జగన్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరన్న రోజా జగన్ పాదయాాత్ర కోసం పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

జగన్ పాదయాత్ర చేస్తున్నారంటే చంద్రబాబుకి వెన్నులో వణుకు మొదలైందని వైసీపీ నేత , ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. జగన్ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జగన్.. ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. చిత్తూరులోని ప్రముఖ ఆలయమైన తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా.. ఎమ్మెల్యే పాదయాత్రకు మద్దతు పలికారు.

కాగా.. ఇప్పటికే నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ గోపిరెడ్డి పాదయాత్ర చేపట్టగా.. జగన్ పాదయాత్రకు ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.