Asianet News TeluguAsianet News Telugu

హార్డ్ కోర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎందుకంటే...

బండి సంజయ్ తో పాటుగా ధర్మపురి అరవింద్ పేరు కూడా బాగా వినపడింది. చివరి వరకు డీకే అరుణ, బండి సంజయ్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆసక్తికర పోరు నడిచినప్పటికీ... బండి సంజయ్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపెట్టినట్టు తెలుస్తుంది. 

Reasons behind bandi sanjay being appointed as telangna bjp president
Author
Karimnagar, First Published Mar 11, 2020, 5:53 PM IST

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. 

మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తాను బీసీని కాబట్టి, పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది తన హయాంలోనే కాబట్టి తనను కొనసాగిస్తారని లక్ష్మణ్ భావించారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు కూడా తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. బీజేపీలో ఎలాగూ ఒకరికి ఒకటే పదవి అనే సిద్ధాంతం ఉండడం వల్ల కిషన్ రెడ్డి రేసులో లేరు. 

బండి సంజయ్ తో పాటుగా ధర్మపురి అరవింద్ పేరు కూడా బాగా వినపడింది. చివరి వరకు డీకే అరుణ, బండి సంజయ్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆసక్తికర పోరు నడిచినప్పటికీ... బండి సంజయ్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపెట్టినట్టు తెలుస్తుంది. 

బండి సంజయ్ బ్యాక్ గ్రౌండ్... 

బండి సంజయ్ చిన్ననాటి నుండే ఆరెస్సెస్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేయడం వల్ల ఆయనకు స్వతహాగానే భావజాలం వంటబట్టింది. 12వ ఏటనే సంఘ్ లో చేరాడు. ఆరెస్సెస్ తో అప్పుడు మొదలైన అతని అనుబంధం నేటికీ కొనసాగుతుంది. 

చదువుకునే రోజుల్లో ఏబీవీపీ లో చాలా యాక్టీవ్ గా ఉండే బండి సంజయ్ ఆ తరువాత కరీంనగర్ పట్టాన అధ్యక్షుడిగా కూడా చేసాడు. అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదిగాడు. 

1996లో ఎల్కే అద్వానీ నిర్వహించిన సూరజ్ రథ్ యాత్ర సందర్భంగా అద్వానీ వైరథం నిరాటంకంగా సాగడానికి అన్ని తానై దగ్గరుండి చూసాడు సంజయ్. ఆ తరువాత 2005లో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిజెంతవరకు బండి సంజయ్ కార్పొరేటర్ గానే సేవలందించారు. 

ఎంపీ అయిన తరువాత....

ఎంపీగా గెలిచినా తరువాత బండి సంజయ్ చాలా ఆక్టివ్ గా మారారు. ఆయన నేరుగా తెరాస అధిష్టానంతోనే ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకున్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా తెరాస కు పక్కలో బల్లెంగా మారారు. 

అప్పట్లో కరీంనగర్ కి చెందిన ఆర్టీసీ కార్మికుడి మరణం సందర్భంగా ఆయన కు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఆయన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసారు. 

ఈటెల రాజేందర్ పార్టీ ఓనర్లు అని కామెంట్ చేసిన సందర్భంలో కూడా బీసీల ఆత్మ గౌరవం అంటూ ఆయన అప్పుడు వరుస ప్రసంగాలు చేసారు. తాజాగా ఆయన తనకు కల్పించిన సెక్యూరిటీని కూడా కాదని వారిని వెనక్కి పంపించేసి మరోసారి వార్తల్లో నిలిచారు. 

Also read: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

మొత్తానికి ఏమి చేసినా తన పాపులారిటీకి మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకున్నాడు. ఇలా తాను ఒక బలమైన నేతగా నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. 

బీజేపీ అధ్యక్ష మార్పు ఎందుకు...?

బీజేపీ తెలంగాణలో నాలుగు సుసీట్లు గెలిచినా తరువాత తన ప్రాబల్యాన్ని బలంగా పెంచుకోవాలని చూసింది. అందుకోసం కేంద్ర మంత్రులు ఇక్కడకు వరుస పర్యటనలు, అమిత్ షా క్రమం తప్పకుండా ఇక్కడకు రావాలి అనుకోవటం, తెలంగాణ నుండే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం ఇతరయాత్రలు అన్ని మొదలుపెట్టారు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. 

