జాతీయ రాజకీయాల్లో ‘జై కిసాన్, జై జవాన్’ నినాదం కేసీఆర్‌ను గట్టెక్కిస్తుందా?

జాతీయ రాజకీయాల్లో రాణించాలని పార్టీ విస్తరణ చేపడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా కిసాన్, జవాన్‌లను అస్త్రంగా మలుచుకుంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వీటికితోడు రైతు ప్రభుత్వం, కిసాన్‌ను గౌరవించే పార్టీగా కేసీఆర్ తరుచూ చెబుతున్నారు.
 

kcr aiming brs expansion his weapons are kisan and jawan kms-sir

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచారు. ముందుగా ఆయన మహారాష్ట్రలో ప్రధానంగా దృష్టి సారించారు. అందుకే పలుమార్లు మహారాష్ట్ర పర్యటన చేస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వల్లెవేస్తున్నారు. 

ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీల బెడద ఎప్పుడూ ఉండనే ఉన్నది. దీని నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి పార్టీ విస్తరించి జాతీయ రాజకీయాల్లో ముద్ర వేయాలని స్కెచ్ వేశారు. జాతీయ రాజకీయాల్లో విస్తరణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కిసాన్, జవాన్‌ నినాదాలను ప్రధానంగా ముందు పెట్టుకున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా జరిగినప్పుడు కేసీఆర్ వారికి మద్దతు ప్రకటించడం.. మరణించిన పంజాబ్ రైతులకు పరిహారం ప్రకటించి కిసాన్ సంక్షేమం తమకు ప్రధానమనే అభిప్రాయాన్ని జాతీయ రాజకీయాల్లో వేసే ప్రయత్నం చేశారు.

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేసీఆర్ కేంద్రంపై పోరు ప్రారంభించినప్పుడు ప్రముఖ రైతు నేత, యూపీ లీడర్ రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు. ఒకే వేదికను పంచుకుని కేంద్రం తీరును ఎండగట్టారు. రైతు సంక్షేమమే తమకు ప్రధానమని చెబుతూ.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని బీఆర్ఎస్ బలంగా ముందకు తీసుకెళ్లుతున్నది.

ప్రస్తుత రాజకీయ తరుణంలో జాతీయవాద భావాలు సులువుగా యువతలోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో భాగంగానే కేసీఆర్ కిసాన్‌తోపాటు జవాన్ అని కూడా అంటున్నారు. గాల్వాన్ లోయలో నల్గొండకు చెందిన కల్నల్ సంతోష్ మరణించడంపై సీఎం కేసీఆర్ స్పందించి ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ. 1 కోటి చెక్కు, బంజారహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని సంతోష్ భార్యక అందించారు. దేశ రక్షణ కోసం అమరుడయ్యాడని సంతోష్‌కు నివాళి అర్పించారు.

Also Read: ఫ్రాన్స్‌లో అల్లర్ల కట్టడి యోగినే సరైన వ్యక్తి.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్ వైరల్

తాజాగా కేసీఆర్ మహారాష్ట్రలోనూ జవాన్ సెంటిమెంట్‌ను ముందుకు తెచ్చారు. అక్కడ మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది బీఆర్ఎస్ చెబుతున్న జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని పరిపూర్ణం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలో మరాఠా రెజిమెంట్ సైన్యంలో కీలకమైన రెజిమెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్సేతర కూటమి కోసం, అదే థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కానీ, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. పట్నా సమావేశానికి బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందకపోవడంతో కేసీఆర్ సొంత ఎజెండాతో జాతీయ రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీలు ఒకదానికి మరోటి హానీ చేసుకోకుండా సీట్ల పంపిణీ చేసుకునే ప్రతిపాదనపై ఈసారి విపక్ష కూటమి ఏకమవుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం మహారాష్ట్రలోకి వెళ్లి అక్కడ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మహారాష్ట్రలోన ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూడా జవాన్ సెంటిమెంట్‌ను సమర్థంగా తెరపైకి తెస్తున్న ఘటనలు చూశాం. అయితే, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ రాణించడానికి కిసాన్, జవాన్ నినాదం ఏ మేరకు కలిసి వస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios