పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ధర్మపురి అరవింద్, గెలిస్తే నిజామాబాదు కి పసుపు బోర్డు తీసుకొస్తానని వాగ్దానం చేసాడు. అప్పట్లో బాండ్ పేపర్లపై సంతకం చేసాడు కూడా. 

ఎన్నికల్లో పసుపు బోర్డునే ప్రధాన అజెండాగా చేసుకున్న అరవింద్... పసుపు రైతులను తెరాస కు వ్యతిరేకంగా మలచడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి కవిత మాట తప్పిందని అప్పట్లో భారీస్థాయిలో ప్రచారం చేసి లబ్ది పొందాడు అరవింద్. 

ఎన్నికలు ముగిసాయి. అనూహ్యంగా కేసీఆర్ కూతురు కవిత ఓటమిని చవిచూసింది. పసుపు బోర్డు ఏర్పాటునే ప్రధాన అంశంగా చేసుకొని ఎన్నికల బరిలో నిలిచినా బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. 

ఎన్నికలయిపోయ్యాక అక్కడి ప్రజలు నెమ్మదిగా అరవింద్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. పసుపు బోర్డు తీసుకురావడం కష్టమని... ఉన్న బోర్డులలోనే కొన్నింటిని తగ్గించనున్నారని తొలుత బాంబు పేల్చారు. 

Also read: కవిత ఓటమి: బీజేపీ ఎంపీ అరవింద్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే...

ఆ తరువాత సంక్రాతి వరకు ట్రై చేస్తానని చెప్పాడు. రాష్ట్రప్రభుత్వ కోర్టులోకి బంతి వేసే ప్రయత్నం చేసినా, అది సక్సెస్ కాలేదు. స్వయంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా కనీస పసుపు బోర్డు తేలేని ఎంపీ అరవింద్ అంటూ తెరాస వర్గాలు కూడా బహిరంగంగా విమర్శలు చేయడం మాత్రమే కాకుండా గ్రామగ్రామాన తిరిగి రైతులకు ఈ విషయం చెబుతున్నారు. దాంతో అక్కడి పసుపు రైతులు పోరుబాట కూడా పట్టారు.

ఇక ఆ తరువాత రైతులకు పసుపు బోర్డుకు మించి ఏదైనా తీసుకొస్తానంటూ చెప్పారు. పసుపు బోర్డుకు మించి అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఒక రెండూ రోజులకింద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డును నిజామాబాదు లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపాడు. 

ప్రజలు పసుపు బోర్డును మాత్రమే అడిగితే.... తాము అంతకు మించిన మసాలా దినుసుల/ సుగంధ ద్రవ్యాల బోర్డును (స్పైసెస్ బోర్డు ) ఏర్పాటు చేశామని బీజేపీ వర్గాలు జబ్బలు చరుచుకుంటూ చెప్పుకుంటున్నాయి. 

అసలు ఈ బోర్డు ఎం చేస్తుంది...?

ఈ సంస్థ రైతులకు మిర్చి, పసుపు, ఇతర మసాలా దినుసులు,సుగంధ ద్రవ్యాల సాగుకు అవసరమైన శిక్షణ, పంటలను రక్షించుకొనేందుకు సంబంధించిన అవగాహన కల్పిస్తుంది. రైతులు పండించిన పంటకు అవసరమైన మార్కెట్‌ సదుపాయాన్ని కూడా ఈ బోర్డు కల్పిస్తుంది. 

కానీ ఇక్కడే కేంద్రం ఒక మెలిక పెట్టినట్టుగా ఒక అనుమానం మాత్రం కలుగక మానదు. దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం 10న రాష్ట్రాల్లో మాత్రమే స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 

ఇప్పటికే తెలంగాణాలో వరంగల్ లో ఒక స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణాలో ఇప్పుడు రెండవ స్పైసెస్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనబడడం లేదు. 

ఈ అన్ని పరిస్థితులను బట్టి చూస్తుంటే వరంగల్ లోని స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్నే నిజామాబాదు కి తరలించే యోచనను కేంద్రం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే.... తెరాస ఎంపీ ఉన్న చోటు నుంచి బీజేపీ ఎంపీ ఉన్నచోటుకి ఈ కార్యాలయాన్ని తరలిస్తున్నారన్నమాట. 

ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వరంగల్‌ నుంచే సేవలందుతున్నాయి. నిజామాబాద్‌లో కేవలం పసుపు మాత్రమే ప్రధాన పంటగా ఉంది. వరంగల్ విషయానికి వచ్చేసరికి మాత్రం పసుపుతోపాటుగా మిర్చి కూడా అత్యధిక స్థాయిలో సాగు చేస్తున్నారు. 

రాష్ట్రంలో సాగు చేస్తున్న మిర్చిలో 70 శాతం కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సాగవుతోందంటే అతిశయోక్తి కాదు. అయినా రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ఇలా ప్రాంతీయ కార్యాలయాన్ని తరలించే కార్యక్రమానికి ఉపకరించిందని తెరాస వాదిస్తోంది. 

Also read: నిజామాబాద్‌‌లో స్పైస్ ప్రాంతీయ బోర్డు: పార్లమెంట్‌లో ప్రకటించిన పీయూష్ గోయెల్

గతంలో కూడా తెరాస ప్రతినిధులు కేంద్రానికి ఒక లేఖను కూడా ఇచ్చారు. అప్పట్లో కూడా ఇలానే స్పైసెస్ బోర్డును తరలిస్తున్నారనే వార్త రాగానే వినోద్ కుమార్ అధ్యక్షతన తెరాస బృందం ప్రాంతీయ బోర్డును తరలించొద్దని కేంద్రానికి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇచ్చింది. 

ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బందిపడేది ఎవరన్నా ఉన్నారంటే అది తెరాస పార్టీనే అవుతుంది. ఇప్పటికే వరంగల్ ప్రాంతంలోని రైతులు తమ బోర్డు వెళ్ళిపోతుందని ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. 

రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాటానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు తెరాస కు ఈ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. స్పైసెస్ బోర్డు తరలింపును ఆపమని కోరితే నిజామాబాదు లో మరో సారి బీజేపీ తెరాస పై దాడికి సిద్ధపడుతుంది. 

నిజామాబాదు ప్రాంత పసుపు రైతుల ఆశలపై కెసిఆర్ నీళ్లు చల్లారని ఆరోపిస్తూ వారు పెద్ద ఎత్తున భారీస్థాయిలో ఉద్యమం నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోనీ తరలింపును అడ్డుకోకుండా ఊరుకుంటే.... వరంగల్ జిల్లా రైతులు ఉద్యమిస్తారు. 

కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఎటు తేల్చుకోలేని సంకట స్థితిలో పడిపోయింది అధికార తెరాస.