ఆరంభం నుంచి చివరిదాకా పాదయాత్ర అదిరిపోయేలా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారు. అందుకు తగ్గిన ఏర్పాట్లను కూడా ఆయన ప్రారంభించేశారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ పేరిట పాదయాత్ర మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే.. తనతోపాటు పార్టీ నేతలను కూడా ఆయన రంగంలోకి దించుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే... నవంబర్ 6వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. మొదటి రోజు పాదయాత్రలో పార్టీ నేతలంతా జగన్ తో కలిసి పాల్గొననున్నారు. మొదటి రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత.. పార్టీ నేతలు.. తమ  తమ సొంత నియోజకవర్గాలకు చేరుకుంటారు. ఒక వైపు జగన్ యాత్ర కొనసాగుతుంటే.. మరో వైపు నుంచి నేతలు యాత్ర చేయనున్నారు.

పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ నేతలు పాదయాత్రలు చేయనున్నారు. పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఒక వైపు పాదయాత్రలు చేస్తూనే.. మరో వైపు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.