Asianet News TeluguAsianet News Telugu

కార్మికులకు షాక్: అంతా మీ ఇష్టమేనా.. విధుల్లోకి తీసుకునేది లేదన్న ఆర్టీసీ ఎండీ

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కీలక ప్రకటన చేశారు. కార్మికులను ఎట్టి పరిస్ధితుల్లోనూ విధుల్లోకి తీసుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు

tsrtc md sunil sharma key announcement on rtc strike calls off
Author
Hyderabad, First Published Nov 25, 2019, 7:20 PM IST

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కీలక ప్రకటన చేశారు. కార్మికులను ఎట్టి పరిస్ధితుల్లోనూ విధుల్లోకి తీసుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని ఎండీ సూచించారు.

విధుల్లో చేరతామని జేఏసీ నేతలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి.. ఇష్టమైనప్పుడు విధుల్లోకి వస్తామంటే చట్టప్రకారం కుదరదని సునీశ్ శర్మ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ ఆదేశాల ప్రకారం విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం డిపోల వద్ద శాంతిభద్రతల సమస్యల సృష్టించవద్దని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే క్షేమించేది లేదని సునీల్ శర్మ హెచ్చరించారు.

అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పండగ రోజుల్లో అనాలోచితంగా సమ్మె చేశారని సునీల్ శర్మ ధ్వజమెత్తారు. అంతకుముందు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ఇచ్చిన లేఖను ఆర్టీసీ ఎండీ పేషీ తిప్పి పంపించింది. దీంతో ఆ లేఖను లేబర్ కమీషనర్ కార్యాలయంలో ఇచ్చారు జేఏసీ నేతలు. 

సోమవారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల శ్రేయస్సు కోసమే విధులకు హాజరుకావాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

తాము ఓడిపోలేదు,  ప్రభుత్వం గెలవలేదని ఆర్టీసీ జేఎసీ కన్వీసర్ ఆశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు.. ఈ నెల 26వ తేదీ నుండి సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ ప్రకటించింది. ప్రజల సౌకర్యార్ధం సమ్మెను విరమించినట్టుగా జేఎసీ నేతలు చెప్పారు.

52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం ఆరు గంటలకు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ కార్మికులు కూడ ఆయా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీల్లో చేరాలని  ఆశ్వత్థామరెడ్డి కోరారు.

సోమవారం నాడు ఉదయం  నుండి సాయంత్రం వరకు ఆర్టీసీ జేఎసీ నేతలు నాలుగు దఫాలు చర్చించి చివరకు  సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నారు.  హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకొంటున్నట్టుగా జేఎసీ నేతలు తేల్చి చెప్పారు.

భేషరతుగా తమను విధుల్లోకి తీసుకొంటారని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. రేపు విధుల్లోకి తీసుకోకపోతే సమ్మెను పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios