హైదరాబాద్: బిజెపిని ఎదుర్కోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహాన్నే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనుసరించినట్లు కనిపిస్తున్నారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు వేటికీ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వలేదు. జాతీయవాదం గురించి, హిందూత్వం గురించి బిజెపి చేసిన వ్యాఖ్యలకు వేటికీ ఆయన సమాధానం ఇవ్వలేదు. 

తాను చేసిన సేవలను, తాను అందించిన పథకాలను ప్రజలకు తన ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ వెళ్లారు. అదే సమయంలో తాను హిందువులకు వ్యతిరేకం కాదని మాత్రమే కాదు, తానూ హిందువునే అని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించారు. సీఏఏపై బిజెపి లేవనెత్తిన సవాల్ కు ఆయన జవాబు చెప్పలేదు.  

Also Read: కేసీఆర్ ఆశలు గల్లంతు: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ముందు ఢీలా

తానూ హిందువునే అనే పదే పదే చాటుకోవడానికి ప్రయత్నించారు. హనుమాన్ చాలీసాను వల్లించారు. విజయం సాధించిన తర్వాత మంగళవారం విజయం ఓ మహిమ అని అన్నాడు. హనుమంతుడికి మొక్కాడు, కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ రద్దును సమర్థించాడు. అంతే కాకుండా సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీపై కాల్పులు జరిగిన తర్వాత అక్కడికి వెళ్లలేదు. దానిపై వ్యాఖ్యలు కూడా చేయలేదు. 

హిందువుల్లో వ్యతిరేక భావన రాకుండా ముస్లింలకు ఆగ్రహం తెప్పించకుండా ఆయన పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించాడు. తాను హిందువునని చాటుకుంటేనే ముస్లింలు దూరంగా కాకుండా చూసుకున్నారు. ఇదే వ్యూహాన్ని కేసీఆర్ అనుసరిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్ తో పోలిస్తే కేసీఆర్ అతివాదిగా కూడా కనిపిస్తారు. 

Also Read: ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్

బిజెపి నేతల విధానాన్ని పలుమార్లు మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో తీవ్రంగా దుమ్మెత్తిపోసిన చరిత్ర కేసీఆర్ కు ఉంది. తాను హిందువునే అని, తన కన్నా గొప్ప హిందువు ఎవరూ ఉండరని ఆయన చెప్పుకున్నారు. తాను యాగాలు చేస్తున్న విషయాన్ని, చినజీయర్ స్వామి ముందు మోకరిల్లుతున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ, తాను లౌకిక విధానాన్ని అనుసరిస్తానని, బిజెపి మత రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ బాహాటంగా చెబుతూ వస్తున్నారు. 

భైంసాలో జరిగిన హింసను కూడా కేసీఆర్ బిజెపికి అంటగట్టారు. బిజెపి వల్లనే అది జరిగిందని ఆయన అన్నారు. అదే సమయంలో ఆయన అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎంను స్పష్టంగా వెనకేసుకొస్తూ వస్తున్నారు. తాను హిందువును అని చాటుకుంటూనే ఓవైసీతో దోస్తీ చేయడం కేసీఆర్ కు కలిసి వస్తోంది. ఆ రకంగా ఆయన బిజెపిని ఎదుర్కుంటూ వస్తున్నారు. 

కేసీఆర్ ను అసదుద్దీన్ ఓవైసీ అన్ని విధాలా వెనకేసుకుని వస్తున్నారు. కేసీఆర్ ను మించిన లౌకికవాది మరొకరు లేరని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంతో అవగాహనకు కూడా వచ్చారు. రెండు పార్టీలు నగర పాలక సంస్థల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులను పంచుకున్నాయి. అయినప్పటికీ హిందువులు తెలంగాణలో కేసీఆర్ వైపే ఉన్నారు. ముస్లింలు తోడుగా వస్తున్నారు. ఇదే విధానాన్ని కాస్తా తక్కువ స్థాయిలో కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అనుసరించారు.