Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి..

బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Daggubati Purandeswari appointed as new BJP President for andhra pradesh ksm
Author
First Published Jul 4, 2023, 3:18 PM IST

బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మర్పులు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పోస్టు నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పదవి రేసులో వై సత్యకుమార్, సుజనా చౌదరి పోటీలో ఉన్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ.. పురందేశ్వరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. 

ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు, కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై దృష్టి సారించారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని, జార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా బాబులాల్ మరాండీని, పంజబ్ బీజేపీ చీఫ్‌గా సునీల్ జాఖర్‌ను నియమించింది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ జాతీయ కార్యావర్గంలో చోటు కల్పించారు. 

Daggubati Purandeswari appointed as new BJP President for andhra pradesh ksm

ఏపీ బీజేపీ విషయానికి వస్తే.. 
ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి. అయితే అక్కడ ఇప్పటికే రాజకీయం వెడేక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ జనాల్లో తిరుగుతున్నారు. మరోవైపు అధికార వైసీపీ కూడా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ పెద్ద‌గా ప్రభావం చూపకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకులు మాట. కాకపోతే అక్కడ బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. అయితే ఈ కూటమిలోకి టీడీపీ కూడా చేరాలని చూస్తోంది. అలాగైతేనే వైసీపీ అధికార బలాన్ని తట్టుకోగలమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అయితే ప్రస్తతుం ఏపీ బీజేపీలో కొందరు టీడీపీ అనుకూల వర్గంగా, మరికొందరు వైసీపీ అనుకూల వర్గంగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వైఖరి అధికార వైసీపీకి అనుకూలంగా ఉందనే విమర్శలు చేస్తూ కొందరు నేతలు పార్టీని  కూడా వీడారు. మరోవైపు సోము వీర్రాజుకు పార్టీ అధిష్టానంతో సత్సబంధాలు లేవనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు పొత్తులు, ఇతర అంశాలపై ఆయన చేసే ప్రకటనలు కూడా గందరగోళంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సోము వీర్రాజును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం భావించింది. అలాగే ఆ స్థానంలో వివాదాలకు దూరంగా ఉంటారనే పేరున్న దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. 

పురందేశ్వరి విషయానికి వస్తే.. 
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురిగా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లో దగ్గుబాటి పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. ఆమె కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎంపీగా  గెలుపొందారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014లో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒడిశా బీజేపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios