Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ సమ్మె: అత్యధిక రోజుల రికార్డు, ఫలితం సున్నా

52 రోజుల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌టిసి) సమ్మె ఎటువంటి ఫలితం సాధించకుండా ఘోరంగా విఫలమైనప్పటికీ, సుదీర్ఘ నిరసనగా రికార్డును మాత్రం  సృష్టించింది.

RTC Strike: not just the longest..but also creates record as an inconclusive one
Author
Hyderabad, First Published Nov 26, 2019, 12:51 PM IST

52 రోజుల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌టిసి) సమ్మె ఎటువంటి ఫలితం సాధించకుండా ఘోరంగా విఫలమైనప్పటికీ, సుదీర్ఘ నిరసనగా రికార్డును మాత్రం  సృష్టించింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో, సకల జనుల సమ్మెలో భాగంగా 42 రోజులపాటు సమ్మెబాటపట్టారు. ప్రస్తుత సమ్మె ఆ రికార్డును కూడా అధిగమించింది. 

Also read: కార్మికుల సమ్మె విరమణపై ఆర్టీసీ ఎండీ ప్రకటన.. జగ్గారెడ్డి సీరియస్

ప్రస్తుత ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు సోమవారం నాడు కార్మిక నేతలు ప్రకటించారు. ఈ 52 రోజులలో, 30 మంది ఉద్యోగులు తనువు చాలించారు. వీరిలో కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు.

సమ్మె కూడా ఎటువంటి ఫలప్రదమైన ముగింపును కూడా చూడలేదు. సాధారణంగా, ఏదైనా సమ్మె ప్రభుత్వం నుండి కొంత హామీ ఇచ్చిన తరువాత లేదా ఉద్యోగుల డిమాండ్లను అన్ని కాకున్నా కొన్నయినా అంగీకరించిన తరువాత నిలిపివేయబడుతుంది. కానీ జెఎసికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ రాలేదు. వారే దిక్కుతెలియని అయోమయస్థితిలో సమ్మెబాటపట్టి సాధించుకున్న బంగారు తెలంగాణాలో, ఉద్యమనేత కేసీఆర్ హయాంలో ఇలా సమ్మె చేయాల్సి రావడం ఆ సమ్మెను ప్రభుత్వ హామీ లేకుండానే విరమించాల్సి రావడం శోచనీయం.  

ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంతో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జెఎసి స్వయంగా విరమించుకున్నప్పటికీ, 40 కి పైగా ఉన్న డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు.

Also read: కార్మికులకు షాక్: అంతా మీ ఇష్టమేనా.. విధుల్లోకి తీసుకునేది లేదన్న ఆర్టీసీ ఎండీ

ప్రధాన డిమాండ్ను విరమించుకున్న తరువాత, ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లో చేరడానికి అనుమతిస్తే, ఆర్టీసీ జెఎసి సమ్మెను విరమించడానికి కూడా  ముందుకు వచ్చింది. 

కానీ ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించలేదు. చివరగా,  ఎటువంటి ఫలితం సాధించకుండానే సోమవారం సమ్మెను విరమిస్తున్నట్టు జెఎసి ప్రకటించింది.

ఆర్టీసీ సమ్మెలో హైకోర్టు జోక్యం ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి పరిష్కారాన్ని చూపెట్టలేకపోయింది. లేబర్ కోర్టుకు కేసును బదిలీ చేసింది. తమకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెబుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను తండ్రిలాగా వ్యవహరించమని సూచనలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కోర్టు కొడ్తదా అని మంకుపట్టు వీడకుండా కూర్చున్నారు.  

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు తీర్పు చెబితే మాత్రం దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు సందిగ్ధంలో పడుతుంది. 

ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె వివిధ సమ్మెల చరిత్రలో బహుశా అతి పొడవైనది అయి ఉండొచ్చు, కానీ  ఏ విధమైన ఫలితం సాధించకుండానే ముగిసిన కార్మికుల సమ్మె కూడా ఇదే కాబోలు. 

Follow Us:
Download App:
  • android
  • ios