కనీసం తాము ఎంపీ స్థానాలు గెలిచినా చోట కూడా స్థానిక సంస్థలను గెలుచుకోలేకపోయింది. ఇక ఆ తరువాత కెసిఆర్ నేరుగా బీజేపీ వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించి డైరెక్ట్ గా ఎటాక్ మొదలుపెట్టాడు. 

దీన్ని బలంగా ఎదుర్కునే నేత ఎవరూ లేకపోవడం, ఉన్న అధ్యక్షుడు లక్ష్మణ్ మాటల్లో అంత వాడి లేకపోవడం ఇతరాత్ర కారణాలు బీజేపీని బ్యాక్ సీట్లోకి నెట్టేశాయి. 

గతంలో తెరాస, బీజేపీ మధ్య ఉన్న అప్రకటిత మైత్రి వల్ల రాష్ట్ర బీజేపీ బలమైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా బీజేపీ వర్సెస్ తెరాస గా తెలంగాణలో పరిస్థితులు మార్చాలనుకుంటున్న తరుణంలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరం. దానితోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. బీజేపీకి అవి అత్యంత కీలకం 

ఈ అన్ని కారణాల వల్ల బీజేపీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పును చేసి ఉండవచ్చు. 

బండి సంజయ్ కే ఛాన్స్ దక్కడం వెనుక... 

లక్ష్మణ్ అంత సమర్థవంతంగా బీజేపీ వానిని వినిపించలేకపోతున్న తరుణంలో వారు వేరే ప్రత్యామ్నాయాల వైపు చూసారు. డీకే అరుణ ఫైర్ బ్రాండ్ గా కనిపించినప్పటికీ... ఆమె కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేత. ఆమెను చేస్తే పార్టీలోని చాలా మంది పెదవి విరిచే ప్రమాదం కూడా ఉంది. 

ఇక సంఘ్ నుంచి వచ్చిన సంజయ్ వారికి ఒక మంచి ఆప్షన్ గా కనబడ్డాడు. దానికి తోడు అతను బీసీ కావడం అతడికి బాగా కలిసొచ్చిన అంశం. బీజేపీ తెలంగాణలోని బీసీలను టార్గెట్ చేయాలనీ భారీ స్కెచ్ వేసింది.

ప్రధాని మోడీ కూడా బీసీ అవడం. తెలంగాణాలో బీసీ జనాభా 50 శాతానికన్నా ఎక్కువగా ఉండడం ఇతరాత్రా కారణాల వల్ల బీసీ ఫాక్టర్ ని ప్లే చేయాలనుకుంది బీజేపీ. 

గతంలో కేసీఆర్ ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మాట తప్పాడు. ఇప్పుడు తాము మాత్రం అలా కాదని బీసీ ని ప్రధాన మంత్రి పీఠం ఎక్కించినవారము, సీఎం కుర్చీ కట్టబెట్టలేమా అని వాదించవచ్చు. 

కెసిఆర్, అసదుద్దీన్ ల మధ్య ఉన్న జుగల్ బందీని చూపెట్టి కెసిఆర్ ను హిందూ వ్యతిరేకి అని చూపెట్టాలని బలమైన ప్లాన్స్ వేస్తుంది బీజేపీ. అందుకోసం ముఖ్యంగా యువతను హిందుత్వకార్డును బలంగా ప్రయోగించి బీజేపీ వైపు ఆకర్షితులను చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి హిందుత్వ కార్డును తెలంగాణలో బలంగా వాడుతున్న నేత బండి సంజయ్. 

రాష్ట్రంలో ఇప్పటికే వెలమలు తెరాస వైపు ఉండగా రెడ్లు చాలా మంది తెరాస, కాంగ్రెస్ ల మధ్య ఉండిపోయారు. కాబట్టి అగ్రకులాలకన్నా కూడా ఒక బీసీని తెచ్చి ముందు పెట్టి బీజేపీకి అలవాటయిన బలమైన సోషల్ ఇంజనీరింగ్ ని నడిపి తెలంగాణలో పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్. 

Follow Us:
Download App:
  • android
  • ios