కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రజలను బయటకు రానీయకుండా ఆంక్షలను విధిస్తు... జనసమ్మర్థమైన ప్రదేశాలను అన్ని దేశాల ప్రభుత్వాలు మూసివేసి కట్టుదిట్టమైన నివారణ చర్యలను తీసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు. 

భారతదేశంపై కూడా ఈ మహమ్మారి పంజా విసరడం ఆరంభించడంతో భారతప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ ని దేశం నుండి తరిమి కొట్టేందుకు పూనుకున్నాయి. 

ఈ వైరస్ నేపథ్యంలోనే క్రీడా మంత్రిత్వ శాఖ స్టేడియంల లోపలి ప్రేక్షకులను అనుమతించేది లేదంటూ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశం రాగానే మిగిలిన క్రీడల సంగతి ఎలాగ ఉన్నా ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 

ప్రేక్షకులు రాకపోతే... భారీ నష్టాలూ వచ్చే ప్రమాదముందని ప్రస్తుతానికి ఒక 15 రోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 15 నాటికి కూడా ఇది ప్రారంభమయ్యేలా కనబడడం లేదు. ఇలా ఐపీఎల్ గనుక వాయిదా పడితే... మహా అయితే ఒక 10 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదంఉండొచ్చు కానీ... ఒక క్రీడాకారుడు మాత్రం తన క్రికెట్ కెరీర్ కే ఫుల్ స్టాప్ పెట్టవలిసి వస్తుంది. 

Also read: సచిన్ బాటలోనే ధోని.... రిటైర్మెంట్ పై వచ్చేసిన క్లారిటీ!

అతనెవరో కాదండీ... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. గత కొంత కాలంగా క్రికెట్ అభిమానుల్లో ఏదన్నా ఒక అంతుచిక్కని ప్రశ్న మెదులుతుందంటే అది ఖచ్చితంగా ధోని భవితవ్యం గురించే. అభిమానుల్లోనే కాదు క్రికెట్ పండితులు కూడా ఈ విషయమై తలలు బాదుకుంటున్నారు. జట్టు మానేజ్మెంట్ ఏమో ధోనికి ఎప్పుడు ఎం చేయాలో తెలుసు అని అంటూ నానుస్తున్నారు. 

ఇక సోషల్ మీడియాలోనయితే ఫాన్స్, యాంటీ ఫాన్స్ మధ్య చిన్నసైజ్ యుద్ధమే నడుస్తుంది. ఒక వర్గమేమో ధోని వయసయిపోయిందని, పస తగ్గిందని వాదిస్తుంటే.... మరికొందరేమో ధోని లాంటి ఫినిషర్ దొరికాక మాట్లాడండి అని అంటున్నారు. 

2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత ఎం.ఎస్‌ ధోని మైదానంలో కనిపించలేదు. 2019, జులై 9 తర్వాత టీమ్‌ ఇండియాలో మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యంపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. 

జాతీయ జట్టు తరఫున మహి కెరీర్‌పై అనుమానాలు నెలకొన్నా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని కచ్చితంగా మరో రెండు సీజన్లు ఆడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపించింది. దీనిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. 

అన్నట్టుగానే ధోని ప్రాక్టీస్ సెషన్ కోసం చెన్నైలో కాలుబెట్టాడు. సాధనలో 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ధోని ఈజ్ బ్యాక్ అని చాటాడు కూడా. అందరూ ఈ సంవత్సరం ఐపీఎల్ లో ధోని విశ్వరూపాన్ని చూస్తారు అనుకుంటున్నా తరుణంలో...ఈ కరోనా వైరస్ దెబ్బకు సన్నాహక శిబిరాలను కూడా ఫ్రాంచైజీలు మూసేసాయి. 

ఇలా సన్నాహక శిబిరాలను మూసివేయడంతో క్రికెటర్లంతా తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ధోని కూడా చెన్నై నుంచి జార్ఖండ్ తిరిగివెళ్ళాడు. ఇలా ఇప్పుడు సన్నాహక శిబిరాలు కూడా ఎత్తేయడం ఐపీఎల్ కూడా వాయిదా పడుతుందేమో అన్న అనుమానం నేపథ్యంలో ధోని భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి. 

వాస్తవానికి ధోని రిటైర్మెంట్ ఎప్పుడు అనే విషయంపై ఎప్పుడు నోరు తెరవలేదు. ఒక 7 నెలల కింద జనవరిలో స్పందిస్తానన్నాడు కానీ స్పందించలేదు. ప్రస్తుతానికి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కెరీర్ గురించి ఆలోచించుకోవడానికి ధోని ఈ బ్రేక్ తీసుకున్నాడనేది అందరికి తెలిసిన విషయమే. 

ధోని వాస్తవానికి చాలా కాలంగా క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. మొన్న మొన్నటి నుండే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ కూడా అర్థాంతరంగా ముగియడంతో ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. 

ఈ ఐపీఎల్ లో బలమైన ప్రదర్శన చేసి టీం ఇండియా టి 20 సిరీస్ కి ముందు తాను కూడా ఒక బలమైన ఆప్షన్ అని చాటి చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఇప్పటికీ భారత్ ఒక బలమైన ఫినిషర్ కోసం చూస్తుంది. 

Also read: యువరాజ్, ధోని స్థానాలకు రీప్లేస్మెంట్ దొరికేశారోచ్!

అలా బలమైన ఫినిషర్ గా తనని థాని ఈ ఐపీఎల్ లో నిరూపించుకొని భారత జట్టులో ఉన్న ఆ లోటును తాను కరెక్ట్ గా పూడ్చగలననే విషయాన్నీ చాటి చెప్పాలనుకున్నాడు. వాస్తవానికి ధోని ఈ విషయాన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు. 

ధోని టీం లోంచి వెళ్ళేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఎగ్జిట్ ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ ను అందించి ఆతరువాత రిటైర్ అయితే....తాను చిరస్థాయిగా గుర్తిండిపోతానని భావించాడు. 

కానీ ఇప్పుడు ఐపీఎల్ ఏ కాన్సల్ అయ్యే ప్రమాదం వచ్చి పడడంతో ధోని ఫ్యూచర్ ఏమిటనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ధోని తిరిగి టీం ఇండియా టి 20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ ఒక మంచి వేదికగా పనికి వచ్చేది. కానీ ఇప్పుడు అందుకు ఆస్కారమే లేకుండా పోయింది. 

ధోని ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు. ఈ వయసులో తిరిగి దేశవాళీ టోర్నీలు ఆది మరల తిరిగి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులోకి రావడం అంత తేలికైన విషయం కాదు. తాజాగా టీం ఇండియా కాంట్రాక్టులో కూడా ధోని పేరు లేదు. 

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ధోని కెరీర్ పై మరోసారి పూర్తి సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. ఐపీఎల్ గనుక కుదించిన ఫార్మాట్లో కూడా జరగకపోతే.... ధోని కెరీర్ ఇగ దాదాపుగా ముగిసినట్టే అనే విషయం స్పష్టంగా కనబడుతుంది.