మీడియాని కెలికితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే పవర్‌స్టార్‌కి.. మెగా ఫ్యామిలీకి తెలుస్తున్నట్లుంది. ఉత్తరాంధ్ర బస్సు యాత్రకు ముందు శ్రీరెడ్డి వ్యవహారంతో... తన తల్లి, కుటుంబం ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్‌ తెలుగు మెయిన్ స్ట్రీమ్‌ మీడియాపై యుద్ధం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ వేదికగా పెద్ద హైడ్రామా నడిపారు.

నాలుగు ఛానెళ్లను నిషేధించాలా.. లేక రాజీ కుదుర్చుకోవాలా అన్న దానిపై చిరంజీవి రంగంలోకి దిగి సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ప్రకటనలు ప్రధానంగా ఉన్న నాలుగు చానెళ్లకు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇది అంతటి ఆగలేదు... పవన్ కల్యాణ్ టీవీ9 యజమాన్యంతో డైరెక్ట్‌గా తలపడ్డారు. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ కూడా తమ ఇళ్లలో టీవీ9ని నిషేధించారు. చాలాకాలం పాటు చూడలేదనుకోండి అది వేరే విషయం.  

అయితే ఆ తర్వాత రెండు నెలల పాటు జరిగింది ఏంటంటే... తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని నాలుగు ప్రధాన ఛానెళ్లు మెగా కుటుంబాన్ని.. అన్నింటికి మించి పవన్ ప్రజా పోరాట యాత్రను పట్టించుకోలేదు.. ఏదో ఒక ఛానెల్‌లో పది నిమిషాలు కనిపించేవారు తప్పించి అంతగా ప్రభావం చూపలేదు.. దానికి ముందు పవన్ అడుగు పెట్టబోతున్న వార్త బయటికి వస్తే చాలు.. ఓబి వ్యాన్‌లు, లైవ్ కవరేజీలతో హోరెత్తిపోయ్యేది.. ఇక సినిమాల ప్రమోషన్ కూడా పడిపోవడంతో ..పరిస్ధితిని గమనించిన మెగా ఫ్యామిలీ కూడా రాజీ చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ పవన్ అందుకు ససేమిరా అన్నారు. 

మరోవైపు తమ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణ, టీవీ9 ఛైర్మన్ శ్రీనిరాజు విడివిడిగా పరువు నష్టం దావాలు వేశారు. దీనితో పాటు మార్ఫింగ్ వీడియో క్లిప్‌ వేశారని పవన్‌పై మరో కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షం కావడం మీడియాలో కలకలం రేపింది. దేవ్ హీరోగా నటించిన ‘‘విజేత’’ సినిమా ప్రమోషన్  కోసం... కల్యాణ్ టీవీ9లో లైవ్ ప్రొగ్రాం ఇచ్చారు. అల్లుడి ఎంట్రీ ఘనంగా ఉండాలని భావిస్తోన్న మెగాస్టార్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేశారు. 

సోషల్ మీడియా, ఫ్యాన్స్ గ్రూపుల్లో ప్రమోషన్ జరుగుతోంది. ఎంత చేసినప్పటికీ సినిమాకి సరిగ్గా ప్రమోషన్ జరగాలంటే టీవీ9 కావాల్సిందేనన్న భావనికి వచ్చేశారని అందుకే కల్యాణ్‌తో ఇంటర్వ్యూ ఇప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత గొడవల విషయంలో తామే వెనక్కి తగ్గామని చెప్పడానికే మెగాఫ్యామిలీ ఈ ఎత్తుగడ వేసిందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో కానీ... అంత రచ్చ చేసి టీవీ9 దగ్గరకే వచ్చారంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలెట్టేశారు.