సినీ క్రిటిక్ మహేష్ కత్తి దళితులకు షాక్ ఇచ్చారు. పరిపూర్ణానంద స్వామితో పడిన వివాదంలో ఆంధ్రప్రదేశ్ దళితులు మాత్రమే కాకుండా తెలంగాణ దళితులు కూడా ఆయనకు అండగా నిలిచారు. శ్రీరాముడిపై మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు కూడా. మహేష్ కత్తికి నగర బహిష్కరణ విధించడంపై సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారనే విమర్శ మాత్రమే కాకుండా నగర బహిష్కరణను కుల ప్రాతిపదికపై వెలిగా అభివర్ణించారు. ఆ తర్వాత పరిపూర్ణానందకు తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన నగర బహిష్కరణను మహేష్ కత్తి తప్పు పట్టారు. ప్రజాస్వామిక హక్కును తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందనే విమర్శ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మహేష్ కత్తి శ్రీరాముడిపై ఓ పాట పడి తన ప్రత్యర్థులను అలరించారు. ఈ పరిణామ క్రమంలో మహేష్ కత్తిని పరిపూర్ణానంద మహేష్ కత్తిని వెనకేసుకొచ్చారు. 

వేంకటేశ్వర స్వామి సుప్రభాతాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిని వదిలేసి మహేష్ కత్తిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ రకంగా పరిపూర్ణానంద, మహేష్ కత్తి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అలా అని తెలంగాణలో ఉండకూడదని ఏమీ లేదు. వారిద్దరు కూడా హైదరాబాదులోనే కాదు, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఉండవచ్చు. కానీ, వారి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ముందు జాగ్రత్తతో తెలంగాణ ప్రభుత్వం వారికి నగర బహిష్కరణ విధించింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను సమర్థించాల్సిన అవసరం లేదు.

కానీ, శ్రీరాముడిపై తన వైఖరి మారినట్లుగా మహేష్ కత్తి సంకేతాలు ఇవ్వడం వల్ల వారి చర్యలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మహేష్ కత్తి ఆ రకంగా తెలంగాణ దళితులకే కాకుండా, ఆంధ్రప్రదేశ్ దళితులకు కూడా షాక్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. తన దళిత దృక్పథం, లేదంటే ద్రావిడ సిద్ధాంతం నుంచి ఆయన వైదొలిగినట్లు భావించాల్సి ఉంటుంది.

శ్రీరాముడిని తప్పు పట్టడం రావణుడిని వెనకేసుకు రావడం కొత్త విషయమేమీ కాదు. రామాయణంపై వివిధ రకాలైన వ్యాఖ్యలు తెలుగు సమాజానికి కొత్తేమీ కాదు. రంగనాయకమ్మ ఏకంగా రామాయణ విషవృక్షమే రాశారు. దళిత దృక్పథాన్ని సమర్థిస్తూ శ్రీరాముడికి వ్యతిరేకంగా శంభూకుడికి మద్దతుగా శివసాగర్ ఓ దళిత గేయమే రాశారు. 

ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్రావిడ సిద్ధాంతం నుంచి వచ్చింది. దక్షిణ భారతీయులది ద్రవిడ సంస్కృతి అనే విశ్లేషణ నుంచి వచ్చింది. తమిళనాడులో పెరియార్ రామస్వామి ఈ సిద్ధాంతానికి పదును పెట్టారు. దానివల్ల రాజకీయ పార్టీల పేర్లలో అనివార్యంగా ద్రవిడ అనే పదం చేర్చాల్సిన పరిస్థితిలో నాయకులు పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే త్రిపురనేని రామస్వామి చౌదరి ద్రావిడ సిద్ధాంతాన్ని విస్తరిస్తూ పుస్తకాలు రాశారు. ఆర్యులను వ్యతిరేకిస్తూ ద్రావిడులను పైకెత్తుతూ తమ సిద్ధాంతాన్ని విస్తరించే క్రమంలో రావణుడిని నాయకుడిగా చూపించడం కూడా ఉంది. ఈ ప్రభావం స్వర్గీయ ఎన్టీ రామారావుపై కూడా ఉంది. తన సినిమాల్లో రావణుడిని ప్రతినాయకుడిగా కాకుండా నాయకుడిగా ఆయన ఎత్తి చూపే ప్రయత్నాలు చేశారు. విలువలను తారుమారు చేసే ప్రక్రియను ద్రావిడ సిద్ధాంతం పనిగా పెట్టుకుంది. ఇప్పటి దళిత వాదం కూడా అంతే. 

ఈ సిద్దాంత నేపథ్యంలోనే మహేష్ కత్తి శ్రీరాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని భావించాలి.  అందుకే ఆయనకు దళితుల నుంచి మద్దతు లభించింది. దళితులు తమ ఆత్మగౌరవ పోరాటం కోసం చేస్తున్న ప్రయత్నాలను చట్టాన్ని ఉపయోగించి అడ్డుకున్న సందర్భాలు తెలంగాణలో బహుశా లేవు. దళితుల అణచివేత జరుగుతోందనే విషయం దీనికి వర్తించదు. మహేష్ కత్తి, పరిపూర్ణానంద స్వామి వ్యవహారం హైదరాబాదులో శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. 

మహేష్ కత్తి కేవలం ఈ విషయంలోనే కాదు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై, ఆయన ఫ్యాన్స్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో కూడా హైదరాబాదులో గొడవలు జరిగాయి. ఆ గొడవలను అరికట్టి, శాంతిని పరిరక్షించాల్సిన వ్యవహారంగానే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ వచ్చింది. కానీ, మహేష్ కత్తిపై తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ చర్యలను ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టాడనికి చర్యలుగానే చూడాలా, దానికి మరో కోణం కూడా ఉందా అనేది ఆలోచించాలి. పరిపూర్ణానంద, మహేష్ కత్తి మధ్య సామరస్య వాతావరణం కుదరుకుపోవడం వారిద్దరికి సంబంధించిన సమస్య మాత్రమేనా, తెలంగాణ కోణంలో చూస్తే మరోటి ఏదైనా ఉందా అని కూడా ఆలోచించాలి.

- కె. నిశాంత్

(ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏసియానెట్ తెలుగుకు ఏ మాత్రం సంబంధం లేదు. ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలపై వచ్చే స్పందనలకు కూడా ఇక్కడ చోటు కల్పిస్తాం. తమ అభిప్రాయాలను ఈ మెయిల్ కు పంపాల్సిందిగా కోరుతున్నాం. pratapreddy@asianetnews.in