ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్పాప్ కేసులో మాదాల శ్రీనివాస్ చౌదరి ఆలియాస్ గుంటూరు శ్రీను కీలకంగా మారాడు. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులకు గుంటూరు శ్రీను వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను హైదరాబాదులోని హఫీజ్ పేట భూవివాదం కిడ్నాప్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా మారాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇంజనీరింగ్ కోర్సు మధ్యలో ఆపేసి టీ స్టాల్ నడుపుతున్న గుంటూరు శ్రీను అఖిలప్రియ దంపతులకు అత్యంత సన్నిహితుడిగా ఎలా మారాడనే విషయంపై చర్చ సాగుతోంది. ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు శ్రీను స్కెచ్ వేసినట్లు భావిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

Also Read: అఖిలప్రియను వారంరోజుల కస్టడీకి ఇవ్వండి : కోర్టులో పిటిషన్

గుంటూరు శ్రీను తండ్రి రమణయ్య గుంటూరులోని బ్రాడీపేట మూడో లైనులో టీ స్టాల్ నడిపాడు. అతను గుంటూరులోని డొంకరోడ్డుకు చెందినవాడు. తండ్రి పెట్టిన టీ స్టాల్ ను గుంటూరు శ్రీను చాలా కాలం నడిపాడు. 

ఇంజనీరింగ్ లో గుంటూరు శ్రీనుకు తెలుగు యువత నాయకుడు రాయపాటి సాయికృష్ణ మిత్రుడని తెలుస్తోంది. రాయపాటి సాయికృష్ణ ద్వారా గుంటూరు శ్రీను అఖిలప్రియకు పరిచయమయ్యాడు. భూమా కుటుంబానికి గుంటూరు విద్యానగర్ లో ఓ ఇల్లు ఉంది. దాన్ని మంత్రిగా ఉన్న్పపుడు అఖిలప్రియ కార్యాలయంగా వాడేవారు. ఈ క్రమంలో ఆ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ బాధ్యతలను గుంటూరు శ్రీను తీసుకున్నాడు. తద్వారా అఖిలప్రియ కుటుంబానికి అతను దగ్గరయ్యాడు. 

అఖిలప్రియ, భార్గవ్ రామ్ ల వివాహం జరిగిన తర్వాత అతను భార్గవ్ రామ్ కు మరింత చేరువయ్యాడు. ఆయనకు ఆంతరింగిక వ్యక్తిగా మారాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబంలో ఒక్కడిగా గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించాడు. 

Also Read: ఏపీలోనూ సెటిల్ మెంట్లు: భార్గవ్ రామ్ తోడునీడ గుంటూరు శ్రీను

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా కిరాయి హంతకులకు రూ. 50 లక్షలు అందించింది కూడా గుంటూరు శ్రీనుయేనని అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టయిన శ్రీను మూడు నెలల పాటు జైలులో ఉండి ఆ తర్వాత విడుదలయ్యాడు. అఖిలప్రియ మంత్రిగా ఉన్న కాలంలో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో పలు రోడ్డు కాంట్రాక్టులు చేశాడు. 

హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారాన్ని గుంటూరు శ్రీను సినీ ఫక్కీలో నడిపినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని శ్రీనగర్ ప్రాంతంలోని ఓ సినీ ఆర్టిస్ట్ కంపెనీ నుంచి ఐటి అధికారులు, పోలీసులకు సంబంధించిన డ్రెస్సులు అద్దెకు తీసుకున్నాడు. 

ఆ తర్వాత సినీ శిక్షకుడిగా వద్ద మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పక్కాగా కిడ్నాప్ వ్యవహారాన్ని గుంటూరు శ్రీను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీను వ్యవహారంపై ఏపీ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.