సరిగ్గా ఇదే రోజు: గోదావరి పుష్కరాల్లో ఘోరం
సరిగ్గా ఇదే రోజు మూడేళ్ళ క్రితం... 29 మంది 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ ప్రభుత్వానికి ఇదొక మాయని మచ్చగా నిలిచింది.
సరిగ్గా ఇదే రోజు మూడేళ్ళ క్రితం... 29 మంది 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ ప్రభుత్వానికి ఇదొక మాయని మచ్చగా నిలిచింది. 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాలంటూ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమం ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
పుష్కరాల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర గోదావరిలో పూజలు చేస్తున్న క్రమంలో వీపరీతంగా భక్తులు పోటెత్తి జరగరాని ఘోరం జరిగిపోయింది. జరిగిన ఈ దుర్ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ దుర్ఘటన జరిగి నేటికి మూడేళ్లయింది. మరి బాధితులకు న్యాయం జరిగిందా అంటే ఇంతవరకు న్యాయం జరగలేదు.
ఈ నిజాలను నిగ్గు తేల్చేందుకు వేసిన ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది.
నిజాయితీ నిరూపించుకునేందుకు కమిషన్
సంఘటన జరిగిన ఏడాది తరువాత ప్రభుత్వం ఎక్కడ ఏర్పాట్లలో తప్పులేదని నిరూపించుకునేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సోమయాజులుతో ఏకసభ్య కమిషన్‌ను వేసింది.
ఈ కమిషన్ రాజమహేంద్రవరంలో అనేక సార్లు బహిరంగ విచారణ జరిపినా ప్రభుత్వ శాఖలు సమాచార శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, తదితర శాఖలు తమ వద్ద ఉన్న ఆధారాలు, వీడియోక్లిప్పింగ్‌లు, నివేదికలు సమర్పించడంలో కమిషన్‌కు సహకరించలేదు.
మృతులు, క్షతగాత్రుల సంఖ్య నమోదు చేయడంలో ఒక శాఖకు, మరో శాఖకు పొంతన లేకుండా ఉంది.
ఆ వీడియోలు బయటపెట్టని ప్రభుత్వం
పుష్కర క్రతువు జరుగుతున్న తీరును ప్రపంచానికి చూపించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.40 లక్షల వ్యయంతో చిత్రీకరించేందుకు ఆ చానల్ ఒప్పందం కుదుర్చుకొని భారీస్థాయిలో పుష్కర ఘాట్‌లో చిత్రీకరణ చేశారు. ఈ ఛానల్‌తో పాటు ప్రైవేటు చానళ్లు, ఘాట్‌లో ఏర్పాటు చేసిన సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా పెద్ద ఎత్తున చిత్రీకరణ చేశారు.
అయితే తొక్కిసలాట దుర్ఘటన జరిగిన తరువాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌చిత్రీకరించిన ఫుటేజీ, ఇతర శాఖలు చిత్రీకరించిన ఫుటేజీని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు.
గడువు పెంచరు..నివేదిక బయటకు రాదు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ గడువు ముగిసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం కమిషన్ గడువు పొడిగించకపోవడంతో కమిషన్ నివేదిక బయటకు రావడం లేదు. కమిషన్ గడువు పొడిగిస్తే నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రభుత్వం తన తప్పులు బయట పడతాయనే ఉద్దేశంతో కమిషన్ కడువు పొడిగించడం లేదు. దీంతో కమిషన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది మృతికి, గాయాలు పాలైన సంఘటనలో ఏవరు దోషులనేది బయటపడకుండానే మిగిలిపోయింది. ఇప్పటికీ పోలీస్ శాఖ చార్జ్ షీటు దాఖలు చేయని స్థితిలో ఉంది.
ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం కమిషన్ గడువు పొడిగించా లి. ప్రజల సొమ్ము లక్షలాది రూపాయల వ్య యంతో నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆ ఛానల్ వారు పుష్కరాల కోసం చిత్రీకరించిన ఫుటేజీని బయట పెట్టాలి.
- హరి