ఆర్టీసీ సమ్మెను ఎటువంటి ఫలితం సాధించకుండానే కార్మికులు ముగించారు. వారు డిపోల దగ్గరకు వెళ్తున్నా, అధికారులు మాత్రం ఎవ్వరిని విధుల్లో చేర్చుకోవడం లేదు. నిన్న సాయంత్రం ఏకంగా వారిని చేర్చుకునేదే లేదని ప్రకటించారు. ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోవడం లేదో కేసీఆర్ కే తెలియాలి. 

ఇక సమ్మె విరమించామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించినప్పటికీ, వారిని విధుల్లో చేర్చుకోకపోవడం వల్ల మాత్రమే ప్రస్తుతం బస్సులు నడవడంలేదు. ఒకరకంగా ప్రస్తుతం సమ్మె కేసీఆర్ నాయకత్వంలో నడుస్తుందాని మాత్రం చెప్పక తప్పదు. 

బస్సుల్లేక సతమవుతున్న సగటు తెలంగాణ ప్రజలు, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించగానే ఊపిరి పీల్చుకున్నారు. రేపటి నుండి రోడ్లపైన బస్సులు తిరుగుతాయని అనుకున్నారంతా, కాకపోతే అది ప్రజల అత్యాశే అయ్యింది. కేవలం బస్సులు తిరుగుతాయని మాత్రమే కాకుండా, రోడ్లపైన సురక్షితమైన ప్రయాణం చేయవచ్చని భావించారు. 

Also read: ప్రతిపాదనలు రెడీ: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రానికి కేసీఆర్ లేఖ

నిన్న మధ్యాహ్నం కూడా తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతిచెందింది. ఆర్టీసీ సమ్మె మొదలైన నాటినుండి, తాత్కాలిక డ్రైవర్లు నడపడం మొదలుపెట్టినప్పటి నుండి ఆర్టీసీ బస్సుల వల్ల జరిగిన ప్రమాదాలు బహుశా పూర్తి ఆర్టీసీ చరిత్రలో కూడా ఎన్నడూ జరిగి ఉండవేమో. 

ఇకపోతే ఆర్టీసీ బస్సులు నడవకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవడమే కాదు రోజువారీ ప్రయాణాల కోసం వారి జేబులకు చిల్లు పడుతుంది.  ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి మహానగరాలకు పనికోసం వచ్చే దినసరి కూలీలు, ఇండ్లలో పనులు చేస్తూ జీవనం సాగించే పేదవారు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులు తమ జీతం కన్నా ఎక్కువవుతున్నాయని వాపోతున్న వైనం మనం నిత్యం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. 

ఇక్కడ సమస్య ప్రజల ఇబ్బందులకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇది ప్రజల ఇబ్బందులను ధాటి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరించివేస్తుంది. ప్రజల హక్కులను రక్షించాల్సిన ప్రభుత్వం వాటిని భక్షించడం రాజ్యాంగ విరుద్ధమే కాదు శోచనీయం కూడా. 

ఉదాహరణకు విద్యాహక్కు చట్టం గనుక తీసుకుంటే, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి 3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలనీ చెబుతుంది. దాంట్లో చెప్పే ఇంకో మాటేమిటంటే, సురక్షితమైన అందుబాటులో ఉండే విధంగా పాఠశాలను ఏర్పాటు చేయవలిసి ఉంటుంది. ఇలా అప్పర్ ప్రైమరీ స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నడిచి వెళితే రోడ్లు ఎంత భద్రమ్ నమోన్న యాదాద్రిజిల్లాలో శ్రీనివాస్ రెడ్డి వంటి కామాంధుల ఉదంతం మనం చూసాము. 

Also read: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్ కు గడ్కరీ మెలిక: జగన్ కు కూడా....

ఈ నేపథ్యంలో బస్సులు తిరగకపోతే ఆడపిల్లలు విద్యకు దూరమయ్యే ఆస్కారం ఎక్కువ. మరో విష్యం ఏమిటంటే, హై స్కూల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పక్కనున్న స్కూల్ కి వెళ్లి చదువుకోవడానికి ఖచ్చితంగా బస్సు సౌకర్యం అవసరం. ఇక్కడ వాదించే పాత తరం వారు, తాము నడిచి వెళ్లి చదువుకోలేదా అని అనవచ్చు. సౌకర్యం ఉంది కూడా విలువైన సమయాన్ని వృధా చేయడం మూర్ఖత్వమే అవుతుంది కదా!

ఇక రైట్ టు ప్రొఫెషన్, జీవనం కోసం వృత్తి చేసుకొని జీవించే హక్కును కూడా ఈ ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు కోల్పోతున్నారు. వారు తమ వృత్తి ని నిర్వహించుకోవడానికి ఈ ఆర్టీసీ బస్సులపై ఆధారపడ్డవారు అనేకం. వారంతా తమ వృత్తులను నిర్వర్తించలేకపోతున్నారనేది అక్షర సత్యం. 

తన పొలంలో పండిన కూరగాయల్ని తీసుకొని పక్కనున్న నగరానికి వచ్చి అమ్ముకునే ఒక రైతు ప్రస్తుత ఆర్టీసీ సమ్మె వల్ల కుదేలవుతున్నాడు. కేవలం రైతులొక్కరే కాదు, ఇలా చాలామంది అనేక రకాలుగా వారి వారి వృత్తులను నిర్వహించుకోలేకపోతున్నారు. భావన నిర్మాణ కార్మికులు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతుంటే, ఇక్కడ పని దొరికే చోటికి చవకైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టి, చవకైన, సమర్థవంతమైన, సురక్షితమైన ఆర్టీసీని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిద్దాం.