మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది.  జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా నేపథ్యంలో ఏర్పడ్డ అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. తన వర్గ ఎమ్మెల్యేలను బెంగళూరులో ఉంచి కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేకుండా చేయగలిగారు సింధియా. 

అనుకోని రీతిలో సింధియా బయటకు వచ్చే పరిస్థితులను కనిపెట్టుకొని  బీజేపీ అందుకు అనుకూలంగా  పావులు కదిపింది.  వారి కష్టానికి సింధియా తిరుగుబాటుకు తగ్గ ఫలితం దక్కింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసారు. 

సింధియా వర్గ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తరువాత కూడా కమల్ నాథ్ తమకు సంఖ్యాబలం ఉందని వాదిస్తూ వచ్చింది. ఎప్పుడు బలపరీక్ష నిర్వహించినా తాము నెగ్గుతామని చెప్పుకొచ్చిన కమల్ నాథ్ సర్కార్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినా కూడా ఫలితం దక్కలేదు. 

Also read: చేతులెత్తేసిన కమల్ నాథ్: బలపరీక్షకు ముందే రాజీనామా, బిజెపిపై ఫైర్

ఎమ్మెల్యేలు  తిరుగుబాటు చేసిన తరువాత వాస్తవానికి సంఖ్యాబలం లేకున్నప్పటికీ.... ఎమ్మెల్యేలను నయానో భయానో తమవైపునకు తిప్పుకోవచ్చునని భావించారు. కానీ అందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

అందుకే గవర్నర్  బలపరీక్ష నిర్వహించమని ఆదేశించినా.... స్పీకర్  విచక్షణాధికారాలను ఉపయోగించి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో 26వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

వెంటనే బీజేపీ నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సర్వోన్నత న్యాయస్థానం వెంటనే కలగచేసుకొని  బలపరీక్షకు ఆదేశించడమే కాకుండా ఆ బలపరీక్షను ఎలా నిర్వహించాలో కూడా మార్గదర్శకాలను విడుదల చేసారు. వీడియోగ్రఫీ తీయడం, సీక్రెట్ బాలట్ కాకుండా బహిరంగ వోటింగ్ వంటి సూచనలను చేసింది కోర్టు.  

ఎప్పుడైతే కోర్టు మార్గదర్శకాలు అందాయో.... తన ఆటలు ఇక చెల్లవు అని భావించిన కమల్ నాథ్, బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తున్నట్టు  ప్రకటించారు. ఇక  ఈ పరిస్థితులను చూస్తుంటే కొన్ని నెలల కింద మహారాష్ట్రలో జరిగిన సీన్ రిపీట్ అయిందా అని అనిపించక మానదు. 

గత సంవత్సరం నవంబర్ లో మహారాష్ట్ర ఏర్పడ్డ పరిస్థితులు ఇంకా అందరికి కొత్త జ్ఞాపకాల లాగానే ఉండవచ్చు. బీజేపీకి షాక్ ఇస్తూ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ఉపసంహరించుకున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో ఠాక్రే జత కట్టబోతున్న క్రమంలో అనూహ్యంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తాను బీజేపీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

అపార చాణక్యుడు శరద్ పవార్ చక్రం తిప్పి అందరిని వెనక్కి తీసుకురాగలిగారు. ఇది ఇలా ఉండగానే శివసేన సుప్రీమ్ తలుపు తట్టింది. అప్పుడు కూడా సుప్రీమ్ కోర్టు ఇలాంటి మార్గదర్శకాలనే జారీ చేసింది. వీడియో తీయడం, చేతులెత్తే పద్దతిలో వోటింగ్ ఇతరాత్ర మార్గదర్శకాల నేపథ్యంలో అప్పుడు ఫడ్నవీస్ రాజీనామా చేసాడు. బలనిరూపణకు ముందే ఆయన రాజీనామా చేసారు. 

ఇలా మహారాష్ట్రలో జరిగినట్టే అంతకుముందు కర్ణాటకలో జరిగింది. అక్కడ యెడ్యూరప్ప ఇలానే కోర్టు ఆదేశాల నేపథ్యంలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసారు.  ఈ రెండు సంఘటనల మాదిరే... ఇప్పుడు రాజీనామా చేసారు కమల్ నాథ్. బలపరీక్షకు ముందే రాజీనామా చేసి కొంతలో కొంతమేర పరువును దక్కించుకున్నారు.