రఘురామకృష్ణం రాజు ధిక్కారం: ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం ఇదే...

రఘురామకృష్ణం రాజు పదే పదే టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ... తాను పార్టీ మారానని చెబుతూనే... ఏ పార్టీలో ఉన్నా ఎంపీగా గెలవడం కోసమేనంటూ పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్నారు. ఈ తరుణంలో అసలు రఘురామ ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? జగన్ నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 

jagan sketches a master plan to counter narsapuram MP Raghurama krishnamraju

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పూర్తి పార్టీపై, పార్టీ నేతలపై ఫుల్ కంట్రోల్ లో ఆయన పెట్టుకున్నారు. కానీ అలాంటి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ హాట్ టాపిక్ గా మారారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు. 

ఢిల్లీలో బీజేపీ నేతలను కలవొద్దు అని జగన్ ఆదేశాలిచ్చిన మళ్ళీ మళ్ళీ కలుస్తుండడంతో... ఆ వార్తలు మీడియాలో తెగ ప్రసారమవుతుండడంతో రఘు రామ అసలు ఎం చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది. 

అక్కడితో ఆగకుండా రఘురామకృష్ణం రాజు పదే పదే టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ... తాను పార్టీ మారానని చెబుతూనే... ఏ పార్టీలో ఉన్నా ఎంపీగా గెలవడం కోసమేనంటూ పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్నారు. ఈ తరుణంలో అసలు రఘురామ ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? జగన్ నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 

ప్రజల అభీష్టాల కన్నా, తమ సొంత అజెండాలకే ప్రాధాన్యం ఇస్తు... అవసరమైతే తాను ఉన్న పార్టీని కాదని, పక్క పార్టీకి మద్దతు ఇస్తున్నానన్నట్లు వ్యవహరిస్తున్నాడు రఘురామ. ఇంతలా రఘురామ కృష్ణం రాజు ధైర్యంగా ఒక రకంగా పార్టీని ధిక్కరిస్తున్నాడంటే దానికి ప్రత్యేక కారణాలు కూడా లేకపోలేదు. 

నరసాపురం నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఇక్కడొక ఆసక్తికర అంశం.  కేవలం రెండు సార్లు మినహాయిస్తే, మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమైంది. 
 
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ కేంద్ర పెద్దలతో అంటకాగుతున్నారన్న టాక్‌ అటు వైసీపీలోనూ, ఇటు బీజేపీలోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ తరుణంలో అప్రమత్తమైన వైసీపీ పెద్దలు రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. 

Also read: ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కుదుపు: ఆ ఎంపీ వల్ల జగన్ కు టెన్షన్

నరసాపురంలో వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తమ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జోరుకి ఎలా బ్రేకులు వేయాలో వారికి పాలుపోవడంలేదు. వద్దు అని వారించిన కొద్దీ ఆయన బీజేపీ పెద్దలకి మరింత టచ్‌లోకి వెళుతుండటం వైసీపీ పెద్దలకు మింగుడుపడడంలేదు.  

రఘురామ కృష్ణంరాజు రాజకీయ ఆరంగేట్రం బీజేపీ ద్వారానే చేసారు. 2014 ఎన్నికల సమయంలో కమలం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా, చివరి నిముషంలో అదే సామాజికవర్గానికి చెందిన గోకరాజు గంగరాజుకి టిక్కెట్‌ దక్కింది. దీంతో రఘురామ కృష్ణంరాజు కొంత కాలంపాటు కినుక వహించారు. 

కొద్దీ గ్యాప్ తరువాత రఘురామ కృష్ణంరాజు మళ్లీ తెరపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి కొన్నాళ్లు కీలక నేతగా చెలామణి అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి... వైసీపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ పక్షాన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. 

గెలిచిన కొంతకాలంలోనే కథలో ట్విస్ట్‌ మొదలైంది. ఎంపీగా గెలిచిన అనంతరం రఘురామ కృష్ణంరాజు, తన సొంత పార్టీ వైసీపీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, బీజేపీ ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉండటం మొదలుపెట్టారు. 

ఒకపక్క తాను గెలిచిన పార్టీని గౌరవిస్తున్నట్టుగా వారికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా వ్యవహరిస్తూనే.. అటుపక్క రాజధానిలో బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను తరుచుగా కలుస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా పరిణమించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఒక సొల్యూషన్ సిద్ధం చేశారట. నరసాపురం నియోజకవర్గంలో కొత్త ఎత్తుగడకి శ్రీకారం చుట్టారు.  రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టాలంటే, నరసాపురంలోనే ఆయనకు ధీటుగా... అదే సామాజికవర్గానికి చెందిన మరోనేతను ముందుకు తీసుకొస్తూ పార్టీలో మరో వర్గాన్ని తయారుచేయాలని డిసైడ్  అయ్యారట. 

వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ... గతంలో బీజేపీ టికెట్ దక్కించుకొని ఎంపీగా గెలిచిన  మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబానికి వల విసిరింది. వెంటనే వారితో చర్చలు జరిపి  గంగరాజు పెద్దకుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు నరసింహరాజు, రామరాజులను వైసీపీలో చేరడానికి ఒప్పించారు. 

మాజీ ఎంపీ గంగరాజు మాత్రం తాను వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీలో చేరిన గంగరాజు కుటుంబ సభ్యులను రఘురామ కృష్ణంరాజుకి ధీటుగా మరో పవర్ సెంటర్ గా తాయారు చేసి రఘురామ కృష్ణంరాజుని కట్టడిచేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. 

అయితే ఇక్కడొక సమస్య కూడా ఉంది. గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా రఘురామ కృష్ణంరాజుకి చెక్‌ పెట్టడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

Also read: బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?

దీనికి కారణం కూడా లేకపోలేదు. వైసీపీలో చేరిన గోకరాజు నరసింహరాజుకు, రంగరాజుకు రాజకీయ అనుభవం శూన్యం. మరో కుటుంబ సభ్యుడు గోకరాజు రామరాజుకు మాత్రం కొద్దోగొప్పో రాజకీయ చరిత్ర ఉంది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. అది కొంతవరకు వైసీపీకి ఉపయోగపడవచ్చు.  

అయితే వీరిని తీసుకొని ఊరికెనే ఉంచితే రఘురామ కృష్ణం రాజుకు ధీటుగా ప్రోజెక్ట్ చేయడం కష్టం అని భావించిన వైసీపీ వీరిలో ఒకరికి కీలక పదవి కట్టబెట్టాలనే యోచనలో ఉంది. వీరిలో ఒకరికి రాజ్యసభ బెర్తును ఖరారు చేసినట్టు సమాచారం. రామరాజుకు జగన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం, ఆయనకు రాజకీయ అనుభవం కూడా ఉండడం వల్ల ఆయనకే ఈ బెర్త్ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు కూడా అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ భవిష్యత్తుకు తగ్గ నిర్ణయాలను తీసుకోనున్నట్టు సమాచారం. ఇది టూకీగా నర్సాపురం రాజకీయం. రానున్న రోజుల్లో ఈ రాజకీయాలు మరింత హాట్ గా మారతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios