న్యూఢిల్లీ: ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరించవచ్చునని అంటూనే కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాతనే అది జరుగుతుందని అన్నారు. 

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ గడ్కరీ ఆ విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి గానీ ప్రభుత్వంలో విలీనం చేయడం గానీ చేయవచ్చునా అని కెవిపీ అడిగారు. 

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను టీఎస్ఆర్టీసీ విధుల్లోకి తీసుకోవడం లేదు. ఈ స్థితిలో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే, గడ్కరీ ప్రకటన ఏ మేరకు కేసీఆర్ ప్రభుత్వానికి అన్వయమవుతుందనేది చూడాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్టీసీని మూసేయడానికి 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం సెక్షన్ 39 ప్రకారం వీలవుతుందని గడ్కరీ చెప్పారు. ఆర్టీసీల నష్టాలను కేంద్రం భరించబోదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీలో సగాన్ని ప్రైవేటీకరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 5 వేలకు పైగా రూట్లను ప్రైవేటీకరించడానికి ఆయన సిద్దపడ్డారు. అదే సమయంలో ఎపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గడ్కరీ ప్రకటనను బట్టి వీరిద్దరి ప్రతిపాదనలు ఏ మేరకు ముందుకు సాగుతాయనేది ఆలోచించాల్సిన విషయమే.