రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్ కు సంపూర్ణేష్ బాబు ఏం తక్కువ?
దర్శక, నిర్మాత కొత్త వివాదానికి దారి తీసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ తో సంపూర్ణేష్ బాబుకు పోలిక తెచ్చారు. అది సంపూర్ణేష్ బాబును అవమానించడమే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పలు వాదవివాదాలు దారి తీస్తోంది. సినిమా టికెట్ రేట్లను పెంచే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మొండికేసింది. అయితే, దానిపై సినీ వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తుున్నాయి. ఈ వివాదంలో ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా దూరారు. ఏపీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. ఇందులోకి సంపూర్ణేష్ బాబును లాగారు. అది మామూలుగా లాగితే ఫరవా లేదు. కానీ చేయకూడని వ్యాఖ్య చేశారు.
పవన్ కల్యాణ్ తో పోలుస్తూ సంపూర్ణేష్ బాబుపై వ్యాఖ్య చేశారు Pawn Kalyan సినిమాను Sampoornesh Babuను ఒకే గాటన కట్టేస్తారా అని ఆయన అడిగారు. అంటే, పవన్ కల్యాణ్ సినిమాలు ఏవో గొప్పవి, సంపూర్ణేష్ బాబు తక్కువ రకానివి అనేది ఆయన ఉద్దేశం. పవన్ కల్యాణ్ సినిమాలకు రేట్లు ఎక్కువ ఉండాలి, సంపూర్ణేష్ బాబు సినిమాలకు రేట్లు తక్కువ ఉండాలనే ధ్వని కూడా అందులో ఉంది. తెలుగు సినిమా దరిద్రానికి ఈ పోలిక అవసరమా అనిపిస్తుంది.
ఇప్పుడు Ram Gopal Varma వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చంకలు గుద్దుకుంటున్నారు. సరే, అది వారి ఇష్టం. కానీ సంపూర్ణేష్ బాబును అవమానించడం ఎంత వరకు సమంజసమనేది ప్రశ్న. మాస్ హీరోలకు తెలుగులో అభిమానుల సంపద దండిగానే ఉంది. వాళ్ల సినిమాలన్నీ ఫ్యాన్స్ ను ఉద్దేశించి తీస్తున్నవే తప్ప వాటిలో ఉన్న సీరియస్ నెస్ చాలా తక్కువ అనేది అందరికీ తెలుసు. ఒక వ్యక్తి సరే అత్యంత బలవంతుడే అనుకుందాం, వంద మంది ఒక్కడు చితకబాదడం, ఒక్క దెబ్బ కొడితే పది అడుగుల ఎత్తు (ఇంకా పైనే కావచ్చు) లేచి ఓ వ్యక్తి పడిపోవడం, ఇంకా చాలా చాలా అసందర్భ సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీనికి ఫ్యాన్స్ థియేటర్లలో పిచ్చిగంతులు వేస్తుంటారు. ఈలలు వేస్తుంటారు. సరే, అది వాళ్ల ఆనందం. వెర్రికి వేయి రూపాలు అనుకుందాం. ఆ సినిమాలు సామాన్యులను ఉద్దేశించి తీసేవి కావని అందరికీ తెలుసు.
Also Read: AP Ticket Prices: శత్రువుకి శత్రువు మరి మిత్రుడేగా!
సమస్య ఎక్కడ వచ్చిందంటే, భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ మస్తుగా ఉన్న హీరోను బట్టి వాస్తవదూరమైన సన్నివేశాలతో, సంఘటనలతో సినిమాలు తెలుగు రావడం ఒక సంప్రదాయంగా మారింది. పాత సినిమాల మాదిరిగా వాటికి ప్రజాదరణ లభించడం లేదనేది ఒప్పుకుని తీరాలి. గతంలో కుటుంబాలకు కుటుంబాలు ఎడ్ల బండ్లు కట్టుకుని సినిమాలకు వెళ్తుండేవాళ్లు. యాభై రోజులు, వంద రోజులు థియేటర్లలో సినిమాలు ఆడేవి. ఆ సినిమాలు సామాన్య ప్రజానీకానికి వినోదాన్ని పంచడంతో పాటు కొంత నీతిని కూడా బోధించేవి. ఎవర్ గ్రీన్ సినిమాలు తెలుగులో ఉన్నాయి, మచ్చుకు మాయాబజార్, మిస్సమ్మ... ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. పౌరాణిక గాథలకు కల్పితాలు జోడించి కూడా సినిమాలు తీశారు.
ఇప్పుడు, మాస్ హీరోతో సినిమా తీసి, మూడు రోజుల్లోనో, ఎక్కువలో ఎక్కువ వారం రోజుల్లో లాభాలను రాబట్టుకోవడానికి చూస్తున్నారు. అందువల్లనే బెనిఫిట్ షోలు, టికెట్లను ఎక్కువ రేట్లకు విక్రయించడం వంటి పద్ధతులు అమలులోకి వచ్చాయి. ఫ్యాన్స్ ఆ సినిమాలను చూడడానికి ఆతురత పడుతుంటారు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. అందులో కళాత్మక దృష్టి అనేది అక్కడక్కడ కనిపిస్తే అది ప్రేక్షకుల అదృష్టం. ఆ మాస్ హీరోలు తమ ఫ్యాన్ ఫాలోయింగ్ తో రాజకీయాలను కూడా శాసించడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కానీ పరోక్షంగా చాలా మంది అదే పనిచేస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఈ సందర్భంలో సంపూర్ణేష్ బాబు రంగంలోకి వచ్చారు. అందువల్ల సంపూర్ణేష్ బాబు సినీ రంగంలోకి ప్రవేశించిన సందర్భం అత్యంత కీలకమైందనేది మనం గుర్తించక తప్పదు. అతని ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలని భావిస్తున్న వర్తమాన సినిమాలను వెకిలి చేయడమేనని గుర్తించక తప్పదు. ఇదే సమయంలో మనం అల్లరి నరేష్ సినిమాలను కూడా గుర్తు చేసుకోవాలి. అందువల్ల సంపూర్ణేష్ బాబు పవన్ కల్యాణ్ కు ఎలా తక్కువ అవుతాడో రామ్ గోపాల్ వర్మ వివరించాల్సి ఉంటుంది. అలాగే, సంపూర్ణేష్ బాబు పేద బీసీ కుటుంబం నుంచి వచ్చినవారు. అలాగే, తెలంగాణలోని సిద్ధిపేటకు చెందినవారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆధిపత్య వర్గాలు ఏ విధమైన విలువలను చెలామణిలోకి తెస్తాయో అర్థం చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ ఎంత కాదన్నా ఆధిపత్య వర్గానికి చెందినవారు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీస్తున్న సినిమాలు ఎంత నాసిరకంగా ఉంటున్నాయో కూడా గుర్తించాల్సి ఉంటుంది.