హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నియమితులయ్యారు. డాక్టర్ కె. లక్ష్మణ్ స్థానంలో ఆయన తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టున్నారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ను కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడంలో ఆయన ఇటీవలి కాలంలో చురుగ్గా వ్య.వహరిస్తున్నారు. బీసీ నేత కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.

ఆర్ఎస్ఎస్ మాత్రం సంజయ్ పేరును ప్రధానంగా సూచించినట్టుగా సమాచారం. అందులో భాగంగానే ఇటీవల పార్టీ కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ పార్టీ హైకమాండ్ జరిపింది. అభిప్రాయ సేకరణలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చినా... ఢిల్లీ పెద్దలు మాత్రం బండి సంజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది.

1992లో అయోధ్య కరసేవలో బండి సంజయ్ పాల్గొన్నారు. అప్పట్లో ఆయన 15 మందితో అయోధ్య కరసేవకు బయలుదేరారు. బండి సంజయ్ ఎబీవీపి, బిజెపి యువమోర్చాల్లో చురుగ్గా పనచేశారు.

బండి సంజయ్ 1971 జులై 11వ తేదీన నర్సయ్య, శకుంతల దంపతులకు జన్మించారు. కరీంనగర్ లోని సరస్వతి శిశు మందిర్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ లో కూడా చురుకైన పాత్ర నిర్వహించారు. 12 ఏళ్ల వయస్సులో ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరారు. తమిళనాడులోని ముదరై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 

ఆయన 2005లో కరీంనగర్ నగర పాలక సంస్థలోని 48వ డివిజన్ నుంచి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆయన పోటీ చేసారు.