అక్కడ ఆళ్ల ఎంట్రీ ఇస్తే.. అంబటి పరిస్థితి ఏంటీ..?
అక్కడ ఆళ్ల ఎంట్రీ ఇస్తే.. అంబటి పరిస్థితి ఏంటీ..?
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇప్పటికే ఆయా పార్టీలు నిధుల సమీకరణ, బలమైన అభ్యర్థుల ఎంపిక, బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతూ.. ఎన్నికల రణరంగానికి ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తున్నాయి. అంతాబ బాగానే ఉంది కానీ.. ఆయా పార్టీల్లోని సిట్టింగ్‌లు.. టిక్కెట్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్తగా ఓ భయం పట్టుకుంది.
తమకు టిక్కెట్లు ఇస్తారా..? స్థానాలు మారుస్తారా..? అంటూ వారు సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఇక వైసీపీలో ప్రెస్‌మీట్లతో పాటు వివిధ వేదికల మీద తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడతారు అంబటి రాంబాబు. తనదైన శైలిలో.. పంచ్ డైలాగ్‌లతో ఆయన చేసే విమర్శలు ఆకట్టుకుంటాయి. ఈయన ఆశలన్నీ వచ్చే ఎన్నికల మీదే.. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి... టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ కోడెల చేతిలో 924 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎంట్రీని మిస్సయిన అంబటి 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ తనదేనని ఆశపెట్టుకున్నారు.
అయితే అంబటి ఆశలను వమ్ము చేసేందుకు హైకమాండ్ పావులు కదుపుతున్నట్లు లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సారి సత్తెనపల్లి స్థానాన్ని వైసీపీ ఖాతాలో వేయాలని భావించిన జగన్.. బలమైన నేతకు ఆ స్థానాన్ని కట్టబెట్టాలని నిర్ణయించారట.. ఆయన దృష్టిలో పడిన నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రాజధాని భూములు, సదావర్తిసత్రం కుంభకోణంతో పాటు పలు విషయాల్లో ఆయన అధికారపార్టీపై పోరాడి జనంతో పాటు పార్టీ శ్రేణుల్ల్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈయన అయితేనే సత్తెనపల్లికి కరెక్ట్ మొగుడని జగన్ భావిస్తున్నారట.
ఈ వార్త విని ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.. అయితే తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న సత్తెనపల్లి టికెట్ తనకు కాకుండా పోతుందన్న భయం అంబటిలో పట్టుకుంది. తనకు మొదటి నుంచి పాపులారిటీ ఉన్న సత్తెనపల్లి కాకుండా మరో ప్రాంతానికి పంపిస్తే ఆయన దానిని తిరస్కరించే అవకాశం ఉందనే వాదనలు వినిస్తున్నాయి.
తన మాటను కాదంటే అంబటి అధినాయకత్వంపై ఎదురు తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ స్థానాన్ని వదులుకుని మరో ప్రాంతానికి వలస వెళతారా.. అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు ఆళ్లే కాదు మరొకరు వచ్చినా సత్తెనపల్లి సీటు తమదేనంటున్నాయి తెలుగుదేశం వర్గాలు..