ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రాజకీయం ఇప్పుడప్పుడు సమసిపోయేదిగా కనపడడం లేదు. రాజధాని అమరావతి ప్రాంత రైతులు తమ ఉద్యమాన్ని రోజురోజుకి ఉదృతం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు రెండో సారి ఎదురైన ఇదే రకం పరిస్థితిని చూసి మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయి ఉండొచ్చు. 

చంద్రబాబు ఇలా రెండు సార్లు ఈ వింత పరిస్థితి ఎదుర్కోవడానికి కారకులెవరన్న ఉన్నారంటే... మొదటిసారి పరిస్థితికి కారకుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అయితే, ఇప్పటి పరిస్థితికి కారకుడు ఆ రాజశేఖర్ రెడ్డి తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

ఇంతకూ ఏమిటా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? రెండు సార్లు చంద్రబాబు అధికారాన్నీ కోల్పోవడానికి తండ్రి తనయుడు చంద్రబాబు మీద ప్రయోగించిన స్ట్రాటజీ ఒకటే అవడం. 

అప్పట్లో చంద్రబాబు అభివృద్ధినంతా హైదరాబాద్ లో కేంద్రీకరించాడని చంద్రబాబుపై అభివృద్ధి వికేంద్రీకరణ అనే అస్త్రాన్ని ప్రయోగించి 2004లో చంద్రబాబును గద్దె దించి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని చేపట్టాడు. ఆ దెబ్బ టీడీపీపై ఎంతలా పడిందంటే... 2004 ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 133 సిట్టింగ్ స్థానాలను కోల్పోయేంతగా!

Also read: అమరావతిపై వివాదం: జగన్ కు ముందు నుయ్యి, వెనక గొయ్యి

అంత ప్రాభవంతో, విజన్ 2020 అనే నినాదాన్ని ఎత్తుకొని ముందుకెళ్తుండగా, ప్రపంచంలోనే అత్యంత గొప్ప దార్శనికుడు అని వరల్డ్ బ్యాంకు చంద్రబాబును కీర్తిస్తుండగా కూడా చంద్రబాబు ఇంతదారుణంగా ఓటమి చెందాడు. హైదరాబాద్ లోనే అభివృద్ధి కేంద్రీకృతమవుతుందంటే... అంతా దోచి హైద్రాబాబ్డ్ కె పెడుతున్నాడని రాజశేఖర్ రెడ్డి ఆరోపణ. 

హైద్రాబాద్ కే అంతా దోచిపెడుతున్నాడని ప్రతిపక్షం ఆరోపించినా కూడా తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబుకు ఘోరమైన పరాభవం ఎదురైంది. ఏవో ఆరా కొరా సీట్లు మాత్రమే వచ్చాయి. అంతా ఎక్కడికైతే దోచిపెడుతున్నాడని ఆరోపించారో అక్కడి ప్రాంత ప్రజలే ఘోరంగా ఓడించారు. 

2019లో కూడా సమె పరిస్థితి రిపీట్. ఈ సారి కాకపోతే ప్లేస్ మారింది అంతే. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబుపై ప్రతిపక్ష వైసీపీ చేసిన ఆరోపణ ఏదన్నా ఉందంటే అది రాజధాని విషయమే. 

అంతా అమరావతి ప్రాంతానికే దోచిపెడుతున్నాడు చంద్రబాబు అని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడినుంచీ ఆరోపణలు చేస్తూనే ఉంది. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సూచనలు పట్టించుకోకుండా వాటిని బుట్టదాఖలు చేసాడని ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. 

మిగిలిన ప్రాంతాలన్నీ ఈ చర్య వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డబ్బంతా అమరావతి మీదనే ఖర్చు పెడుతున్నాడని, ఇలా ఖర్చుపెడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని వారు పదే పదే చెబుతుండేవారు. 

ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీ శ్రేణులు ఇదే విషయాన్నీ చెప్పారు. అమరావతిలో రాజధాని ఉండడం వల్ల ఆర్ధిక వనరులన్నీ అక్కడే కేంద్రీకృతమయ్యాయని, దీనివల్ల ఇతర ప్రాంతాల ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించింది. 

అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాక్ కొట్టింది. టీడీపీ ఘోర ఓటమి ఇచ్చిన షాక్ కన్నా మరో పెద్ద షాక్ చంద్రబాబుకి తగిలింది. ఏ ప్రాంతంలో అయితే చంద్రబాబు పాలనను కేంద్రీకృతం చేసాడని జగన్ ఆరోపించాడో, ఎక్కడివరకైతే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పరిమితం చేసాడని వైసీపీ శ్రేణులు ఆరోపించారో ఆ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ఘోరమైన ఓటమిని చవి చూసారు. 

Also read: జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీ సీట్లలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అన్నిటికన్నా పెద్ద షాక్ చంద్రబాబు తనయుడు లోకేష్ ఓడిపోవటం. మంగళగిరి ప్రాంత ప్రజలు పట్టుబట్టి మరీ లోకేష్ ని ఓడించారు. 

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఏ అస్త్రాన్ని అయితే ప్రయోగించారో...ఇప్పుడు జగన్ సైతం అదే అస్త్రాన్ని ప్రయోగించి చంద్రబాబును గద్దె దింపారు. చంద్రబాబు ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదనేదానికి సమాధానం దొరికినట్టుంది. 

ఇలా ఒకే రకమైన షాకును రెండుసార్లు తిన్న రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే అని చెప్పడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.