కేసీఆర్ కు సవాల్: బిజెపి అమ్ములపొదిలోకి మరిన్ని అస్త్రాలు
ఈటెల అంకం మొదలవగానే రాష్ట్రంలోని మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస లో ఇమడలేక బయటకు వెళదామనుకునే వారికి బీజేపీ మాత్రమే అవకాశంగా కనబడుతుంది.
తెలంగాణాలో రాజకీయాలు మంచి కాక మీదున్నాయి. ఈటెల అంకం మొదలవగానే రాష్ట్రంలోని మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస లో ఇమడలేక బయటకు వెళదామనుకునే వారికి బీజేపీ మాత్రమే అవకాశంగా కనబడుతుంది. నాయకుడు లేని కాంగ్రెస్ వైపు ఎవరు కూడా తలెత్తి కూడా చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని నేతలే బయటకు వచ్చారు, వస్తున్నారు.
ఇకపోతే తెరాస ఎన్నికల్లో విజయం సాధించడం ఇది రెండవసారి. 2014, 2018ల్లో అద్భుత విజయాన్ని సాధించిన తెరాస ఈ దఫా గట్టి పోటీని ఎదుర్కోబోతుంది. దుబ్బాక, గ్రేటర్ గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ... ఎమ్మెల్సీ ఫలితాలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలతో చతికిలపడింది. ఈటెల రాజేందర్ చేరికతో మరోసారి జోష్ కనబడుతుంది. ఈ జోష్ ని మెయింటైన్ చేయాలనీ చూస్తున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతూ తెరాస లోని అసమ్మతులకు గాలం వేస్తుంది.
Also Read: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజీనామా.. కేటీఆర్‌కే ఆ పోస్ట్, ఫిక్స్!
ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఈటెల తరహాలోనే మరో కీలక నేత, సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా మెదిలిన, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఈటెల టీఆర్ఎస్ నుంచి దూరమవడం ఆ పార్టీ సహా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపింది.
ఇదే సందర్భంలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్నది. వారంతా ఈటెల రాజేందర్ వెంటే కమలం పార్టీలోకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది రాజకీయవిశ్లేషకుల మాట. తాజాగా, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా టీఆర్ఎస్ గుమ్మం విడిచి కమలం పార్టీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని చర్చ నడుస్తున్నది. ఆయన బీజేపీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కొన్నివర్గాలు వెల్లడించాయి.
కొన్నాళ్లుగా టీఆర్ఎస్ అధిష్టానం తనను ఖాతరు చేయడం లేదన్న అసంతృప్తి ఆయనలో కొనసాగుతున్నట్టు తెలిసింది. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ తన అనుచరులకు అవకాశం ఇవ్వడం లేదన్న కినుక ఉన్నది. ఈ విషయాలన్నీ ఆయన నేరుగా సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని, దీంతో టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పడమే తరువాయి అనే చర్చ ఊపందుకున్నది.
Also Read: ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: ఈటలపై గంగుల ఫైర్
ఈటెల చేరికతో మరోసారి జోరుమీదున్న బీజేపీ.... ఆ జోష్ ని కంటిన్యూ చేస్తూ ఎంపీ బీబీ పాటిల్‌నూ పార్టీలో చేర్చుకోవడానికి ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్‌లోని ఇతర అసంతృప్తులకూ గాలం వేస్తున్నట్టు సమాచారం. ఈటెల దారిలోనే నడిచేందుకు అసంతృప్తులూ యోచిస్తున్నట్టు తెలుస్తుంది, వెరసి బీజేపీ అమ్ములపొది మరింత బలపడుతున్నది. మరి టీఆర్ఎస్ అసంతృప్తులను ఎలా శాంతపరుస్తుందో వేచి చూడాల్సిందే..!