మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. జ్యోతిరాదిత్య సింధియా మోడీని కలుస్తున్నారన్న వార్త వెలువడ్డప్పటి నుండి జ్యోతిరాదిత్య బీజేపీలో చేరుతున్నారా లేదా ప్రాంతీయ పార్టీ పెడతారా అనే చర్చ మొదలయింది. కానీ ఆయన పార్టీని వీడడం, రాజీనామా చేయడం, బీజేపీలోకి వెళ్తాడన్న వార్త ధృవీకృతమవడంతో ఇక అన్ని ఊహాగానాలకు బ్రేక్ పడింది. 

ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉండి, అక్కడ అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఇలా బయటకు పోవడం ఏమిటని కొందరు పార్టీలోని సీనియర్లు వాపోతున్నారు. గతంలో సింధియా ఇలా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పినప్పటికీ సింధియాల కుటుంబం అలా చేయదు అని చాలామంది భావించారు. 

అప్పుడు నానమ్మ... ఇప్పుడు మనవడు 

కానీ వాస్తవానికి ఇక్కడొక ఆసక్తికర అంశం దాగి ఉంది. వాస్తవానికి సింధియాల కుటుంబం రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జ్యోతిరాదిత్య సింధియా నాన్నమ్మ విజయరాజే సింధియా గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి జన సంఘ్ లో చేరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. 

ఇప్పుడు ఆమె మనవడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరి మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు. చూస్తుంటే చరిత్ర మరోసారి పునరావృతమవుతుందన్న విషయం తెలియవస్తుంది. 

Also read: కమల్ నాథ్ అవుట్: ఎంపీ లోనూ కర్ణాటక ఫార్ములా, లెక్కలు ఇవీ!

1967 లో ఆమె అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ ని వీడి జనసంఘ్ లో చేరి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ద్వారకా ప్రసాద్ మిశ్ర ప్రభుత్వాన్ని కూల్చారు. ఇప్పుడు సరిగ్గా 53 సంవత్సరాల తరువాత మరల అదే సీన్ రిపీట్ అవుతుంది. చూస్తుంటే మనవడు నానమ్మ బాటలో పయనిస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది. 

ఆమె ఆ తరువాత బీజేపీలో చాలా కాలంపాటు కొనసాగారు 1998లో అనారోగ్య కారణాల వల్ల పార్టీ నుండి బయటకు వచ్చేంతవరకు ఆమె పార్టీ ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. ఆమె వరుసగా 1989 నుండి తాను రాజకీయాల్లోంచి తప్పుకునేంతవరకు గుణ నియోజకవర్గాన్ని వరుసగా గెలుస్తూ వచ్చింది. 

ఆమె అప్పట్లో బాబ్రీ మస్జీద్ ని కూల్చివేసినప్పుడు తాను ఇంకా సంతోషంగా కన్నుమూస్తానని, తన కోరిక తీరిందని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసారు. ఇంకో విషయం ఈమెను ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ అరెస్ట్ చేయించింది. 

మాధవరావు సింధియా కూడా బీజేపీ నుంచి గెలిచినవాడే... 

జ్యోతిరాదిత్య సింధియా  తండ్రి మాధవరావు సింధియా తండ్రి కూడా తొలుత బీజేపీ నుంచి గెలిచిన వాడే. 1971లో ఇందిరా వేవ్ ను కూడా ఎదుర్కొని గ్వాలియర్ ప్రాంతం నుంచి ముగ్గురు జనసంఘ్ నేతలు గెలిచారు. వారిలో ఒకరు మాజీప్రధాని అటల్ బిహారి వాజపేయి కాగా మరో ఇద్దరు తల్లి కొడుకులు విజయ   సింధియా. 

ఆ తరువాత మాధవరావు సింధియా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తల్లి కొడుకుల మధ్య బాహాటంగానే ఆస్తి వివాదాలు నడిచాయి. పార్టీలు కూడా వెరవడం వల్ల తగాదాలకు రాజకీయ రంగు కూడా అంటూ కోవడంతో అవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. 

జ్యోతిరాదిత్య సింధియా అత్త మాజీ రాజస్థాన్ సీఎం... 

మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్వయానా జ్యోతిరాదిత్య సింధియాకు మేనత్త. తన తండ్రి మాధవరావు సింధియా తోబుట్టువు. ఆమె కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు. మరో మేనత్త యశోధరా రాజే సింధియా మధ్యప్రదేశ్ మాజీ మంత్రి. ఆమె క్కోడా బీజేపీలోనే కొనసాగుతున్నారు. 

ఇక ఇప్పుడు చెప్పండి సింధియా కుటుంబీకులు అత్యధికులు బీజేపీలో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? ఒక్క మాధవరావు సింధియా కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన యావత్ సింధియాల కుటుంబం గాంధీల కుటుంబానికి విశ్వాసపాత్రులు అని అనుకోలేము. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు కదా!

Also read: సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం

కానీ చరిత్ర పునరావృతమవుతుందనే విషయం మాత్రం ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. అప్పుడు నానమ్మ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే.... ఇప్పుడు మనవడి కారణంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.