జూ.ఎన్టీఆర్ తో పొసగని పొత్తు: బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా?

తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య తన ప్రాముఖ్యాన్ని కోల్పోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

Is Balakrishna sidelined by the Telugu film industry

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు ఆ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో తన ముద్రను వేయాలని బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని కొనసాగించాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. 

అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులపై ఉన్న ఆంక్షలను సడలింపజేసుకునే ప్రయత్నంలో హైదరాబాదులోని సినీ ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు ఆ దిశగా పనిచేస్తున్నారు. వారికి చిరంజీవి, నాగార్జున నేతృత్వం వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల వారిద్దరిని నిర్మాతలూ దర్శకులూ వారిని ఎంపిక చేసుకున్నట్లు భావించవచ్చు.

Also Read: కేసీఆర్‌తో సినీ చర్చలపై బాలకృష్ణ అసంతృప్తి: చిరంజీవి వ్యూహం ఇదే!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లీడ్ చేయాలని చిరంజీవి, నాగార్జునలకు చెప్పారని, అందువల్లనే వారు తమ సమావేశాలకు వస్తున్నారని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. వారిద్దరితో సమాచార వినిమయానికి తమకు ఉన్న వెసులుబాటు కారణంగా కేసీఆర్ ఆ విధంగా చెప్పి ఉంటారు. నాగార్జున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దగ్గరయ్యారు. దీంతో వారిద్దరిని కేసీఆర్ ఎంచుకున్నట్లు భావించవచ్చు.

Is Balakrishna sidelined by the Telugu film industry

ఆ సమావేశాలపై బాలకృష్ణ తన సహజశైలికి భిన్నంగా స్పందించారు. తనను పిలువకపోవడంపై, తనను భాగస్వామిని చేయకపోవడంపై ఆయన వ్యాఖ్యలు కాస్తా హద్దులు దాటినట్లే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వారు సమావేశాలు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడం చాలా మందికి వాస్తవంగానే ఆగ్రహం తెప్పించి ఉంటుంది. 

బాలకృష్ణను ఆహ్వానించాల్సింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అని కల్యాణ్ అనడం మరో వివాదానికి దారి తీసింది. తమకే ఆహ్వానం లెనప్పుడు తాము ఆర్టిస్టులను ఎలా పిలుస్తామని నరేష్ అన్నారు. తాజా సమావేశాలు సీసీసీ అనే పేరు మీద జరుగుతున్నాయి. అంటే, మిగతా సంస్థలను కాదని వీరు విడిగా వ్యవహరించదలుచుకున్నట్లు కూడా భావించవచ్చు. 

Also Read: కేసీఆర్ తో చిరంజీవి పెద్దల చర్చలు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఈ స్థితిలో బాలకృష్ణ వంటి సినీ ప్రముఖులను వాళ్లు దూరంగానే ఉంచారు. ఈ వివాదంలో బాలకృష్ణపై చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. బాలకృష్ణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో బాలకృష్ణకు మద్దతుగా నిలిచినవారు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎన్టీఆర్ వారసులపై ఈగ వాలితే రెచ్చిపోయే వర్గం ఒక్కటి ఉండేది. ఆ వర్గం మౌనం వహించడం వెనక కారణాలు ఏమిటనేది చూడాల్సి ఉంది. 

Is Balakrishna sidelined by the Telugu film industry

నందమూరి హరికృష్ణ కుమారుడు, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణ విభేదాలు సమసిపోలేదని అంటున్నారు. టీడీపీ రాజకీయాల్లో భాగంగా ఇరువురి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. హరికృష్ణ మరణించిన సమయంలో బాబాయ్, అబ్బాయ్ దగ్గరైనట్లు కనిపించారు. కానీ, అది తాత్కాలికమేనని తేలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు కలిసి వుంటే సినీ పరిశ్రమ వారి ప్రాముఖ్యాన్ని గుర్తించి ఉండేది.

ఇటీవల లాక్ డౌన్ సమయంలో చాలెంజ్ లు విసురుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత మంది ప్రముఖులకు సవాళ్లు విసిరారు. జూనియర్ ఎన్టీఆర్ సవాల్ కు చిరంజీవి సహా కొంత మంది సినీ ప్రముఖులు స్వీకరించారు. బాలకృష్ణ మాత్రం ఆ సవాల్ ను స్వీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. నిజానికి, బాలయ్యకు ఆ చాలెంజ్ లు విషయం తెలియదని కొందరంటున్నారు. కానీ మీడియాలో అది విస్తృతంగానే ప్రచారం అయింది.

ఎన్టీఆర్ వారసత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇద్దరు మాత్రమే బలంగా ఉన్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ కాగా, మరొకరు జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరికే పొసగడం లేదు. దాంతో ఎన్టీఆర్ వారసుల ప్రభావం సినీ పరిశ్రమపై తగ్గిందని భావించవచ్చు. 

జూనియర్ ఎన్టీఆర్ తన పరిమితులు తెలిసినవారు. ఏ సందర్బంలో ఏ మేరకు ప్రతిస్పందించాలనే విషయంలో ఆయన అనుభవాలను గడించినట్లే ఉన్నారు. తన సమకాలీకులు అని భావిస్తున్న మహేష్, రానా, రామ్ చరణ్ వంటివారిని సమావేశంలో భాగస్వాములను చేయలేదు. దాంతో ఎన్టీఆర్ ఆ సమావేశాలకు తనను ఆహ్వానించలేదని కినుక వహించడం సరి కాదనే భావనలోనే ఉండి ఉంటారు. ఈ స్థితిలో ఎన్టీఆర్ వారసుడిగా, సినీ పరిశ్రమపై తమ ముద్ర కారణంగా తనకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉండిందనే బావనతో బాలకృష్ణ స్పందించి ఉంటారు. కానీ అది పెద్దగా ఫలితం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవడం కూడా బాలకృష్ణకు కలిసి రావడం లేదు. దానివల్ల కూడా ఆయన కొంత ప్రాధాన్యం కోల్పోయినట్లు భావించవచ్చు. సినీ ప్రముఖుల సమావేశాలపై విరుచుకుపడడంతో ఆయన కోపం చల్లారలేదు. టీడీపీ మహానాడులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లు మనుగడ సాగించలేదని, ఈలోగానే తాము అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. ఆ రకంగా తెలుగు సినీ పరిశ్రమకు ఓ సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. 

బాలకృష్ణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబుపై మాత్రం నందమూరి అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదంపై నాగబాబు హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని అంటున్నారు. నాగబాబుపై బాలయ్య ఫ్యాన్య్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios