Asianet News TeluguAsianet News Telugu

ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు.. డీఎస్ రాజీనామా వెనక మతలబేంటి?

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

political Clash in Dharmapuri Srinivas Family and Sanjay severe allegations on Arvind ksm
Author
First Published Mar 27, 2023, 6:47 PM IST

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్.. కాంగ్రెస్‌ గూటికి తిరిగి చేరేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేసి.. ఆదివారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సంజయ్‌తో పాటే డీఎస్ కూడా గాంధీ భవన్‌కు చేరుకుని.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

డీఎస్ పేరును పూర్తిగా సంజయ్ వాడుకునేందుకు ఉపయోగపడుతుంది. తండ్రి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పుకోవడం.. సంజయ్‌కు ప్లస్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సామాజిక వర్గం పరంగా ఓట్లను క్యాష్ చేసుకోవడానికి సంజయ్‌కే ఎక్కువ అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. దీంతో డీఎస్ కాంగ్రెస్‌లో చేరడం అనేది ఆయన చిన్న కుమారుడు అరవింద్‌కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. 

ఈ నేపథ్యంలోనే 24 గంటల్లో డీఎస్ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. అన్నదమ్ముల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలోనే.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మరుసటి రోజే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా డీఎస్ నుంచి లేఖ వెలువడినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖను డీఎస్ సతీమణి మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతలు గానీ, మీడియా గానీ అటువైపుకు రావొద్దని కామెంట్ చేశారు. డీఎస్‌ అనారోగ్యంతో ఉన్నారని.. ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ లేఖ కూడా విడుదల చేశారు. దీంతో చాలా కాలంగా ధర్మపురి సోదరుల మధ్య విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పుడు రచ్చకెక్కినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు కొడుకుల మధ్య రాజకీయ విభేదాలతో డీఎస్ కూడా నలిగిపోతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: డీఎస్‌ కుటుంబంలో చేరికల చిచ్చు.. కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా.. (వీడియో)

అయితే ఈ పరిణామాలకు అరవింద్‌ కారణమని సంజయ్ నిందిస్తున్నారు. ఈ క్రమంలోనే అరవింద్‌పై సంచలన ఆరోపణలు కూడా చేశారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని సంచలన కామెంట్స్ చేశారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని.. ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అరవింద్‌కు కొందరు సహకరిస్తున్నారని.. వాళ్లు ఎవరో తెలుసునని అన్నారు. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. అరవింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. అరవింద్ కారు డ్రైవర్‌ నేతృత్వంలోని ముఠానే ఈ పని చేస్తుందని ఆరోపించారు.

అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని విమర్శించారు. పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేస్తానని అన్నారు. అరవింద్ తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయాలకు వాడుకోవాలని చూడటం.. వారి క్యారెక్టర్‌ ఏమిటో చెబుతుందని అన్నారు. 

తన తండ్రి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. చుట్టు ఉన్నవాళ్లు కూడా ఎవరూ తన ఫోన్ ఎత్తడం లేదని అన్నారు. ఆయన సేఫ్ హ్యాండ్స్‌లోనే ఉన్నారా? అనే అనుమానం కూడా కలుగుతుందని చెప్పారు. అరవింద్ తన తండ్రిని బీజేపీలోకి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారని.. కానీ ఆ పార్టీలోకి వెళ్లడం ఇష్టం లేదని ఆయన తనకు పర్సనల్‌గా చెప్పారని అన్నారు. ఆయన ఆరోగ్యం అలా కావడానికి  వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. 

ఆదివారం తన తండ్రి గాంధీ భవన్‌కు వచ్చారని.. అక్కడ ఆయన మీడియాతో, నాయకులతో మాట్లాడారని.. ఆయన ఏం చెప్పారనేది అందరికీ తెలుసునని తెలిపారు. రాజీనామా లేఖ అనేది ఫేక్ అని అన్నారు. తన తల్లికి రాజకీయ నాయకురాలు కాదని.. ఆమె మాటలపై తాను స్పందించనని అన్నారు. కొన్నేళ్ల నుంచి తన తండ్రి, తాను చేస్తున్న ప్రయత్నాలు అంతా చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసిన సంగతి తెలిసిందేనని అన్నారు. అయితే సంజయ్ కామెంట్స్‌పై ఆయన సోదరుడు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. 

అరవింద్‌తో బీఆర్ఎస్‌లో డీఎస్‌కు ఎదురుగాలి..!
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వాలలో డీఎస్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్ గులాబీ గూటికి చేరి.. రాజ్యసభకు వెళ్లారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎస్ చిన్న కుమారుడు అరవింద్.. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు.. డీఎస్‌కు వ్యతిరేకంగా పావులు కదిపాయి. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ అధిష్టానంతో డీఎస్‌కు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి డీఎస్ యాక్టివ్ పాలిటిక్స్‌కు పూర్తిగా దూరమయ్యారు.

అరవింద్‌ వైపు తల్లి మొగ్గు..!
అయితే డీఎస్‌ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే.. ఇద్దరు కొడుకుల మధ్య సమస్య రాకుండా చూసేందుకు ఆయన సతీమణి విజయలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజీనామా లేఖను విడుదల చేయడం, కాంగ్రెస్ వాళ్లు అటువైపు రావడం చూస్తుంటే.. ఆమె కొంత చిన్న కుమారుడు అరవింద్ మొగ్గు చూపుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సంజయ్‌కు పూర్తి సమాచారం లేకుండానే ఈ పరిణామాలు చోటుచేసుకున్న పక్షంలో ఆ విశ్లేషణలకు మరింత బలం చేకూర్చినట్టుగా అవుతుంది.

Also Read: మా నాన్నకు ప్రాణహాని ఉంది.. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిది: డీఎస్ కుమారుడు సంజయ్ సంచలనం

మరోవైపు తాము డీఎస్‌ను పార్టీలో చేరాలనే, గాంధీ భవన్‌కు రమ్మని కోరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కామెంట్ చేయడం కూడా  ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు డీఎస్‌ను వాడుకొవద్దని  కాంగ్రెస్‌ను ఉద్దేశించి విజయలక్ష్మి కామెంట్ చేశారు.. అయితే రాజకీయాలపై ఆసక్తి లేకుంటే ఆయన వీల్  చైర్‌లో మరి గాంధీ భవన్‌కు ఎందుకు వచ్చారనే ప్రశ్న తలెత్తుతుంది. పెద్ద కొడుకుసంజయ్‌ ఒక్కడే  కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. అక్కడి వెళ్లాక డీఎస్ కండువా కప్పుకున్నారు. కండువా కప్పుతున్న సమయంలో డీఎస్‌ నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. ఆయన కాంగ్రెస్‌పై సానుకూలంగా ఉన్నాననే సంకేతాలను కడూ పంపించారు. ఇదే విషయాన్ని వీహెచ్ కూడా ప్రస్తావిస్తున్నారు. తాము డీఎస్‌ను పార్టీలోకి రమ్మని కోరలేదని.. ఆయన కండువా కప్పుతున్న సమయంలో ఎలాంటి వ్యతిరేక వ్యక్తం చేయలేదని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios