చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  వైసీపీ నేత మృతి చెందారు.  ఈ ప్రమాదంలో వైసీపీ నేతతోపాటు అతని తల్లి కూడా మృత్యువాతపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా కాణిపాకం ప్రాంతానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి  శనివారం ఉదయం కుటుంబంతో కలిసి బెంగళూరు బయలు దేరారు. కాణిపాకం నుంచి బయలు దేరిన కొద్ది గంటలకే వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

తవణంపల్లి మండలం మరేడుపల్లి  వద్దకు చేరుకోగానే.. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో విద్యాసాగర్ రెడ్డి, అతని తల్లి ధనమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.