మళయాళీ రచయితకు బెదిరింపు లేఖ 6నెలల్లోగా మతం మార్చుకోవాలి చేతులు, కాళ్లు నరికేస్తాం

ప్రముఖ మలయాళీ రచయిత కేపీ రమనున్నికి బెదిరింపు లేఖ వచ్చింది. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి
 మారాలని.. లేదంటే కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఆయన 
పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ లేఖ ఆరు రోజుల క్రితమే తనకు వచ్చిందని ఆయన చెప్పారు. తొలుత తాను ఆ లేఖను సీరియస్ గా 
తీసుకోలేదని అయితే సీనియర్‌ రచయితల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
‘ప్రొఫెసర్‌ జోసఫ్‌ లాగే మీ చేయి, కాలు కూడా నరకుతాం.. ఇస్లాం మతంలోకి మారకపోతే అల్లా ఇచ్చే
 శిక్షలను అమలుచేస్తాం’ అని ఆగంతకులు లేఖలో పేర్కొన్నారు. మలప్పురం జిల్లాలోని మంజేరీ అనే 
 ప్రాంతం నుంచి ఈ లేఖను పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ పనిచేశారో తనకు తెలియడం
 లేదని.. తనకు ఎవరితో శత్రుత్వం లేదని రమనున్ని చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని 
పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు రాశారంటూ.. 2010లో తోడుపుజా న్యూమన్‌ కాలేజీకి 
చెందిన ప్రొఫెసర్‌ జోసఫ్‌ చేయి నరికేసిన సంగతి తెలిసిందే.