ప్రపంచమంతా కరోనా గడగడలాడిస్తున్న వేళ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం నెమ్మదిగా కనబడడం ఆరంభించింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు ఒక రకంగా తెలంగాణ షట్ డౌన్ నే ప్రకటించింది. 

ఇక తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇలా ఎన్నికలను వాయిదా వేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

ఏకంగా ఎన్నికల ప్రధానాధికారినేటార్గెట్ చేస్తూ హెచ్చరించారు. బాధ్యతగల ముఖ్యమంత్రి మరో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని గురించి అతడిని నియమించింది చంద్రబాబేనని, అతడి కులం చంద్రబాబు కులం ఒకటే అని ఫైర్ అయ్యారు. 

Also read: కరోనానే పట్టుకున్న చంద్రబాబు: చర్యలపై జగన్ వెనకంజ, కారణం ఇదే...

అది కూడా కొద్దిసేపు పక్కనపెడదాము. రాజకీయాలు ఆ స్థాయికి వచ్చాయి అని అనుకుందాం. ఇక కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కారొనకు పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తే సరిపోతుందని అన్నారు. 

ఇదే పారాసెటమాల్ గోలి వేస్తే కరోనా తగ్గిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అన్నారు. కానీ ఆయన అన్న సందర్భం వేరు. ఆయన ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి అలా అన్నారు. అది కూడా తప్పే కావొచ్చు. కానీ కెసిఆర్ స్టైల్ అలానే ఉంటుందని వదిలేయలేమో!

కానీ కరోనా నివారణ చర్యల విషయానికి వచ్చేసరికి మాత్రం కెసిఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఐసొలేషన్ వార్డుల ఏర్పాటు నుంచి మొదలు, స్కూళ్ళు కాలేజీలకు సెలవులివ్వడం వరకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన అనవసర భయాలు వద్దన్నాడు కానీ అప్రమత్తత విషయంలో ఎక్కడా రాజి పడకుండా చర్యలను తీసుకున్నారు. 

ఇక జగన్ అన్న మాటలను గనుక తీసుకుంటే... కరోనా వల్ల ఎన్నికలను వాయిదా ఎందుకు వేశారు అని అడుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలట్ బాక్సుల వినియోగం ఉంటుంది. స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల చేతులను తాకి మాత్రమే సిరా గుర్తును పెట్టాల్సి ఉంటది. 

ఇలా ప్రపంచమంతా కరచాలనాలకు కూడా దూరంగా ఉండమంటుంటే... ఇక్కడేమో కాంటాక్ట్ తప్పనిసరి అవుతుంది. ఇలా అంతమంది చేతులను తాకడం, ఒకటే సిరా బుద్ధిలో ముంచి ముంచి పూయడం ఇలాంటి వాటివల్ల ఒక వేళ వైరస్ ఉంటె అది ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది. 

మన భారతదేశంలో వైరస్ 6 రోజుల్లో రెట్టింపు అయ్యింది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. అవును జగన్ గారు చెప్పినట్టు కరోనా ను పారాసెటమోల్ గోలినే ఇస్తారు.(వైరస్ వల్ల వచ్చే ఏ జబ్బుకూ మందు లేదు కాబట్టి కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్సను అందిస్తారు. ) 

Also read: ఎవడో ఆర్డర్ రాస్తున్నాడు, రమేశ్ కుమార్ చదువుతున్నాడు: ఈసీపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు

కరోనా వల్ల వయసు పైబడ్డవారికే అధిక ప్రమాదం. అది కూడా కరెక్టే! అనారోగ్యాలతో బాధపడే వారికి కూడా ప్రమాదమే అని అన్నారు. అవును. ఈ మధ్యకాలంలో బీపీ, షుగర్లు లేని మనుషులు చాలా అరుదుగా కనబడుతున్నారు. 40 ఏండ్ల వయసుకే బీపీ షుగర్ అనేవి కామన్ అయిపోయాయి. 

ఇలా ఈ ప్రోల్మ్స్ ఉన్నవారిపై కరోనా చాలా ప్రభావం చూపెడుతుంది. ఒక్కసారి ఒక్క వైరస్ ఉన్న వ్యక్తి గనుక ఇలా బయట తిరిగి అంటించిపోతే.... ఇక అది దావానలంలా వ్యాపిస్తుంది. 

అందునా స్థానిక సంస్థల ఎన్నికలను అభ్యర్థులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. స్థానిక ఎన్నికల ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో వేరుగా చెప్పనవసరం లేదు. ఈ ఎన్నికల కోసం తమవారిని వేరే ఊర్ల నుండి దేశాల నుండి పిలిపించుకుంటారు. 

వైరస్ లక్షణాలు బయటపడడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. కొందరిలో జ్వరం కూడా ఉండదు. ఇలాంటి వ్యక్తి గనుక వచ్చి ఒక్కసారి ఎన్నికలప్పుడు తిరిగితే... దాని ప్రభావానికి చాలామంది గురవ్వాల్సి వస్తుంది. ఒకటేసారి ఒక 10వేళా మందిని క్వారంటైన్ చేయడానికి కూడా వసతులు ఇప్పటికిప్పుడు లేవు. 

హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల నుంచి చాలామంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది ఖచ్చితం. అలాంటప్పుడు వారిలో ఏ ఒక్కరికన్నా వైరస్ ఉంటె... ఎన్నికప్పుడు అందరిని కలవడం జరుగుతుంది. దాదాపుగా ఒక ఊరికే అది సోకె ప్రమాదముంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థే కరోనా ను మహమ్మారిగా ప్రకటించినా, ప్రపంచ దేశాలన్నీ రెడ్ అలెర్ట్ లు ప్రకటించిన, పక్కనున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ స్కూళ్ల నుండి షాపింగ్ మాల్స్ వరకు అన్నిటిని బంద్ చేసినా జగన్ మాత్రం ఎన్నికలను నిర్వహించడం మీదనే దృష్టి పెట్టడం నిజంగా శోచనీయం. 

అక్కడితో ఆగకుండా ఆరు వారల తరువాత పరిస్థితి మారుతుందా అని ప్రశ్నిస్తున్నారంటే.... కరోనా ఇంకా ఉండాలని జగన్ కోరుకుంటున్నట్టా, లేదా ఇంకా నెలన్నర తరువాత కూడా కరోనా వదలదు అనా? కరోనా గనుక ఇంకో నెలన్నర పాటు పట్టి పీడిస్తే మాత్రం ప్రపంచం చవి చూసిన అతిపెద్ద మహమ్మారిగా ఇది మిగిలిపోతుందనడంలో నో డౌట్!