వెస్టిండీస్ పర్యటనకు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. రెండు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చిన ధోనీ.. ఆర్మీలో చేరారు. అయితే... ధోనీ లేకపోవడంతో నెంబర్ 4 స్థానం యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి ఇచ్చారు. అయితే... తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టడానికి పంత్ కి ఇదే మంచి అవకాశం అని  టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నారు.

నేటి నుంచి టీం ఇండియా వెస్టిండీస్ తో తలపడనుంది.ఈ  సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడారు. రిషబ్ పంత్ చాలా నైపుణ్యం ఉన్న ఆటగాడని కొనియాడాడు. అయితే.. ఈ విండీస్ పర్యటనలో సత్తా చాటడానికి ఇదే పంత్ కి సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. ధోనీ లేని సమయాన్ని పంత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంత్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని... పరిస్థితులకు తగ్గట్టుగా ఆడతాడనే టీం ఇండియా మేనేజ్ మెంట్ ఆశిస్తోందని చెప్పారు.

నిలకడైన ఆటతో విండీస్ పర్యటనను పంత్ ఉపయోగించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు కోహ్లీ వివరించారు. ధోనీ అనుభవం తమకు ఎప్పుడూ కీలకమేనని చెప్పారు. హార్దిక్ పాండ్యా కూడా విశ్రాంతి తీసుకోవడంతో... ఈ పర్యటన యువ క్రికెటర్లకు మంచి ఛాన్స్ అని అన్నారు.