జగన్  సీఎం కావాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే ఒంగోలుకు చేరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర

వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర ఐదో రోజుకి చేరుకుంది. గుంటూరు జిల్లా నర్సారావు పేటలో మొదలైన పాదయాత్ర బుధవారం ఒంగోలుకు చేరుకుంది. రోజురోజుకీ ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. గోపిరెడ్డి పాదయాత్రను అడ్డుకోవాలని టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ఆయన వెంట కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభానులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. ముఖ్యంగా రైతులు గత మూడేళ్లుగా సరైన పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాస్తో కూస్తో పండిన పంటకు కూడా ప్రభుత్వాలు సరైన గిట్టు బాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ని సీఎం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి తిరుమలకు ఈ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రోజుకి 30కిలోమీటర్ల చొప్పున 13రోజుల్లో గోపిరెడ్డి పాదయాత్ర పూర్తి చేయనున్నారు.