భోపాల్: ప్రజా తీర్పును బిజెపి అపహాస్యం చేసిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆరోపించారు. బిజెపి 15 ఏళ్లలో చేసిన పనులు తాను 15 నెలల్లో చేశానని చెప్పారు. ఆయన శుక్రవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. తమఎమ్మల్యేలను కర్ణాటకలో బంధించారని ఆయన ఆరోిపంచారు. 

ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు తమకు ఓటేశారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సమర్థమైన పాలన అందించినట్లు తెలిపారు. 15 నెలలు కష్టపడి తాను పనిచేశానని ఆయన అన్నారు. 

ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ కు కొత్త రూపం ఇవ్వడానికి ప్రయత్నించానని ఆయన చెప్పారు. మీడియా సమావేశానికి ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన అన్నారు. 

బలపరీక్షకు ముందే ఆయన రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. కాసేపట్లో ఆయన గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. తనకు తగిన బలం లేకపోవడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిజెపి తనకు వ్యతిరేకంగా కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. 

22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామాలు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. సుప్రీంకోర్టు శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపల బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బలపరీక్షకు ముందే ఆయన చేతులెత్తేశారు. 107 మంది సభ్యులున్న బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.