న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతుందా...? ఒక ఎంపీని టార్గెట్ గా చేసుకుని ఢిల్లీ కేంద్రంగా రాజకీయానికి తెరలేపారా...? పార్టీ నుంచి దూరం చేసేందుకు, జగన్ నుంచి దూరం చేసేందుకు ఒక సీనియర్ నేత ప్రయత్నాలు చేస్తున్నారా...? 

ఆ ఎంపీకి కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక వైసీపీ సీనియర్ నేత పితురులు చెప్తూ ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా...? మోదీని కలిస్తే ఫిర్యాదు, బీజేపీ ఆఫీసుకు వెళ్తే ఫిర్యాదు, ఇలా ఆ ఎంపీపైనే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 

తనను టార్గెట్ చేశారంటూ బాధిత ఎంపీ చెప్పడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీసింది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు...? టార్గెట్ చేస్తున్న సీనియర్ నేత ఎవరు..? అసలు ఎక్కడ చెడింది వీళ్లకు...? అంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు కనుమూరి రఘురామకృష్ణంరాజు. జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయకేతనం ఎగురవేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజుపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే  రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరిపోతారంటూ తెగ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కూడా వైసీపీలోకి కొందరు నేతలు చేశారంటూ ప్రచారం కూడా జరిగిందది.

అనంతరం పలువురు కేంద్రంమంత్రులతో సన్నిహితంగా ఉండటంతో దాన్ని కూడా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారట పార్టీ సీనియర్ నేత. ఇకపోతే శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ఎంపీలతో సమావేశమయ్యారు. 

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని కాదని ఏ ఎంపీ కేంద్రంలోని పెద్దలను కలవద్దని ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఆదేశాలు జారీ అయిన కొన్ని గంటలకే ప్రధాని నరేంద్రమోదీ రఘురామకృష్ణంరాజును పలకరించారు. రాజుగారు బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించి భుజం తట్టారు కూడా. 

ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు: రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్

అంతకుముందు లోక్ సభలో తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. తెలుగుభాషపై తన మమకారాన్ని చూపించారు. అటు ఏపీలో సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు విరుద్ధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారంటూ ఫిర్యాదులు వెళ్లాయి. 

ఇదిలా ఉంచితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన 20 మంది ప్రజాప్రతినిధులు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని తెలిపారు. 

వైసీపీలోకి సుజనా, ఎందుకు ఆగారంటే...: ఎంపీ రఘురామకృష్ణంరాజు

దాంతో అందరి దృష్టి రఘురామకృష్ణంరాజుపై పడింది. రఘురామకృష్ణంరాజు వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ వ్యహారంపై కూడా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారట సదరు సీనియర్ నేత. 

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నేరుగా అధినేత వద్దే తేల్చుకునేందుకు రఘురామకృష్ణంరాజు నేరుగా జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో తనపై వస్తున్న రూమర్స్ పై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణంరాజును సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా కూడా నియమించింది. అలాగే విద్యుత్ శాఖ సలహా మండలి సభ్యుడుగా కూడా నియమించింది. 

ఒకవైపు జగన్ వద్ద ఆ ఎంపీ రఘురామకృష్ణంరాజును డిగ్రేడ్ చేద్దామని ఆ సీనియర్ నేత ప్రయత్నిస్తుంటే లోక్ సభ స్పీకర్ ప్రకటించిన పలు కమిటీలు, సలహా మండలిలో కీలక పదవులు కట్టబెట్టడంతో ఆ సీనియర్ నేత తట్టుకోలేకపోతున్నారట. 

ఈ వ్యవహారాన్నంతటిని ఎంపీ రఘునాథకృష్ణంరాజు పరిశీలస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. 

పార్టీలో ఒక స్థాయిలో ఉన్న సీనియర్ నేత తనను టార్గెట్ గా చేసుకుని ఈ తతంగం అంతా నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. తాను వైసీపీ, వైసీపీ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చానన్నారు. 

ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ

నరేంద్రమోదీ ప్రధానిగా నాలుగేళ్లు ఉన్నప్పుడు తాను కూడా బీజేపీలో ఉన్నానని అందువల్ల తనకు బీజేపీ జాతీయ నేతలతో, కేంద్రమంత్రులతో సంబంధాలు ఉంటే తప్పేందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేస్తున్నారు. 

తాను ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నప్పుడు అంటే గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ ఉన్నప్పుడే తనకు మోదీతో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలతో పరిచయాలు అంతటి వరకు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తాను వైసీపీని వీడేది లేదని వైసీపీలోనే ఉంటానని మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు