ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ 151 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ ఒకరకంగా నిస్తారంగా, నిస్తేజంగా మారిపోయింది. కొన్ని రోజులు స్వయంగా చంద్రబాబు నాయుడే తామెందుకు ఓడామో అర్థం కావట్లేదంటూ లబోదిబోమన్నారు. 2019 మే తరువాత టీడీపీ శిబిరం శ్రేణులు ఎక్కడ తప్పు జరిగిందో అని వెతుక్కునే పనిలో పడిపోయారు. 

దానికి తోడు టీడీపీ ఘోర పరాజయం వారిని మానసికంగా కృంగదీసింది కూడా. కనీసం ఒక 50 సీట్లు వచ్చినా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండేవారు. కానీ ఆదిం సాధ్యపడలేదు. పోయినసారి వైసీపీ నుంచి ఎంతమందినయితే లాక్కున్నాడో... మారాలా అంతే మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు అని అనడం టీడీపీని మరింతగా ఇరుకున పెట్టింది. 

కానీ జగన్ తీసుకున్న ఒక నిర్ణయం టీడీపీకి కలిసొచ్చిందని చెప్పక తప్పదు. ఎవరైనా ఎమ్మెల్యేలు టీడీపీ నుండి వైసీపీలో చేరాలనుకుంటే.... తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని పెట్టిన నియమం టీడీపీని చాలా రోజులపాటు కాచి కాపాడింది. (ఇప్పుడు జగన్ ఎందుకు వారిని చేర్చుకుంటున్నారనేది అప్రస్తుతం)

ఇలా టీడీపీకి ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడానికి కారణం లేక దిక్కుతోచని స్థితిలో ఇసుక కొరత వారికొక ఆయుధంగా లభించినప్పటికీ.... టీడీపీ ఇసుక బకాసురుల వల్లనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకోవాలిసి వచ్చిందని వైసీపీ వాదించింది.

Also read; ఎస్ఈసీ రమేష్ కుమార్ లేఖ: వైఎస్ జగన్ కు కేంద్రం ఝలక్

టీడీపీ దానిపై ఏమీ మాట్లాడలేకపోయింది. టీడీపీకి అక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదు కూడా. టీడీపీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడానికి ఒక ప్రధాన కారణం ఇసుక అనడంలో ఎటువంటి సంశయం లేదు. అది బహిరంగ రహస్యం. 

ఇక ఎలా అంటూ టీడీపీ డీలాపడిపోతున్న సమయంలో.... జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం టీడీపీలో జవసత్వాలు నింపింది. పోరాడడానికి కారణం లేకుండా, జగన్ మీద విరుచుకుపడడానికి అస్త్రం దొరక్క వెయిట్ చేస్తున్న టీడీపీ... జగన్ సర్కార్ పై విరుచుకుపడింది. 

అమరావతి గ్రామాల్లో ఉద్యమం మొదలవ్వగానే... చాలా తెలివిగా ప్రాంతీయతలను ముందుకు తీసుకువచ్చి జగన్ కు రాయలసీమప్రాంతం వాడని, అక్కడివి ఫ్యాక్షన్ రాజకీయాలని ఆపాదించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అమరావతిలో ఉద్యమం తీవ్రతరమవుతుండడంతో సహజంగానే అక్కడ నిర్బంధం పెరిగింది. 

ఏ ప్రభుత్వం దానికి అతీతం కాదు. టీడీపీ హయాంలో కూడా ఇలా ఉద్యమాలపై తీవ్రంగా నిర్బంధం విధించారు కూడా. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగబద్ధం కాకున్నప్పటికీ, హర్షించదగ్గది కానప్పటికీ... అది నేటి కాలంలో ఒక సాధారణ విషయం అయిపోయింది. 

ఇలా జగన్ సర్కార్ పై రాయలసీమ ఫ్యాక్షనిస్టు అని, కడప రౌడీయిజం అని, పులివెందుల రాజకీయాలని రకరకాల పేర్లు పెట్టి పిలవడం ఆరంభించారు. సాధారణంగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కేవలం రెండు పార్టీల మధ్య పోరుగానే ఎప్పటి నుండో ఉండడంతో అక్కడ రాజకీయ తగాదాలు అనేవి సర్వ సహజమైన విషయం. 

గతంలో టీడీపీ కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ టీడీపీల మధ్య. పార్టీలు వేరైనా మనుషులు వాళ్ళే అవడం వల్ల ఆ రాజకీయ శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. 

అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ హత్యలు, ప్రతీకార దాడులు సాధారణ విషయంగా మారిపోయిన కాలం ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వైసీపీ నేతలు చాలా మంది హత్యకు గురయ్యారు. 

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అలాంటి రాజకీయ దాడులు జరుగుతున్నాయి. అలా ఏ దాడి జరిగినా మరొక్క మారు జగన్ రౌడీ రాజకీయాలు ఇవే అంటూ టీడీపీ గొంతెత్తి అరవడం ఆరంభించింది. 

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా రాజకీయ హింస పెచ్చు మీరిందనేది వాస్తవం. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ విషయాన్నీ వెల్లడించారంటే... అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ వేరుగా చెప్పనవసరం లేదు. 

మాచర్లలో బుద్ధ వెంకన్న, బోండా ఉమాలపై జరిగిన దాడిని యావతా తెలుగు ప్రజలు చూసారు. ఆ తరువాత నిందితుడికి వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. 

Also read: పారాసిటమాల్ వ్యాఖ్యలు: కేసీఆర్ కు జగన్ కి మధ్య తేడా ఇదే!

ఇక కొద్దీ సేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికల హింసను పక్కనబెడితే... కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ప్రకటించగానే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే ఆయనపై బహిరంగ విమర్శలకు దిగారు. ఆయనది చంద్రబాబుది ఒకటే కులమని కూడా అన్నారు. 

ఇలా ఎన్నికల ప్రధానాధికారి మీద స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన అనుచర వర్గమంతా మాటల దాడులు చేస్తున్న తరుణంలో రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు ఒక లేఖ రాసారు. తనకు తన కుటుం,బానికి రక్షణ కల్పించమని కోరుతూ అందులో పేర్కొన్నారు. 

ఆ లేఖ కూడా ఆయన రాయలేదు అని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేసింది వైసీపీ సర్కార్. ఏకంగా ఒక ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారిని తీసుకొచ్చి మా సర్ ఇలాంటి లేఖ రాయనేలేదు అని చెప్పించింది. కాకపోతే స్వయంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డే నేరుగా ఆయన రాసిన లేఖ అందింది. భద్రత కల్పిస్తున్నాము అని చెప్పడం వైసీపీ సర్కారుకు నిజంగా ఒక షాక్ అని చెప్పవచ్చు. 

ఆ లేఖలో ఆయన స్వయంగా జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఎన్ని స్థానాలు ఏకగ్రీవాలు అయ్యాయో దగ్గరి నుండి లెక్కచెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసను కూడా ప్రస్తావించారు. 

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మరోసారి దాడి మొదలుపెట్టింది. కరోనా కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న జగన్ మొండి పట్టుదల, స్థానిక సంస్థల్లో జరిగిన  హింస అన్నిటిని చూపిస్తూ టీడీపీ మరోమారు   నెత్తికెత్తుకుంది. 

ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం జనాలపై ఉంటుంది. దానితోపాటుగా జగన్ సర్కార్ సంక్షేమ పథకాలు వల్ల పేదల వర్గంలో జగన్ పట్ల సానుకూలత ఉంది.

ఇక దానికి తోడుగా ఇప్పుడు మూడు రాజధానుల అంశం వల్ల విశాఖలో జగన్ వైపుగా గాలి బలంగా వీయడం సహజం. వారి ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే అందరూ ఆహ్వానిస్తారు. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. వాటికింకా చాలా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి మాట నమ్ముతున్నారు అనేది మనము తెలుసుకోలేము. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ... సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. 

ప్రజల్లోకి ఎంత బలంగా ఏ వాదన వెళ్ళింది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినప్పటికీ.... టీడీపీలో మాత్రం ఈ పరిస్థితులు నయా జోష్ ని నింపడంతోపాటుగా పార్టీలోని క్యాడర్ ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందనడంలో నో డౌట్.