ఎన్నికల కమీషనరేట్‌లో ఉన్న సెక్రటరీకి ఇలాంటి ఆర్డర్ ఒకటి తయారవుతున్నట్లు తెలియదని.. ఎవరో రాస్తున్నారని, ఎవరో ఆదేశాలు ఇస్తున్నారని అప్పుడు రమేశ్ కుమార్ చదువుతున్నారని సీఎం ఆరోపించారు. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు సీఎం జగన్.

ఈయనను తమ ప్రభుత్వం నియమించలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమించారని జగన్ గుర్తుచేశారు.

Also Read:స్థానిక ఎన్నికలపై ఈసీ సీరియస్: వేటు పడిన అధికారులు వీరే...

ఎన్నికల కమీషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్ఫాక్షకతని.. అదే సమయంలో రమేశ్ విచక్షణ సైతం కోల్పోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదైనా అధికారి విధులు నిర్వర్తించేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని అలాంటప్పుడే ఆ వ్యక్తికి లేదా అధికారికి గౌరవం కలుగుతుందన్నారు.

రమేశ్ కుమార్ ఒకవైపు కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పి,  అదే ప్రెస్‌మీట్‌లో గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మరికొంతమంది అధికారులను బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు.

ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల అధికారి విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చునని జగన్ సూచించారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి పవర్ ఉంటుందా.. రమేశ్ కుమార్ అనే అధికారికి ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు.

Also Read:పారాసిటమాల్: కరోనా వైరస్‌పై కేసీఆర్ మాటే.. జగన్ నోట

అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కుడుందన్న ఆయన ఈ మధ్యకాలంలో అందరూ విచక్షణాధికారం అనే మాట వాడేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీలను, కలెక్టర్లను మార్చడంతో పాటు పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటున్నారని ఇదంతా తనకు ఆశ్చర్యంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు.. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకన్న ఆయన ఎన్నికల కమీషనర్లనే ముఖ్యమంత్రిగా చేసేయవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.