AP ticket prices: పవన్ కల్యాణ్ టార్గెట్, ఆ వ్యాఖ్యల ముప్పు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలే తెలుగు సినీ పరిశ్రమకు ముప్పుగా పరిణించాయా? జగన్ ప్రభుత్వం మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే ఎసరు పెట్టింది.
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఆన్ లైన్ లో విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయంపై Pawan Klayan తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ ప్రభుత్వంపై, మంత్రులపై తీవ్ర పదజాలం వాడుతూ వ్యాఖ్యలు చేశారు. YS Jagan ప్రభుత్వంపై పోరాటం చేయాలని, బతిమాలితే పనులు జరగవని ఆయన అన్నారు. ఈ విషయంలో అన్నయ్య చిరంజీవి తీరును కూడా ఆయన తప్పు పట్టారు.
Cinema Tickets Prices నియంత్రణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎవరు తప్పిపట్టినా అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని వంటి ఆంధ్రప్రదేశ్ మంత్రులు పవన్ కల్యాణ్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. స్టార్ హీరోల రెమ్యునరేషన్ ను ప్రశ్నిస్తున్నారు. శ్యాం సింగరాయ్ సినిమా విడుదల సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ మంత్రులు పవన్ కల్యాణ్ ను లక్ష్యం చేసుకున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన విమర్ళు చేశారు.
నాని వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా, అ పని చేస్తే సినిమా నిర్మాణ వ్యయం తగ్గుతుందని ఆయన అన్నారు. వకీల్ సాబ్ సినిమాను 70 కోట్లతో తీశారని, అందులో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కే 45 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు అయ్యాయని తనకు తెలిసిందని ఆయన అన్నారు. తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని, పవన్ కల్యాణ్ కటౌట్లు పెట్టడానికి తాను మోటార్ సైకిల్ ను అమ్ముకున్నానని ఆయన అన్నారు. డబ్బు, శర్మ వృధా చేసుకున్నానని ఆయన చెప్పారు.
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీపై రగిలిపోతున్నట్లున్నారు. ప్రభుత్వం పంతానికి పోతే తన సినిమాను థియేటర్లలో ఉచితంగా చూపిస్తానని పవన్ కల్యాణ్ అప్పట్లో అన్నారు. దానిపై మంత్రి పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్రీగా అంటే నమ్మలేమని, ఛాలెంజ్ చేస్తున్నానని, తన వ్యాఖ్యలపై నిలబడాలని ఆయన అన్నారు. గ్రామాల్లో దసరా, శ్రీరామ నవమిలకు తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్లని, అలా తెరలు కట్టి పవన్ కల్యాణ్ సినిమాలు చూపించుకోవచ్చునని, దానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉండడం కూడా సినిమా ఇండస్ట్రీకి ముప్పుగా పరిణమించిందనే మాట వినిపిస్తోంది. తన సినిమాలను అడ్డుకోవడానికి సినీ ఇండస్ట్రీని మొత్తం నాశం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఓ క్షణాన అన్నారో అదే నిజమయ్యేట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లు పెద్ద యెత్తున మూత పడుతున్నాయి. థియేటర్లు మూత పడితే సినిమా నిర్మాణంపై దెబ్బ పడుతుంది.
Also Read: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత?: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్
టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 35 నెంబర్ జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేయడంతో సినీ పరిశ్రమకు ఊరట లభించిందని భావించారు. కానీ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. సింగిల్ జడ్జి ఆదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచీలో సవాల్ చేయడం మాట అటుంచితే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి సినీ పరిశ్రమకే ఎసరు పెట్టింది. థియేటర్ల తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని థియేటర్లను ఎస్పీలు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు తనిఖీలు చేయడం ప్రారంభించారు.
థియేటర్లు పక్కాగా నిబంధలను పాటించడం అనేది కలలో మాట. ప్రేక్షకులకు మంచినీళ్లను ఉచితంగా ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. అందువల్ల ప్రతి థియేటరులోనూ ఏదో లొసుగు ఉండే తీరుతుంది. దాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వం తన వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టింది. తనిఖీలు చేసి థియేటర్లను సీజ్ చేస్తే మళ్లీ తెరవడం చాలా కష్టమైన పని. దీంతో యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో థియేటర్లు మూత పడ్డాయి. దానికి తోడు, సినిమా ప్రదర్శనలకు లాభాలు వచ్చే అవకాశం లేదు. మొత్తంగా పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై పోరాటం సినీ పరిశ్రమను దెబ్బ తీసిందనే మాట వినిపిస్తోంది.