Asianet News TeluguAsianet News Telugu

పురందేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు.. చంద్రబాబుకు చెక్ పెట్టడానికేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. పార్టీ నూతన చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ నిర్ణయం  తీసుకుంది. అయితే దగ్గుబాటు పురందేశ్వరిని ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ప్రభావితమవుతాయనే చర్చ మొదలైంది. 

daggubati purandeswari appointed as new bjp president for andhra pradesh is it trouble to chandrababu naidu
Author
First Published Jul 4, 2023, 4:50 PM IST

హైదరాబాద్‌: బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాలలో సంస్థాగతంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కొన్ని రాష్ట్రాల్లో జరనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నాలుగు రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. పార్టీ నూతన చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ నిర్ణయం  తీసుకుంది. అయితే దగ్గుబాటు పురందేశ్వరిని ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ప్రభావితమవుతాయనే చర్చ మొదలైంది. 

ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలు ప్రతిపక్షాలుగా ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ అంటనే  విరుచుకుపడుతున్న జనసేన.. ప్రస్తుతం ఏపీలో పొత్తులో ఉంది. అయితే ఆ పొత్తుకు పేరుకు మాత్రమే అనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంకు, పవన్‌ కల్యాణ్‌ల మధ్య సత్సబంధాలు లేవనే సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీలో కొందరు టీడీపీ అనుకూల వర్గంగా, మరికొందరు వైసీపీ అనుకూల వర్గంగా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అధికార వైసీపీపై పోరాడటంలో బీజేపీ క్రియాశీలమైన భూమిక పోషించడం లేదని ఆ పార్టీలోని నేతలే చర్చించుకుంటున్నారు. సోము వీర్రాజు‌పై అధికార వైసీపీ కంటే..  టీడీపీనే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తారనే ముద్ర కూడా ఉంది.

ఇక, వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పలుమార్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. టీడీపీతో పొత్తుకు కూడా సిద్దమవుతున్నారనే ప్రచారం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అలాగైతేనే వైసీపీ అధికార దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయవచ్చని ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం కావడంతో పొత్తుకు సంబంధించి ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ భేటీకి సంబంధించి బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి సమాచారం  ఇవ్వలేదని సమాచారం.  

అయితే ఇలాంటి పరిస్థితుల వేళ ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నిమమించడం ద్వారా బీజేపీ ఏ స్టాండ్‌తో ముందుకు వెళ్లాలని భావిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీ బీజేపీ నూతన చీఫ్‌గా వై సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ.. పురందేశ్వరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడం వెనక పెద్ద స్ట్రాటజీనే ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ, వైసీపీలతో తాము సమాన దూరంలో ఉన్నామనే సందేశాన్ని పంపించడంలో భాగంగా.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, జాతీయ నాయకులతో సత్సబంధాలు ఉండటం, నాయకత్వ లక్షణాలు.. వంటి అంశాలు పురందేశ్వరికి కలిసి వచ్చిందనే మాట వినిపిస్తోంది.

Also Read: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి..

అటు టీడీపీకి గానీ.. ఇటు వైసీపీకి గానీ.. అనుకూల వైఖరి కనబరుస్తున్న నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంచితే.. మరింత నష్టపోయే అవకాశం ఉందనే అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయంగా బలపడలాంటే.. పార్టీ  ఆదేశాలను పాటించే బలమైన ముఖంతో ముందుకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావించి.. దగ్గుబాటి పురందేశ్వరిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురిగా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లో దగ్గుబాటి పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. ఆమెకు సమచితమైన స్థానం కల్పించడం ద్వారా ఎన్టీఆర్ అభిమానించే వారిలో పార్టీకి కొందరైన మద్దతు తెలిపే అవకాశాలు లేకపోలేదని బీజేపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటుందని చెబుతున్నారు. అలాగే రానున్న ఎన్నికల వరకు పురందేశ్వరి నాయకత్వంలో పార్టీ పుంజుకుంటుందా? లేదా? అనే ప్రయోగంగా కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు పురందేశ్వరి, చంద్రబాబు కుటుంబాల మధ్య చాలా కాలంగా రాజకీయ వైరం ఉంది. అయితే ఇటీవలి కాలంలో దగ్గుబటి, నారా కుటుంబాలు ఒకే వేదిక మీద కనిపించడం కూడా రాజకీయంగా పలు విధాల చర్చలకు దారితీసింది. ఫ్యామిలీ ఫంక్షన్‌లను అటు ఉంచితే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలోనే నారా, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఒకప్పుడు ఉన్నంత స్థాయిలో వైరం లేదనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అయితే అది ఫ్యామిలీ విషయాలని.. రాజకీయం వేరని వాదించేవారు కూడా లేకపోలేదు. మరోవైపు గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి భర్త వెంకటేశ్వరావు.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యారు.

ఏది ఏమైనా పార్టీ ఆదేశాలు తూ.చ తప్పకుండా పాటిస్తుందనే పేరు.. వివాద రహిత ముద్ర  కూడా పురందేశ్వరికి ఉంది. అలాంటి పురందేశ్వరిని ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం చూస్తుంటే.. టీడీపీతో కలిసి ముందుకు సాగినా? సాగకపోయినా? బలమైన వైఖరితోనే ఉండాలని బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఖరారు అయితే.. పురందేశ్వరి పార్టీ లైన్‌ పరంగా గట్టిగా ఉంటారనే బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. మిగిలినవారితో వ్యవహరించడం కంటే పురందేశ్వరితో మంతనాలు జరపాల్సి వస్తే చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఏపీ బీజేపీ బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించడం.. చంద్రబాబుకు కలిసే వచ్చే అంశమా? లేకపోతే ఆయనకు చెక్ చెప్పడానికే బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. ఏది ఏమైనా పూర్తిగా రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాల కోణంలోనే బీజేపీ అధిష్టానం పురందేశ్వరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టుగా స్పష్టం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios