Kuppam Municipality Election: చంద్రబాబుకు అగ్నిపరీక్ష
కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అగ్నిపరీక్ష కానుంది. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ చంద్రబాబును వచ్చే ఎన్నికలనాటికి బలహీనపరిచే వ్యూహం రచిస్తోంది.
చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి అగ్నిపరీక్ష కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో Chandrababu సొంత నియోజకవర్గం కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పాగా వేసింది. Kuppamలో వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును పూర్తిగా బలహీనపరిచాలనే జగన్ వ్యూహంలో భాగంగా మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక కూడా ఉంది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. పరిషత్ ఎన్నికల్లోనూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కుప్పం నియోజకవర్గం పరిధిలోని మొత్తం నాలుగు జడ్పీటీసీలను, మెజారిటీ ఎంపీటీసీలను గెలుచుకుంది. దానికితోడు YSR Congress party సానుభూతిపరులు 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు.
ఆ స్థితిలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక చంద్రబాబుకు, TDPకి అగ్నిపరీక్ష పెట్టనుంది. వచ్చే సాధారణ ఎన్నికలో టీడీపీ పరిస్థితి ఏమిటనే సంకేతాలను ఈ ఎన్నిక ఇస్తుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కుప్పంలో టీడీపీని తుడిచిపెట్టాలనే వ్యూహంతో, అందుకు తగిన ప్రణాళికతో ముందుకు పోతోంది. పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కుప్పం మున్సిపాలిటీలో కూడా పునరావృతం చేయడానికి వైఎస్ జగన్ తగిన వ్యూహరచన చేసి మంత్రులకు, శాసనసభ్యులకు, సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు
కుప్పం శ్రీప్రియ నర్సింగ్ హోమ్ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్ ను అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తన కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆసరా చెక్కులు పంపిణీ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గతవారం బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు పార్లమెంటు సభ్యుడు పి. మిథున్ రెడ్డి హాజరయ్యారు. కుప్పం మున్సిపాలిటీకి వరాల వర్షం కురిపించారు. కుప్పం మున్సిపాలిటీలో గాండ్ల, బలిజ సామాజికవర్గాల ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో వారి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చింది.
Also Read: ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన అన్ని చర్యలనూ మరో వైపు టీడీపీ తీసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవి చూసిన టీడీపీ కార్యకర్తల్లో నైతిక స్థయిర్యాన్ని పెంచడానికి, తమ బలాన్ని నిరూపించుకోవడానికి కుప్పం మున్సిపల్ ఎన్నికను సీరియస్ గా తీసుకుంటోంది.
పాపులారిటీ గ్రాఫ్ పడిపోయిన నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పర్యటించారు మున్సిపల్ ఎన్నికను ఆయన తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కుప్పంలోని ఇంటింటికి వెళ్లి తమ వైఖరిని తెలియజేయడమే కాకుండా వివిధ సమస్యలపై వివరించాలని ఆయన పార్టీ నేతలకు, అభ్యర్థులకు సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.
కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి చంద్రబాబు న్యాయవాది, మాజీ సర్పంచ్ త్రిలోక్ నాయుడిని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మాజీ అమర్నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పి. నాని, పార్టీ పరిశీలకులు ఇప్పటికే కుప్పం నగరానికి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధించిపెట్టడానికి వారు అహోరాత్రులు పనిచేస్తున్నారు. మొత్తం మీద కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక చంద్రబాబుకు అగ్నిపరీక్ష కానుంది.