Asianet News TeluguAsianet News Telugu

టెస్టు జట్టులోకి పంత్ రీఎంట్రీ... అంతా పిచ్ మహిమేనా?

విదేశీ పిచ్‌లపై మూడో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేయగల ఓ బ్యాట్స్‌మన్‌ భారత్‌కు అవసరం. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం ప్రకారం సాహా ముందు వరుసలో ఉంటాడు. కానీ న్యూజిలాండ్‌ పిచ్‌లపై, వార్మప్‌లో పంత్‌ గ్లౌవ్స్‌తో మెరుగ్గానే రాణించాడు. 

Rishabh pant likely to make a comeback into Indian test team.... new zealand pitch conditions favors his induction
Author
Hyderabad, First Published Feb 18, 2020, 5:01 PM IST

నూనూగు మీసాల 22 ఏండ్ల కుర్రాడు, ఇంతవరకు జాతీయ జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లతోసహా ఏ ఆటగాడు చవిచూడని విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు..... వాటితోపాటుగా భారత క్రికెట్ జట్టు తరఫున విజయవంతమైన ఆటగాళ్లు అందుకున్న నీరాజనాల కంటే అమితమైన ఆదరణను సైతం దక్కించుకున్నాడు. 

క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడిగా మద్ర వేయించుకున్నాడు, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లో టెస్టు శతకాలు బాది, భారత క్రికెట్‌ చరిత్రలో దిగ్గజాలకు కూడా దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు. 

ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ కూడా ప్రతీ మ్యాచ్ కి ముందు అతగాడికి భారత జట్టులో చోటు దక్కుతుందాలేదా అనే చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. ఇంత ఉపోద్గాతం ఇచ్చింది ఎవరి గురించి అని అనుకుంటున్నారా... అతడే యువ క్రికెటర్ రిషబ్ పంత్. 

ఇప్పుడు మరోమారు టెస్ట్ సిరీస్ ప్రారంభమవబోతున్నవేళ పంత్ గురించి యధావిధిగా చర్చ మొదలయింది. మొన్నటి వార్మ్ అప్ టెస్టులో పంత్ చక్కని ప్రదర్శననే చేసాడు. ఆ ప్రదర్శనతో వెల్టింగ్టన్‌ టెస్టులో రిషబ్‌ పంత్‌ ఆడతాడా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

కీపింగ్ లో పంత్ శైలి వేరయా... 

వికెట్‌ కీపింగ్‌లో రిషబ్‌ పంత్‌ శైలే వేరు. అతని ఈ వింత శైలే అతడికి యువతలో క్రేజ్ ని తెచ్చిపెడితే... విమర్శకుల నుంచి ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది కూడా. రెగ్యులర్ వికెట్ కీపేర్ల మాదిరి కాకుండా పంత్ శైలి ఒకింత విభిన్నంగా ఉంటుంది. 

పేసర్లు వికెట్లకు దూరంగా విసిరిన బంతులను, బౌన్సర్లుగా సంధించిన బంతులు సహజంగా వికెట్ కీపర్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బైస్‌ రూపంలో బౌండరీని చేరుకుంటాయి. ఇలా వీటిని ఆపేందుకు సగటు కీపర్లలా కాకుండా, రిషబ్‌ పంత్‌ జిమ్నాస్టిక్స్‌ స్కిల్స్‌ ప్రదర్శిస్తుంటాడు. 

Also read; పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

గాల్లోకి ఎగిరి బంతిని అందుకోవటం, వికెట్‌కు ఇరువైపులా డైవ్‌ చేస్తూ గ్లౌవ్స్‌లోకి బంతిని తీసుకోవటం, గల్లీల్లో కుర్రాళ్ల తరహాలో పైకి జంప్‌ చేస్తూ స్లిప్స్‌లోని ఆటగాళ్లకు బంతిని అందించటం పంత్‌ వికెట్‌ కీపింగ్‌లో ఎక్కువగా చూస్తుంటాం. 

ఈ తరహా జిమ్నాస్టికల్‌ సన్నివేశాలు యువతలో పంత్‌కు క్రేజ్‌ను తీసుకొస్తే, వికెట్‌ కీపింగ్‌లో వైఫల్య ప్రదర్శనకు విశ్లేషకుల నుంచి విమర్శలు తెచ్చి పెడుతోంది. అసలు ప్రదర్శన పక్కకొదిలి, కొసరు ప్రదర్శనలపై ఫోకస్‌ పెడుతున్నాడని పంత్‌పై తరచుగా సోషల్‌ మీడియాలో విమర్శలు వినిపిస్తుంటాయి. 

ప్రతిభావంతుడు, ధోనీ వారసత్వం అందుకోగల సమర్ధుడు, భారత క్రికెట్లో తరుపు మొక్క.... ఇలాంటి వ్యాఖ్యలు యువ రిషబ్‌ పంత్‌పై ఒత్తిడి భారం పెంచాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు శతకాలు సాధించిన రిషబ్‌ పంత్‌.. సాహా జట్టులో లేని వేళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 

వరుస సెంచరీలతో జోరందుకున్న వేళ అంతా పంత్‌కు అనుకూలంగానే సాగుతుందని అనిపించింది. కానీ ఇంతలోనే స్వదేశంలో టెస్టు సీజన్‌ వచ్చేసరికి బెంచ్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. 

వాంఖడే వన్డే తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ పెవిలియన్‌ నుంచి మ్యాచ్‌ను చూడదమే తప్ప గ్రౌండ్లోకి దిగింది లేదు.  ఫిబ్రవరి 21 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తుది జట్టు కూర్పులో రిషబ్‌ పంత్‌ ఉంటాడా అనేది చర్చనీయాంశంగా మారింది. 

ప్రాక్టీస్‌లో పంత్‌కే ప్రాధాన్యం!

కోహ్లి, శాస్త్రిల హయాంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఆలోచనలు, తుది జట్టు కూర్పుపై ఓ అంచనాకు మనం అంత ఈజీగా రాలేము. ఈ రోజు ఓ ఆటగాడిని ఆకాశానికి ఎత్తేశారంటే, తర్వాతి మ్యాచ్‌కు అతడిని దూరం చేసిన సంఘటనలు ఎన్నో చూశాం. 

ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తర్వాత విదేశీ టెస్టుల్లో కుల్దీప్‌ యాదవ్‌ మా నెంబర్ వన్ స్పిన్నర్‌ అని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. కుల్దీప్‌ యాదవ్‌కు సిడ్నీ టెస్టే చివరి మ్యాచ్‌గా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు (బహుశా రవిశాస్త్రికి మాటల్లోని ఆంతర్యం అదేనేమో!) 

రిషబ్‌ పంత్‌ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సరైన రీతిలో వ్యవహరించలేదు. ఓ దశలో విమర్శకులు సైతం జాలిపడేలా జట్టు మేనేజ్‌మెంట్‌ పంత్‌ పై విమర్శలు గుప్పించింది. వాంఖడేలో ఆస్ట్రేలియాతో వన్డేలో తల బెదరటంతో పంత్‌ మైదానం వీడాడు. 

Also read; ధోనీ లేడు.. ఇదే పంత్ కి సరైన సమయం.. కెప్టెన్ కోహ్లీ

ఆ మ్యాచ్‌లో వికెట్‌ కీపింగ్‌ గ్లౌవ్స్‌ తొడుక్కున్న కెఎల్‌ రాహుల్‌, వాటిని ఇప్పుడప్పుడు తీసేలా కనిపించడంలేదు. జట్టుతో పాటు న్యూజిలాండ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ ఐదు టీ20, మూడు వన్డేలు ముగిసినా ఇంకా తొలి అవకాశం కోసం ఎదురుచూస్తునే ఉన్నాడు.  

వృద్దిమాన్‌ సాహా ఉండగా టెస్టుల్లోనూ పంత్‌కు అవకాశం లేదనే విషయాన్నీ అభిమానులు ఇప్పటికే జీర్ణం చేసేసుకున్నారు కూడా. దీంతో పంత్‌కు నిరాశ తప్పదనే భావన కనిపించింది. 

కాకపోతే విచిత్రంగా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత కల్పించింది. లంచ్‌కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ చేయగా.. లంచ్‌ తర్వాత ఒక్క సెషన్‌లో మాత్రమే వృద్దిమాన్‌ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు. 

బ్యాటింగ్‌లోనూ వృద్దిమాన్‌ సాహా కంటే ముందుగా పంత్‌ను పంపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇద్దరు నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్స్‌ల్లో 65 బంతుల్లో 70 పరుగులు చేసిన పంత్‌ తన చేయగలిగే ప్రదర్శన ఏంటో చూపించాడు. 

అవకాశం దక్కేనా....?

భారత పిచ్‌లపై పేస్‌తో పాటు సుదీర్ఘ సెషన్ల పాటు స్పిన్‌ను కూడా వికెట్ల వెనకాల కాచుకోవాలి. విదేశీ పిచ్‌లు అందుకు భిన్నం. స్వదేశంలో వికెట్‌ కీపర్‌ బ్యాటింగ్‌ సామర్థ్యంపై ఆధారపడాల్సిన అవసరం కోహ్లిసేనకు ఏ కోశాన ఉండదు. 

కానీ విదేశీ పిచ్‌లపై మూడో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేయగల ఓ బ్యాట్స్‌మన్‌ భారత్‌కు అవసరం. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం ప్రకారం సాహా ముందు వరుసలో ఉంటాడు. కానీ న్యూజిలాండ్‌ పిచ్‌లపై, వార్మప్‌లో పంత్‌ గ్లౌవ్స్‌తో మెరుగ్గానే రాణించాడు. 

న్యూజిలాండ్‌ పిచ్‌లపై బంతి స్వింగ్‌ అవుతుంది. బౌన్స్‌లో నిలకడ ఉంటుంది( భారత్‌లో బౌన్స్‌ అంత నిలకడగా ఉండదు) ఇక్కడ వికెట్‌ కీపర్లు ఎక్కువగా వికెట్లకు దూరంగానే నిల్చోని ఉండాలిసుంటుంది. 

తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించిన తర్వాత న్యూజిలాండ్‌ పిచ్‌లు క్రమంగా స్పిన్‌కు మొగ్గుచూపుతున్నాయి. నాల్గో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసేందుకు బౌలర్లకు తగినంత సమయం, ఓవర్లు ఇవ్వాలి. 

అందుకు మూడో ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు రాబట్టాలి. అందుకే కోహ్లి, శాస్త్రి విదేశీ పిచ్‌లపై రిషబ్‌ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునేందుకు ఎక్కువ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. 

న్యూజిలాండ్‌ జట్టులో అజాజ్‌ పటేల్‌ రూపంలో ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఉండాల్సిన అవసరం, స్పిన్నర్‌కు చెక్‌ పెట్టాలనే ఆలోచన సైతం పంత్‌ వెల్లింగ్టన్‌ టెస్టులో ఆడుతున్నాడనే సంకేతాలు అందిస్తున్నాయి. 

జట్టు ఎంపికలో ఎప్పటికప్పుడు నూతన పుంతలు తొక్కుతూ... ఎవరి ఊహలకు అందని రీతిలో వ్యవహరిస్తున్న కోహ్లీ, శాస్త్రి ద్వయం ఇప్పుడు పంత్ విషయంలో ఎం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios