దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు నిరసనలు తెలుపుతుంటే...ఇంకొందరేమో దానికి అనుకూలంగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంకొందరేమో తమకెందుకు వచ్చిన తంటా అని ఏమి మాట్లాడకుండా మిన్నకుంటున్నారు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఏ సినిమా స్టార్ మాట్లాడినా అది చుట్టూ తిరిగి వారి కెరీర్ మీద ప్రభావం చూపెడుతుంది.

ప్రతి ఒక్కరికీ వారి వాక్ స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా అందించింది భారత రాజ్యాంగం. ఇలా వారు ఎం మాట్లాడినా కూడా వారి కెరీర్ లను నాశనం చేసేందుకు పూనుకోవడం అది మంచి పద్ధతి కాదు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనె జె ఎన్ యు కి వెళ్లి అక్కడ విద్యార్థులకు సంఘీభావం తెలపగా వెంటనే... దీపిక తాజా చిత్రం చపాక్ ను బహిష్కరించాలని పిలుపునివ్వడం, ఆ తరువాత వెంటనే అదే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం ఆరంభించింది.

దీపికా తన మనసుకు నచ్చిన పని చేసింది, కావాలనుకుంటే రాజకీయంగా తనపైన వ్యాఖ్యలు చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇలా సినిమాను బహిష్కరించామని పిలుపు ఇవ్వడం భావ్యం కాదు. ఇక ఇలానే ప్రతిసారి కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మరో నటుడు అక్షయ్ కుమార్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి ఈ నటుడు సైతం ప్రతి దానికి ఇబ్బందులు  ఎదుర్కొంటున్నాడు. 

Also read: ఇంతగా దిగజారాలా..? స్టార్ హీరోయిన్ ని 'ఛీ' కొడుతున్న నెటిజన్లు

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఏమి మాట్లాడాలనుకున్నా...వెంటనే అక్షయ్ కుమార్ ని దాంట్లోకి లాగడం నిత్యకృత్యమయ్యింది. నిన్నతాజాగా బాయ్ కాట్ చపాక్ అనేది ట్రెండ్ అవుతున్న తరుణంలోనే 'బాయ్ కాట్ నిర్మ' అని మరో ట్యాగ్ ట్రెండ్ అవడం ఆరంభించింది. నిర్మా సర్ఫుకి దీపికకు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఇక్కడే మరోసారి అక్షయ్ కుమార్ ను ఏ సంబంధం లేని గొడవలోకి లాగారు. 

ఆయన నిర్మ డిటర్జెంట్ పొడి యాడ్ లో నటించాడు. అందులో మరాఠా సేనలకు రాజుగా ఆయన నటించాడు. అందులో మరాఠాల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా అక్షయ్ వ్యవహరించాడని అందుకు నిరసనగా బాయ్ కాట్ నిర్మా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరే కాదు బాలీవుడ్ లో చాలా మంది ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు.

స్వర భాస్కర్, వివేక్ అగ్నిహోత్రి, కంగనా రనౌత్ ఇలా ఏ ఒక్క వర్గానికో సంబంధించిన వారు కాకుండా ఇటు అధికార ప్రతిపక్షాలు అనిన్ తేడా లేకుండా అందరి మీద ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దిగడం మాత్రం భావ్యం కాదు. ఎమర్జెన్సీ కాలంలో ముంబైలో ఒక ట్రక్కును రోడ్డు మీద నడిపి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని ఇందిరా గాంధీకి సవాల్ విసిరాడు అప్పటి సూపర్ స్టార్ దేవానంద్.ఆ తరువాత ఆయన చాలానే కష్టాలను ఎదుర్కున్నాడు. అది గతం.

Also read: ఆ సినిమాని బహిష్కరించండి.. క్రేజీ హీరోయిన్ కు రాజకీయ సెగ!

నేడు ఈ 21వ శతాబ్దం లో కూడా ఇలా నటులను నేరుగా టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు? వారికి మాట్లాడే హక్కు ఉంది. వారు చేస్తున్నారు. వారి హక్కులను గౌరవిస్తూ రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా బహిరంగంగా వారి ఆర్ధిక మూలలను దెబ్బకొట్టామని, జీవితాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మాత్రం కరెక్ట్ కాదు.