం’ అంటున్నారు’ అనేది ఆమె అభ్యంతరం. నేను వాళ్లతో నన్ను ‘డాక్టర్’ అని పిలవమని చెప్పినా ‘వుయ్ డోంట్ కేర్’ అన్నారని డా. ప్రియంవద గోపాల్ పత్రికల వారితో చెప్పారు. లండన్ పి.టి.ఐ. ప్రతినిధి దీన్ని రిపోర్ట్ చేయడంతో, భారత దేశ ఆంగ్ల పత్రికలు జూన్ లో దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. 

రెండవ సంఘటన - మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉదయగిరి తాలూకా రుద్రవాడి గ్రామంలో జరిగింది. దీన్ని ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ‘ది వైర్’ రాసింది. “రేపు పెళ్ళి అనగా (మే 8న) పెళ్ళి కొడుకు కుటుంబం వూళ్ళో వున్న మారుతి గుడి పరిసరాల వద్దకు వెళ్లి (వీరికి గుడి లోకి అనుమతి లేదు) గుడి చిట్ట చివరి మెట్టు ముట్టుకుని దండం పెట్టుకున్నందుకు గ్రామస్తులు 24 దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కార శిక్ష విధించారు. ఊరికి దూరంగా నిర్మాణం పూర్తికాని సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనంలో వారు తల దాచుకున్నారు. ఆ వంద మందిలో 40 మంది స్త్రీలు 15 మంది పిల్లలు. వాళ్ళలో ఆ గ్రామ సర్పంచ్ కూడా వున్నాడు! వీరంతా మాతంగ్ కులస్తులు. పిర్యాదు చేస్తే, స్టేషన్ ముందు రాస్తారోకో చేస్తే గాని అట్రాసిటీ యాక్ట్ కింద కేస్ పెట్టలేదు. పోలీస్ కేస్ పెట్టినందుకు వూరు వాళ్ళను వెలేసింది” సర్పంచ్ సాలుభాయ్ షిండే ఈ వివరాలు ‘ది వైర్’ కు తెలిపాడు. 
ఇప్పటికి 11 ఏళ్ల క్రితం 2006 సెప్టెంబర్ లో ఇదే రాష్ట్రంలో ఖైర్లాంజీ ఘాతుకం తర్వాత, ఈ దశాబ్దంలో అక్కడ కొంచెం కూడా మార్పు లేదు. చిత్రం – ఈ పన్నెండేళ్ళ  కాలంలో ఇదే రాష్ట్రం నుంచి మరొక ‘షిండే’ (సుశీల్ కుమార్) కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా చేసారు! 

The forms of discrimination in Indian society

దీన్ని తెలుగు రాష్ట్రాలకు అన్వయించి చూస్తే - ‘వివక్ష’ లో ఇటువంటి నాటు పద్దతులు ఇక్కడ తక్కువ. కోస్తాంధ్రలో 80 దశకం చివర - ఆర్ధిక సంస్కరణలకు ముందు జరిగిన కారంచేడు, చుండూరు సంఘటనలు; మున్ముందు ఇక్కడ మొదలు కానున్న రాజకీయ-సామాజిక-ఆర్ధిక రంగ ఆధిపత్య పోరుకు - ‘సీడ్ విలేజెస్’ అయ్యాయి. ఇక్కడ వీరికి గుడి మెట్ల వద్ద పడిగాపులు పడే పరిస్థితి పెద్దగా లేదు. గత ఏడాది కాలంలో ఇక్కడ  వెలుగులోకి వచ్చిన కేసులు చూస్తే వీటిలో ఎక్కువ – శ్రీమతి ప్రియంవద గోపాల్ ‘డాక్టర్’ – ‘మేడం’ సంవాదం వంటివే! అమెది క్యాంపస్ సందర్భం కనుక, కృష్ణా మండలం గుంటూరు జిల్లా నివాసి రోహిత్ వేముల అప్పట్లో తెలంగాణాలోని హైదాబాద్ యూనివర్సిటీలో ఎదుర్కొన్నది కూడా- ప్రియంవద సమస్యే. అక్కడ బ్రిటన్ లో అమెది ‘వివక్ష’ కనుక అయితే, ఇక్కడ వీటిని కూడా మనం వివక్షగానే చూడవలసి వుంటుంది. 

అటువంటిదే ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా గరగపర్రుది కూడా. ఇది - వూరు కూడలిలో దళిత ‘అస్తిత్వం’ సమస్య. ఇవి - ప్రధాన స్రవంతిలో మా స్థానం మాకు కావాలి అనేగాని; మీ దేవుడి గుడి చివరి మెట్టు మమ్మల్నికూడా ముట్టుకోనివ్వండి అని కాదు. ఈ ప్రాంతాలు ఆ దశ దాటి చానాళ్లు అయింది. అందుకు సాగునీటి ప్రాజెక్టులు కాల్వలు, మిషనరీలు - విద్య అదంతా వేరే చర్చ. అందుకే 30 ఏళ్ళ క్రితం కారంచేడు సినిమా హల్లో అధిపత్యం వర్గం వ్యక్తి కూర్చున్న ముందు సీటు మీద కాలు పెట్టి - ఆనాటి ఉదంతానికి ముందుగా అగ్గి రాజుకోవడానికి కారకుడైన యువకుడి స్థానంలోకి, ఇక్కడినుంచే ఒక రోహిత్ వేముల వంటి సున్నిత మనస్కుడైన విద్యావంతుడు వచ్చాడు. ఇప్పుడు ఈ ‘రోహిత్’ కు కూడా లండన్ లో డా. ప్రియంవద మాదిరిగానే ‘హార్ట్’ చేసే ఒక పిలుపు లేదా చూపు చాలు గాయపడ్డానికి. 

నిజానికి ఇటువంటి ‘రోహిత్’ ల సంఖ్య పెరగడాన్ని సమాజాలు కోరుకోవాలి, కానీ అలా జరగడం లేదు. ఆధిపత్య వర్గాలకు అటువంటి అవసరం ఒకటి వుందని అర్ధంకావడం  లేదు. నిజానికి వాటికే ఆ అవసరం ఎక్కువ వుంది! కానీ ఇక్కడ చిత్రం ఏమంటే – వాళ్ళ సంగతి సరే, ఇప్పుడు ఈ ‘రోహిత్’ పేరుతో రూపుదిద్దుకున్న కొత్త ‘దళిత్ క్యారెక్టర్’ ను అతని స్వీయ సమాజాలు కూడా ఆమోదించడం లేదు. ఎందుకని? అది తెలియడానికి Emerging of Rohith Vemula  (రోహిత్ వేముల ఆవిర్భావం) అనే దృష్టి కోణం నుంచి దీన్ని చూడ్డం అవసరం. అలా చూసినప్పుడు ఇందులో రెండు దశలు కనిపిస్తాయి. 

మొదటిది గాంధీ సందర్భంగా చెప్పుకున్న ‘హరిజన్’ దశ. రెండవది అంబేద్కర్ కు కొనసాగింపుగా వచ్చిన ‘దళిత్’ దశ. రెండవది మొదలయ్యే నాటికి ఇందిరాగాంధీ సంక్షేమ పధకాల ఉచ్చదశ ముగుస్తూ... దేశానికీ యాభై ఏళ్ళు వచ్చాయి. ఈ కాలంలో చదువులతో సిద్దంగా వున్నఈ వర్గాలకు రిజర్వేషన్లతో - ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాలు దొరికాయి. అయితే, ఇవే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వ శాఖలు నుంచి ఉద్యోగాలతో పాటు, రుణాలు పారిశ్రామిక సబ్సిడీలు, ఎగుమతి-దిగుమతుల సుంకాల్లో రాయితీలు పూర్తి స్థాయిలో వాడుకున్న ఆధిపత్య  కులాల నాయకత్వాలు గ్రామాల్లో తమ వోటు బ్యాంకులు చెక్కుచెదరకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేవి. వాటిలో అతి ప్రధానమైనది – ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న రుణాలతో పారిశ్రామిక పెట్టుబడులను తమ జిల్లాల్లో కాకుండా అప్పటి రాజధాని హైదరాబాద్ లో కేంద్రీకరించడం. తమ నియోజకవర్గాల్లో వోటర్లు – సమీప ఫ్యాక్టరీల్లో కార్మికులుగా మారకుండా, రైతు కూలీలుగానే వుంటూ వూరు దాటకుండా చూడ్డం కీలకమైంది! మీకు ఊరికి సమస్యలు ఏమైనా వుంటే, వాటిని ‘మేమే’ పరిష్కరిస్తాం అనే జోకొట్టే  కధలతో సినిమాలు తీయడం జరిగేది! 

ఇటువంటి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. గత యాభై ఏళ్ళుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అమలు చేసిన ఈ వ్యూహం కారణంగా, రైతు కూలి దశ నుంచి -ఫ్యాక్టరీ కార్మికుడై దిగువ మధ్య తరగతిగా మారవలసిన దళిత -బహుజన వర్గాలు, గడచిన ముప్పై ఏళ్ళలో రెండు రూపాయలు కిలో బియ్యం నుంచి - రూపాయి కిలో బియ్యం స్థాయికి దిగజారాయి! ఈ కాలంలోనే కాన్షీ రాం ‘యు.పి. ప్రయోగం’ తో ఏ.పి. వచ్చి- తన ‘సాగుబడి’ కి ఇది అనువైన నేల కాదని వెనుదిరిగి వెళ్లారు. కారణం- ఆర్ధిక సంస్కరణల ఆరంభం నాటికే ‘అబేడ్కరిజం’ కోస్తాంధ్రలో సంస్కృతీకరణ చెందడం మొదలయింది. ఆ తర్వాత కాలంలో వచ్చిన కొత్త తరం సమీప పట్టణాల్లో సర్వీస్ సెక్టార్లో సెమి-స్కిల్డ్ వేతన కార్మికులయ్యాక, తదుపరి దశలో వీరి అనుభవాన్ని అందిపుచ్చుకునే పరిశ్రమలు లేక వీరి ఎదుగుదల ఆగిపోయింది. అందువల్ల కొత్తగా దిగువ మధ్యతరగతిగా మారే కుటుంబాల శాతం తగ్గిపోతున్నది. 

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2014 జూన్ లో పశ్చమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన సభలో మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు - ‘కాటన్ బ్యారేజి కట్టిన తర్వాత రైస్ మిల్లులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏముంది?’ అంటూ చేసిన వ్యాఖ్యకు ఎంతైనా ప్రాధాన్యత వుంది. అయితే, హైదరాబాద్ నగరాన్ని తెలంగాణాకు అప్పగించి బయటకు వచ్చాక, మారిన చూపులో నుంచి ఈ మాట రావడం కూడా చరిత్రలో రికార్డ్ అవుతుంది. సి.ఎం చేసిన ఈ ప్రకటన నేపధ్యంలో నుంచి ఇప్పుడు ఏమిటి వర్తమానం అని చూస్తే – దళిత-బహుజన యువత ‘ఎనర్జీ’ దారి తప్పడంతో, సినీ హీరోలు ఇప్పుడు వీరికి కొత్త దేవుళ్లయ్యారు. వీరి ఎంటర్ టైన్మెంట్ కోసం వాణిజ్య వర్గాలు వీరికి అందుబాటులో ‘బెల్ట్ షాపులు’ ఉంచారు. ఇప్పుడు వీరికి కుల-వర్గ కేంద్రిత రాజకీయ స్పృహ గాని చైతన్యం గాని లేదు, రోహిత్ ఎందుకు చనిపోయాడో చెప్పినా వీరికి అర్ధమయ్యే అవకాశం లేదు. 

తెలుగునాట అంబేడ్కరిస్టులు కూడా ఇప్పుడు అన్ని ఆధిపత్య కులపార్టీల్లో వుంటూ – అక్కడుండి వారిప్పుడు ‘అబేడ్కరిజం’ గురించి మాట్లాడుతున్నారు. ఒకనాటి కారంచేడు చుండూరు తర్వాత జరిగిన ఉద్యమాలకు దిక్సూచి అయిన దళిత మహాసభ కార్యక్షేత్రానికి గుంటూరు కేంద్రమయింది. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన వల్ల గుంటూరు రాజధాని అయ్యాక ఏర్పడ్డ రాజకీయాల ఖాళీలో చిన్నగా ఒక సమాంతర రాజకీయ ‘స్పేస్’ ను స్వంతంగా మనమూ నిర్మించుకుందాం, అనే వాంఛ వీరికి కలగడం లేదు. తమ శక్తి యుక్తులు అన్నీ పెట్టి ప్రధాన రాజకీయ పార్టీల్లో తృతీయ ఇంకా దిగువ స్థాయి పదవులతో వీరు సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి మూడవ దశలో – ఇంకా నేల విడిచి సాము చేస్తున్న దళిత సాహిత్యాన్ని; నమ్మి రాజ్యాధికారం – ఆత్మ గౌరవం వంటి ‘ప్రామ్టింగ్’ తో క్యాంపస్ కు వచ్చినవాడు -‘రోహిత్ వేముల’. 

డెబ్బై ఏళ్ళ తర్వాత దేశంలో ఇటువంటి మూడవ దశ వైఫల్యాన్ని చరిత్రలో రికార్డు చేసింది ఏ.పి. కి చెందిన - రోహిత్ వేముల మరణం. ఈ సంఘటన - దేశంలోని యూనివర్సిటిల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అది, దళిత-బహుజన నాయకులకు - ‘మీరు ఎటువైపు?’ అనే ప్రశ్న నేరుగా సంధించింది. దానికి చేష్టలుడిగి, మా రాజకీయ భవిష్యత్తు మాకు ముఖ్యం అని, వారు ముఖం చాటేశారు. పొలిటికల్ కెరియర్ మధ్యలో క్రియాశీల రాజకీయాల్లో వున్నవారు రాజకీయ పదవి – ఆత్మ గౌరవాల మధ్య తూకంలో తేలిపోయారు. వాస్తవానికి ఏ.పి. కి మెడ్రాస్ ప్రేసిడేన్సీ పాలన చరిత్ర వున్నందుకు, కాంగ్రెస్ ‘హరిజన్’ కాలం నుంచి వస్తున్న వీరి వికాస పరిణామ క్రమం, ఇక్కడ కీలకమైన మలుపు తీసుకోవాలి. ఈ మూడవ దశకు ఇప్పటి ‘చిన్న- ఆంధ్రప్రదేశ్’ శక్తివంతమైన ‘లాంచింగ్ ప్యాడ్’ కావాల్సి వుంది. కానీ అలా జరగలేదు! ఎందుకంటే, ఈ వర్గాలకు అప్పటి వరకు రాజ్యం అందిస్తున్నసంక్షేమానికి తోడు, సంస్కరణల - ‘మార్కెట్ ఎకానమీ’ మరి కొంత ఆర్ధిక ఆసరా అందించింది. కానీ వీరి సాంఘిక- సాంస్కృతిక వెనకబాటుతనం వల్ల బహుజన కులాల దిగువ మధ్యతరగతి లక్షణం దళితులకు అలవడలేదు. 

ఈ దశలో వీరి జీవితాల్లోకి చొరబడిన సమాచార టెక్నాలజీ - వీరిని పెనం మీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఇప్పుడు వీరిలో ఎక్కువ శాతం మంది సమాచార టెక్నాలజీని నాన్ – ప్రొడక్టివ్ గా వినియోగిస్తూ, ఒక ‘కల్ట్’ గా రూపాంతరం చెందుతున్న సినీ హీరోలకు ఫ్యాన్స్ గా మారడంతో, నగర శివారుల్లో అసాంఘిక కార్యకలాపాలకు వీరి అవాసాలు అడ్డాలుగా మారుతున్నాయి. నామమాత్రంగా మిగిలిన నాన్ పొలిటికల్ లేదా మాజీ మావోయిస్టు అంబేడ్కరిస్టులకు ఈ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది! 
అయితే పూరించవల్సిన ‘గ్యాప్’ ఎక్కడుందో తెలిసినప్పటికీ, ప్రభుత్వం ఎస్సీ-ఎస్టీ ప్రణాళిక లక్ష్యాలు, తాము సాధించిన గణాంకాలు ఏటా ప్రకటిస్తూ తన బాధ్యత పూర్తి అయినట్టు భావిస్తూ, వీరు కోరుతున్న- ‘ఆత్మ గౌరవం’ గమ్యం వైపున్న దారులన్నీ మూసేస్తున్నది. లబ్దిదారుని ఆధార్ నెంబర్ అతని కుటుంబ వివరాలు సమస్తం సాధికారిక సర్వేలో మేము సేకరించాము. ప్రభుత్వం నుంచి ఆమె లేదా అతనికి అందుతున్న లబ్ది వివరాలు మా వద్ద వున్నాయి. 

సబ్ ప్లాన్ దామాషా ప్రకారం ఏటా వారికీ బడ్జెట్ కేటాయిస్తున్నాము. ఇక మా లక్ష్యాల గణాంకాలు ఎవరైనా ‘గూగుల్’ లో చూసుకోవచ్చు. అత్యాచారాలు దాడులు జరిగితే అందుకు చట్టం వుంది, పోలీస్ కేసు పెట్టవచ్చు. కోర్టులు ఎటూ వున్నాయి, అవి శిక్షలు విధిస్తాయి 

మరి వీరి ఆత్మ గౌరవం?   

అందుకు శాఖ లేదు. 

‘రాజ్యాంగంలో అందరికీ ఉన్న హక్కులే మీకు వున్నాయి’  
మరి పరిష్కారం?

- జాన్ సన్ చోరగుడి 

(ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏసియానెట్ న్యూస్ కు సంబంధం లేదు. అవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణనించాలని కోరుతున్నాం)

Follow Us:
Download App:
  • android
  • ios