Asianet News TeluguAsianet News Telugu

విశాఖపై వైఎస్ జగన్ క్లియర్: చిరంజీవి బ్యాచ్ తో చెప్పిన మాటల ఆంతర్యం అదే...

ఏపి రాజధానిని విశాఖకు తరలించాలనే దృఢచిత్తంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు అర్థమవుతోంది. చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులతో విశాఖ గురించి చెప్పిన మాటలను బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

Meeting with Chiranjeevi lead celebroties: YS Jagan clears on Visakhapatnam as capital
Author
Amaravati, First Published Feb 10, 2022, 5:44 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని లేదా రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైఎఎస్ జగన్ చేసిన ఆలోచనలో ఏ మాత్రం మార్పు లేదని మరోసారి స్పష్టమైంది. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి తదితరులతో జరిగిన భేటీలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వారితో చర్చల సందర్భంలో జగన్ విశాఖపట్నంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 

మనమంతా విశాఖకు వెళ్లాల్సిన వాళ్లమే అని ఆయన సూటిగా చెప్పారు. అంటే Vizag పాలనా రాజధాని అవుతుందనే విషయాన్ని ఆయన మాటల ద్వారా జగన్ స్పష్టం చేశారని చెప్పవచ్చు. విశాఖ ప్రాధాన్యం గురించి ఆయన మరింతగా విస్తరించి చెప్పారు. విశాఖలో జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన సూచించారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినీ పరిశ్రమ విస్తరించి ఉంది. ఫిల్మ్ నగర్ గా అది ప్రసిద్ధి పొందింది. హైదరాబాదులో పలు సినీ ప్రముఖులు స్టూడియోలు కూడా పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావడంతో హైదరాబాదు కేంద్రంగా సినీ పరిశ్రమ విస్తరించింది. 

మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలి వచ్చి స్థిరపడి విస్తరిస్తూ వచ్చింది. ఈ స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. చాలా మంది సినీ ప్రముఖులు Hyderabadలో స్థిరపడ్డారు. వారు ఆస్తులు కూడా పెరిగాయి. ఈ స్థితిలో తెలుగు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శ ఉంది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను గణనీయంగా తగ్గించడంతో, సినీ ప్రదర్శనలపై ఆంక్షలు పెట్టడంతో టాలీవుడ్ లో కదలిక వచ్చింది. దాంతో వైఎస్ జగన్ తో చిరంజీవి తొలివిడత చర్చలు జరిపారు. ఈ రోజు అంటే గురువారం మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి వంటి ప్రముఖులతో కలిసి జగన్ తో Chiranjeevi సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే జగన్ విశాఖ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తెలుగు సినీ రంగానికి కొన్ని మార్గదర్శకాలను కూడా రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. 

విశాఖలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని కూడా జగన్ చిరంజీవి బ్యాచ్ కు హామీ ఇచ్చారు. హైదరాబాదు. చెన్నై, బెంగళూరుల మాదిరిగా అభివృద్ధి చెందే గుణం విశాఖకు ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ విస్తరించడానికి పనిచేయాలని వారికి చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆదాయం ఎక్కువగా వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ నుంచి 40 శాతం ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి 60 శాతం వస్తుందని ఆయన చెప్పారు. 

చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులతో జగన్ మాటలను బట్టి రాజధానిని తరలించాలనే దృఢచిత్తంతోనే YS Jagan ఉన్నట్లు అర్థమవుతోంది. అమరావతిని కార్య నిర్వాక రాజధానిగా, Visakhaను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని జగన్ ఆలోచన చేసి, దాన్ని కార్యరూపంలో పెట్టేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు ఆ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు అమరావతి దాన్ని ప్రాధాన్యాన్ని కోల్పోతూ వస్తోంది. 

చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించి అభివృద్ధి చేయడానికి పూనుకుంది. అయితే, భూసేకరణ విషయంలో పలు విమర్ళలు వచ్చాయి. దాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అమరావతి ప్రాధాన్యాన్ని తగిస్తూ వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios