పవన్ కల్యాణ్ కు అభిమానులే శత్రువులా?
కార్లను మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను మారుస్తారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్య చేసినందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నేతలు కూడా జగన్ ను తప్పు పట్టారు.
కార్లను మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను మారుస్తారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్య చేసినందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నేతలు కూడా జగన్ ను తప్పు పట్టారు. జగన్ ఆ వ్యాఖ్యలు చేయడం అనుచితమనే అభిప్రాయమే బలంగా వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ కూడా ఆ వ్యాఖ్యలపై కాస్తా ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ హుందాగానే ప్రవర్తించారు. జగన్ కుటుంబంలోని ఆడపడుచులను లాగవద్దని అభిమానులకు సూచించారు కూడా. ఆ సూచన చేయడానికి కారణం లేకపోలేదు. పవన్ కల్యాణ్ అభిమానులు (నిజంగా ఆయన ఫ్యాన్సే చేశారా, పవన్ కు వ్యతిరేకులైనవారు ఎవరైనా చేశారా అనేది ఆలోచించాల్సిన విషయమే) జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియా చాలా అసభ్యంగా రాతలు రాశారు. ఆమె ఫొటోలకు ఇతరుల ఫొటోలను జోడించి రాయడానికి వీలు కాని వ్యాఖ్యలు చేశారు.
వారు చేసిన పనికి ఓ నటి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ తో కలిసి ఉన్న ఓ నటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, వేరే అర్థం వచ్చేలా చేశారు. ఆమె ఒకానొక సందర్భంలో సెల్ఫీ తీసుకుని ఉండవచ్చు. పవన్ కల్యాణ్ తో కూడా ఎంతో మంది సెల్ఫీలు తీసుకుని ఉంటారు. ఆయనతో కలిసి ఫొటోలు తీసుకుని ఉంటారు. అంత మాత్రాన ఏదో ఉన్నట్లు ప్రచారం చేస్తే ఆయన అభిమానులు ఎలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తీవ్రమైన అసహనం పవన్ కల్యాణ్ అభిమానుల్లో పేరుకుపోయి ఉంది. వారికి పవన్ కల్యాణ్ కు దేవుడే కావచ్చు. కానీ, అందరూ ఆయనను దేవుడిగా తలిచి, ప్రార్థించాలంటే కుదరదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనను వ్యతిరేకించే వాళ్లు ఉంటారు, అభిమానించే వాళ్లు ఉంటారు. ఆయన స్పందిస్తున్న తీరు మీద, ఆయన కార్యాచరణ మీద వ్యాఖ్యలు చేసేవారు ఉంటారు (పని కట్టుకుని విమర్శించే వాళ్లను కూడా ఎదుర్కోవడానికి ఒక భాష, ప్రజాస్వామ్యంలో ఓ కార్యాచరణ ఉంటాయి).
ముఖ్యంగా మీడియా, పవన్ కల్యాణ్ రాజకీయాల మీద కావచ్చు, ఆయన కార్యాచరణ మీద కావచ్చు కథనాలను ప్రచురిస్తూ ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా డిజిటల్ మీడియా కాస్తా ఆయన వార్తలను కాస్తా ఎక్కువగా ఇస్తూ ఉండవచ్చు. పవన్ కల్యాణ్ మీద ఇతర రాజకీయ నాయకులు, ఇతర రంగాలవారు చేసే వ్యాఖ్యలను వ్యాఖ్యానాలు లేకుండా మీడియా వార్తలుగా, వార్తాకథనాలుగా మార్చుకుంటుంది. ఆ హక్కు మీడియాకు ఉంది.
పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను, ఆయన కార్యాచరణను కూడా మీడియా ఇస్తోంది. ఏదీ వన్ సైడ్ ఉండకుండా మీడియా జాగ్రత్తలు తీసుకుంటుంది (అలా తీసుకోని మీడియా సంగతి వేరే, వారి నిర్వాహకులు ఎవరనేది గుర్తుపట్టడం కష్టం కాకపోవచ్చు). పవన్ కల్యాణ్ కార్యాచరణను బేరీజు వేస్తూ కాస్తా సానుకూలంగా ఉన్న వార్తాకథనాలను పట్టించుకోని ఆయన అనుచరులు, పవన్ కల్యాణ్ పై ఇతరులు చేసే విమర్శలకు మీడియాలో చోటు కల్పించినప్పుడు హద్దులు దాటి ప్రవరిస్తున్నారు. బూతులు, నోటితో చెప్పలేని భాషను వాడుతున్నారు. అయితే, వాళ్లకు ఆ హక్కు ఉందనుకోవాలా? వారికి ఆ హక్కు ఉన్నప్పుడు ఎదుటివారికి కూడా ఉండాలని వారు అంగీకరిస్తారా? వారు అంగీకరించరు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వంటి మహానుభావుడు కూడా తీవ్రమైన విమర్శలను, ఆరోపణలను ఎదుర్కున్నారు. ఆయనపైనా మీడియా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఎన్టీ రామారావును కూడా దేవుడిగా కొలిచే వారు ఇప్పటికీ లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. మీడియా ప్రతినిధిగా, ఎన్టీఆర్ ను సన్నిహితంగా చూసినవాడిగా, ఆయన దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు లేవు. ఆయన అభిమానులు హద్దులు దాటిన సందర్భాలు లేవు. కానీ, పవన్ కల్యాణ్ విషయానికి వచ్చేసరికి, అభిమానుల తీరు చాలా బాధాకరంగా ఉంటోంది. పవన్ కల్యాణ్ ను అభిమానించేవారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలని కోరుకునేవారు కూడా బాధపడే స్థాయిలో అభిమానుల చర్యలు ఉంటున్నాయి.
ఆ రకంగా చూస్తే, పవన్ కల్యాణ్ కు అభిమానులే శత్రువులుగా మారుతున్నారా, ఆయన బలహీనత కూడా అభిమానులేనా అనే ప్రశ్నలు తలెత్తకమానవు.
- కె. నిశాంత్