ఐలయ్యకూ పరిపూర్ణానందకూ ... ప్రేమ లేఖ

  • మీరు ఒక పాస్టర్ గా మారిపోయి, ఆ వేషభాషలతో ఈ పని చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
  • మతం మారాలనుకున్నవారు చక్కగా మారిపోవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. 
  •  హిందూ మతంలోని అణచివేతను ఎదిరిస్తున్నానని భ్రమ కలిగిస్తూ మీరు చేసేది క్రైస్తవ స్థాపన.
author a letter to kanche Ilaiha and Paripoornanda swamy

సార్లూ... తెలుగు సమాజంలో మీరు పుట్టించిన తెగులు వేయి విద్వేషాలు కోటి కొట్లాటలుగా మారింది. మీలో ఎవరూ సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్నవారిలాగ నాకైతే అగుపడుతలేరు. మీరో, మీ మీ మద్దతుదారులో కొంచం ఆలోచిస్తరేమో అన్న మినుకుమినుకు ఆశతో రాస్తున్న...


ఐలయ్య గారూ మీరే ప్రకటించుకున్నట్లుగా మీ ధ్యేయం భారత సమాజం మొత్తాన్నీ క్రైస్తవంలోకి మార్చడం కాబట్టి మీరు ఈ మధ్యకాలంలో విసురుతున్న సవాళ్ళకు నైతికత లోపిస్తున్నది. హిందూ మతంలో పూజారులుగా దళితులను పెట్టగలరా అని మీరు ఒకవైపు నిలదీస్తూనే పరిపూర్ణానంద అసలైన హిందువు కాదు (బ్రాహ్మడు కాదు అని భావం) అందుకే కొత్త బిచ్చగాడులాగా ఎగిరెగిరి పడుతున్నడు అని మొన్న టీవీ చర్చలో మీరు అన్యాపదేశంగా చెప్పడం చూస్తే చాలా విషయాలు స్పష్టం అవుతున్నయి.


మిక్స్ రేస్ అయిన పరిపూర్ణానంద హిందూమతాన్ని తలకెత్తుకోవడం పట్ల మీకు చిన్నచూపు. ఆయన నికార్సైన (?) బ్రాహ్మడు అయివుంటే మీ తర్కం వేరేలా ఉండేది. మీరు పైకి చెప్తున్న హిందూ మత సంస్కరణ (ఉదా దళిత పూజారులు) మీ ఉద్దేశం కాదు. అట్లే, బ్రాహ్మణేతరులకు అంత సీన్ కూడా లేదు అని మీ భావన. ఒక మేధావిగా, సమాజపు చీడపీడలను ఏరివేయాలని ఉంటే, ఆ పుస్తకానికి అలాంటి టైటిల్ పెట్టరు.  అందులో బ్రాహ్మలు సహా హిందూ దేవతల్ని వెక్కిరించరు.  మీ విధానం స్పష్టం. అందర్నీ క్రైస్తవులుగా చేయడం.  


మీరు ఒక పాస్టర్ గా మారిపోయి, ఆ వేషభాషలతో ఈ పని చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. మతం మారాలనుకున్నవారు చక్కగా మారిపోవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు.  హిందూ మతంలోని అణచివేతను ఎదిరిస్తున్నానని భ్రమ కలిగిస్తూ మీరు చేసేది క్రైస్తవ స్థాపన. ఇందుకు మిమ్మల్ని యెంత అయినా ఖండించవచ్చు. 


ఇక, పరిపూర్ణానందులవారూ... మీరు హిందూ మత ఉద్దరణ చేయవలసిన, ఆ పేరుతో సంక్షోభ తీవ్రత పెంచవలసిన అవసరం లేదు. కంచ ఐలయ్య కానీమరొకరు కానీ చెపుతున్న హిందూమతంలోని వివక్ష అంతానికి మీరు పాటుపడాలని కోరుతున్నా. ఏ మతమైనా పెడదోవ పడుతున్నపుడు దానిని సంస్కరించుకునే బాధ్యత ఆ మతంలోని వారిదే అవుతుంది. బయటి నుంచి వత్తిడి వస్తే పగిలిపోయే కోడిగుడ్డులా... లోపలినుంచి వత్తిడి వస్తే కొత్త సృష్టి... కొత్త వికాసం సాధ్యం అవుతుంది.  భారతదేశం భిన్న సంస్కృతుల సారం అని గమనించండి. మనది లౌకిక దేశం అని దృష్టిలో పెట్టుకోండి. రాజ్యాంగ ఉల్లంఘన చేయవద్దు. మొత్తం దేశాన్ని హిందూమతీకరిస్తా అనే మీ ధోరణి సరికాదు.  ఆయన అయినా, మీరైనా క్రైస్తవాన్నో, హిందూమతాన్నో రక్షించేంత మొనగాళ్ళు కాదని, మతాలు ఒకరో ఇద్దరో వ్యక్తుల రక్షకు మొహం వాచిపోయి లేవనీ మీరు గమనించాలి. ఇందుకు మిమ్మల్ని కూడా యెంత అయినా ఖండించవచ్చు. 

