Asianet News TeluguAsianet News Telugu

మోడీ, చంద్రబాబు మధ్య తిరిగి దోస్తీ: పవన్ కల్యాణ్ హ్యాపీ, జగన్ కు షాక్

పిఎం నరేంద్ర మోడీకి, టీడీపి అధినేత చంద్రబాబుకు మధ్య తిరిగి స్నేహం చిగురిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమతం నెరవేరేట్లు అనిపిస్తోంది.

Friendship between Modi and Chandrababu on the cards, Pawan Kalyan happy
Author
Amaravati, First Published Aug 7, 2022, 9:24 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశించిన పరిణామాలే చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు కూడా. బిజెపి, జనసేన కూటమి చంద్రబాబుతో కలిసి పని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆయన అభిమతానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడి మధ్య తిరిగి స్నేహం చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. ఆజాదీకా అమ్రుత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మోడీతో ముచ్చటించారు. 

సమావేశానికి హాజరైన ప్రముఖలు టీ సేవిస్తుండగా, మోడీ వారి వద్దకు వెళ్లి ఒక్కొక్కరినీ పలుకరించినట్లు సమాచారం. చంద్రబాబు వద్దకు వచ్చినప్పుడు కాసేపు పక్కకు జరిగి ఐదు నిమిషాల పాటు మోడీ మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ మధ్య మీరు ఢిల్లీ రావడం లేదు, అప్పుడప్పుడు వస్తుండండి అని చంద్రబాబుతో ప్రధాని అన్నట్లు టీడీపి వర్గాలు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రత్యేక కలుస్తానని చంద్రబాబు మోడీతో అన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా రావాలని, ఇది మీ ఇల్లు అనకోవాలని, రావాలనుకున్నప్పుడు ముందుగా తన కార్యాలయానికి తెలియజేయాలని మోడీ చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ తదితరులతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారని అంటున్నారు. 

అదంతా టీడీపీ వర్గాల కథనమే అయినప్పటికీ, అందులో ఏ మాత్రం నిజం ఉందనేది తెలియనప్పటికీ బిజెపి నాయకత్వం మరోసారి చంద్రబాబు వైపు చూస్తున్నట్లు మాత్రం అర్థమవుతోంది. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. చంద్రబాబును ఆయన దార్శనికుడిగా అభివర్ణించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పోలవరం, ఏపీ రాజధాని విషయాల్లో తప్పుపట్లారు. కేంద్ర నాయకత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు వస్తే తప్ప సోము వీర్రాజు ఆ విధంగా మాట్లాడి ఉండరు. 

టీడీపి, వైసీపీలకు సమదూరం పాటించాలని గతంతో తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపికి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపనిస్తోంది. చంద్రబాబును కలుపుకుని వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో టీడీపి, జనసేన, బిజెపి కలిసి పనిచేస్తే వైఎస్ జగన్ కు గడ్డుకాలమే ఎదురవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios