కేసీఆర్‌తో సినీ చర్చలపై బాలకృష్ణ అసంతృప్తి: చిరంజీవి వ్యూహం ఇదే!
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు నందమూరి హీరో బాలకృష్ణ, మెగా హీరో పవన్ కల్యాణ్ కూడా ప్రముఖులే. కానీ, తెలంగాణలో షూటింగులు ప్రారంభించడానికి జరుగుతున్న సంప్రదింపుల్లో వారిద్దరికి కూడా చోటు దక్కడం లేదు. తనను ఆహ్వానించకపోవడంపై బాలకృష్ణ అసంతృప్తిగానే ఉన్నట్లు అర్థమవుతోంది.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తోనూ ఆ తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతోనూ జరిగిన చర్చలకు మెగాస్టార్, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నేతృత్వం వహించినట్లు అర్థమవుతూనే ఉంది. నాగార్జున వంటి సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ చిరంజీవి పాత్రనే విశిష్టంగా కనిపించింది.
చర్చల నేపథ్యంలో చిరంజీవిని దాసరి నారాయణరావుతో పోల్చడం కూడా ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలు తలెత్తినప్పుడు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పెద్దగా వ్యవహరిస్తూ వచ్చేవారు. సమస్యలను పరిష్కరించే విషయంలో ఆయన ముందుండి పనిచేసేవారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కుగా మారారని చెబుతున్నారు. అందుకే ఆయనను దాసరి నారాయణ రావుతో పోలుస్తున్నారు.
సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే విషయంలో చిరంజీవి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన చిరంజీవి సినీ పరిశ్రమలో రాజకీయాలకు తావు ఉండకూడదని భావిస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నవారి పాత్ర వల్ల ప్రయోజనాలు దెబ్బ తింటాయని బహుశా ఆయన భావిస్తూ ఉండవచ్చు.
సినిమాలకే పూర్తి సమయాన్ని వెచ్చించాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఆయన చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కల్యాణ్ పోరాడుతున్న విషయం ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన జగన్ తో సాన్నిహిత్యం పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని ఆయన కచ్చితంగానే చెప్పారు.
ఇక, కేసిఆర్ వద్దకు ప్రతినిధులను తీసుకుని వెళ్లడంలోనూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరిపిన సందర్భంలోనూ అదే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఆయన బాలకృష్ణను ఇందులో భాగస్వామిని చేయడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
పవన్ కల్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరు కూడా ఒక రకంగా అటు జగన్ కు, ఇటు కేసీఆర్ కు రాజకీయ ప్రత్యర్థులే. అందువల్ల సినీ పరిశ్రమను రాజకీయాలకు దూరంగా ఉంచాలనేది చిరంజీవి అభిప్రాయంగా భావించవచ్చు. అందుకే వారిని కేసీఆర్ తో చర్చల్లో భాగస్వాములను చేయలేదని అంటున్నారు.