మీరిద్దరూ... మీ ఇద్దరి మద్దతుదారులూ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నయి:


1. మతాన్ని సంస్కృతికి పర్యాయపదంగా భావించకండి. ఐలయ్యగారి టీ-మాస్ 'బహుజన బతుకమ్మ' చేస్తుంది. అది సంస్కృతియా, మతమా? తెలుస్తున్నదా తేడా? 

2. మతమే లేని రష్యాలో, సంస్కృతి ఉండవచ్చు. చైనాలో సంస్కృతి ఉంది, అది నాస్తిక సంస్కృతి అయిఉండవచ్చు. అందుకే, మతానికీ సంస్కృతికీ ఏమీ సంబంధం లేదు. 

3. బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నట్టు, నాన్-ఇండిక్ మతాలతో ఈ దేశ సమగ్రతకు ప్రమాదం. ఎందుకంటే, ఈ దేశ బహుజనులు, ఈ దేశానివి కాని మతాల (సంస్కృతుల)లోకి మారిపోయాక, ఇక బహుజన బతుకమ్మలు ఉండవు. సమ్మక్క సారలమ్మలు ఉండరు. 

4. హిందూ-క్రైస్తవ ధాష్టీకాలకు ఈ దేశ ప్రజల, తెగల, సమూహాల విభిన్న సంస్కృతులు ధ్వంసం అయితే ఇక దేశమే మిగలదు. మోనో కల్చర్ ఒచ్చినంక ఆ దేశానికి పేరు ఏదైనా, ఆత్మ మాత్రం ఉండదు. ఈ తీవ్రప్రమాదకుహరాల్లోకి మీరు దేశాన్ని నడిపించదలచుకున్నారా?


ఓషోను ఉటంకిస్తా ఇక్కడ : 

'సంప్రదాయం అనేది మతం కాగలదు అని ఎన్నడూ పొరపాటున కూడా అనుకోకండి. ఒక ధార్మిక వ్యక్తి ఎన్నడూ సాంప్రదాయబద్ధుడు కాలేదు. అలా కానందుకే జీసస్ ను శిలువ వేయాల్సి వచ్చింది. మన్సూర్ ను హతమార్చవలసి వచ్చింది. సోక్రటీస్ కు విషం ఇవ్వాల్సి వచ్చింది - ఎందుకంటే, ఒక మతపరమైన వ్యక్తి ఎన్నటికీ శాస్త్ర సమ్మతమైనవాడు కాలేదు. ధార్మిక వ్యక్తి ఓ మహా విప్లవం. అతను (ఆమె) శాశ్వతం యొక్క, కాలాతీతం యొక్క నిరంతర ప్రకటన.


ఎవ్వరైనా శాశ్వతత్వాన్నీ, కాలాతీతాన్నీ ఎప్పుడు ప్రకటించినా... సాంప్రదాయవాదులు, ఆచారవంతులు వెర్రెత్తిపోతారు. వాళ్ళు ఎంతో ఆందోళనకు గురవుతారు.  అందుకే జీసస్ నూ, మన్సూర్ నూ, సోక్రటీస్ నూ సహించలేకపోయారు. శ్రీకృష్ణుడిని కూడా స్త్రీలోలుడిగా చిత్రించి, తాత్వికతను సమాధిచేయ ప్రయత్నించారు. 

ఐలయ్య, పరిపూర్ణానంద... వారి ప్రేమికులు... గమనించండి.  మతం ఒక్కటే. మనల్ని అందరినీ అనుసంధానం చేసే అభిమతమే మతం. హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, జంతువులను, చెట్లను అన్నింటినీ! చెట్లలో హరితంలా, దేహంలో రక్తంలా ఈ జీవవైవిధ్యాన్ని గుర్తించి గౌరవించండి. ప్రజల సంస్కృతుల విధ్వంసం తగదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios