ఎంపీ ప్రభాకర్ రెడ్డికి భద్రతా వైఫల్యం.. ఘటనా సమయంలో పోలీసులు లేరు?
ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాప్రయత్నం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అభ్యర్థుల భద్రత విషయంపైనా ఈ ఘటనతో అనేక సందేహాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం, అభ్యర్థులకు నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. కానీ, ప్రభాకర్ రెడ్డికి ఆ భద్రత లేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ రోజు ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యా ప్రయత్నం రాష్ట్రమంతటా కలకలాన్ని రేపింది. రాజకీయంగానూ పెను దుమారం రేపుతున్నది. రాజకీయ కోణం పక్కన పెడితే ఈ ఘటనతో అభ్యర్థుల భద్రత విషయంలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థికి నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. కానీ, ఇది అమలు కావడం లేదనే సంశయాలు ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై హత్యాప్రయత్నం ఘటనతో వెలువడుతున్నాయి. ఎందుకంటే దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుతం మెదక్ ఎంపీ కూడా అయినటువంటి ప్రభాకర్ రెడ్డికి సిద్దిపేట జిల్లా పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రభాకర్ రెడ్డిపై హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఘటనా స్థలిలో పోలీసులెవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. ఎంపీ హోదాలో ఆయనకు నియమించబడిన గన్ మెన్లు మాత్రమే ప్రభాకర్ రెడ్డి వెంట ఉన్నట్టు వివరిస్తున్నారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాలకు గాని పోలీసులు ఘటనా స్థలికి చేరుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: బీఎస్పీ రెండో జాబితా విడుదల.. ట్రాన్స్‌జెండర్‌కు టికెట్.. కేసీఆర్ పై ఎవరు పోటీ చేస్తున్నారంటే?
అయితే, అప్పటికే ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీ వ్యక్తిగత వాహనంలో గజ్వేల్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించడంలో సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల అభ్యర్థలు భద్రత బాధ్యతను సిద్దిపేట పోలీసు కమిషనర్ తీసుకోవాలని అంటున్నారు. ఎన్నికల సంఘం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అలాగైతేనే.. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని చెబుతున్నారు.