అసెంబ్లీలో వైసీపీ సందడి

First Published 28, Nov 2017, 1:18 PM IST
ycp leaders presence in ap assembly sessions
Highlights
  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • సమావేశాలకు హాజరౌతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు సందడి చేస్తున్నారు. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు కదా..? మళ్లీ  సమావేశాలకు ఎందుకు హాజరయ్యారు? ఇదే కదా మీ అనుమానం. వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాకపోతే వీరంతా పార్టీ ఫిరాయించిన వాళ్లే. అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటికే వైసీపీ నుంచి గెలిచిన 22మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడగా తాజాగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఆ జాబితాలో చేరారు.

పార్టీ ఫిరాయింపుకు పాల్పడటంతో వీరంతా ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. కానీ.. అసెంబ్లీ లెక్కల ప్రకారం వీరంతా వైసీపీ ఎమ్మెల్యేలే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వీరంతా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేల కిందకే వస్తారు. అసెంబ్లీ రికార్డులో కూడా వీరంతా వైసీపీ ఎమ్మెల్యేలుగానే పేర్కొంటున్నారు. సోమవారం పార్టీలో చేరిన గిడ్డి ఈశ్వరి, గత నెల పార్టీలో చేరిన వంతల రాజేశ్వరి సహా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతున్నారు. ఫిరాయింపులను  ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక వైపు వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తే.. మరో వైపు  ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఫిరాయింపులకు పాల్పడి మరీ సమావేశాలకు హాజరౌతుండటం గమనార్హం.

ఈ ఫిరాయింపు నేతల్లో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో వీరంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరౌతున్నారు. ఇక ఇదే అవకాశంగా చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు మంత్రులపై పగ తీర్చుకుంటున్నారు. ప్రశ్నోత్తరాల సయమయంలో దుమ్ముదులిపి వదిలిపెడుతున్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రోత్సహిస్తారన్న చంద్రబాబు మాటలను పాటిస్తూ.. ఫిరాయింపు మంత్రులను టార్గెట్ చేయడం గమనార్హం.

loader