ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల పోరు ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికలను ఇటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీకి ఈ ఎన్నికలు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ గా మారిపోయాయి. 

మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా రెండవ శ్రేణి నాయకులను కూడా వైసీపీలోకి భారీగా ఆహ్వానిస్తున్నారు. గేట్లు కూడా తెరవడంతో చాలా మంది వచ్చి చేరిపోతున్నారు కూడా. 

మూడు రాజధానుల అంశంపై ఈ స్థానిక సంస్థలను ఒక రెఫరెండం గా అందరూ అభివర్ణిస్తుండడంతో జగన్ సర్కార్ కు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. 

Also read: చంద్రబాబుకు ఝలక్: కేసీఆర్ వ్యూహంతోనే జగన్...

రాష్ట్రంలో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న దాడులు, ఇతరాత్రాలను గమనిస్తే... రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నాయో అర్థమవుతుంది. ఇక ఈ మొత్తం ఎన్నికల్లో జగన్ సర్కార్ కు అత్యంత ముఖ్యమైన సీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా విశాఖ మునిసిపల్ మేయర్ స్థానం. 

జగన్ తలపెట్టిన మూడు రాజధానుల్లో అత్యంత కీలకమైనది, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం. దీని కేంద్రంగా తన భవిష్యత్తు పరిపాలను సాగించనున్న వైసీపీకి ఈ పీఠం అత్యంత కీలకం. ఇక్కడ గనుక ఓడిపోతే వైసీపీ తలెత్తుకోలేదు. అందుకే అత్యంత కీలకమైన ఈ స్థానం పై వైసీపీ ప్రత్యేక దృష్టిని సారించింది. 

విశాఖపట్నం పరిధిలో టీడీపీ నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలవడం జరిగింది. విశాఖ ఎంపీ స్థానాన్ని కూడా జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ వల్ల కోల్పోయారు. వారికి అక్కడ బలమైన క్యాడర్ సైతం ఉంది. 

ఈ నేపథ్యంలో టీడీపీ విశాఖలో బలమైన సవాల్ విసిరే ఆస్కారం కూడా లేకపోలేదు. వైసీపీ అక్కడ రాజధాని ప్రకటించినా ఎందుకు ఇంకా తటపటాయిస్తున్నారు అనే అనుమానం రావడం సహజం. కానీ అమరావతి రైతులకు జరిగినట్టు భవిష్యత్తులో తమకు సైతం అన్యాయం జరగొచ్చని అక్కడి రైతులు భావించి భూములు ఇవ్వడానికి భయపడుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో అక్కడ ఎంతో కొంతమేర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదముందని ముందే పసిగట్టిన వైసీపీ అక్కడ విజయసాయి రెడ్డిని బరిలోకి దింపింది. ఆయన విశాఖ నగరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 

అక్కడ ఉన్న రెండవశ్రేణి నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పటికే మొదలుపెట్టిన వైసీపీ తాజాగా మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించడం మొదాలుపెట్టింది. 

Also read; చంపేస్తారా, డీజీపీ సమాధానం చెప్పాలి: మాచర్ల ఘటనపై బాబు ఆగ్రహం

నిన్న మంగళవారం నాడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్‌ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ఇక నేటి ఉదయం మాజీ ఎమ్మెల్యే టీడీపీ బలమైన నేత పంచకర్ల రమేష్ బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నారు. వారు చెప్పే కారణాలు ఏమైనప్పటికి కూడా ఇక్కడ మాత్రం ఒక అర్ధమయ్యే విషయం ఏమిటంటే... వైసీపీలోకి భారీగా వలసలు మాత్రం జరుగుతున్నాయి. 

విశాఖను ఎలాగైనా దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టుగా మాత్రం తేటతెల్లమవుతుంది ఆపరేషన్ విశాఖ ద్వారా విశాఖ మేయర్ పదవిని దక్కించుకొని ఉత్తరాంధ్ర వాసుల నిజమైన ఆకాంక్ష విశాఖ రాజధాని అనే అంశాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రమంతా ఓకే అన్నారు అని చెప్పుకోవాలని తాపత్రయపడుతుంది వైసీపీ.