మంత్రి ఆదినారాయణకు సవాల్ విసిరిన వైసీపీ నేత

First Published 14, Apr 2018, 11:46 AM IST
ycp leader suresh babu challenge to minister aadi narayana reddy
Highlights
మంత్రి ఆదికి సవాల్

మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత, కడప మేయర్  సురేష్ బాబు సవాలు విసిరారు. వైసీపీ జెండా మీద గెలిచి టీడీపీలో మంత్రి పదవి అనుభవిస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాజీనామా చేసి  మళ్లీ టీడీపీ గుర్తుపై గెలిచే దమ్ము ఉందా? అని సవాల్‌ విసిరారు. 
 రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్  కుటుంబాన్ని కీర్తించాల్సింది పోయి.. తిడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి మాట్లాడుతూ హిట్లర్‌ పాలనలో ఉన్నామా, బ్రిటీష్‌ పాలనలో ఉన్నామా అని ప్రజలు అనుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయనకు ప్రతి రోజూ పత్రికల్లో ఉండాలనే తపన తప్ప ప్రజల సమస్యలు తీర్చే ఆలోచన లేదన్నారు. దళితులను ధనవంతులను చేస్తానన్న టీడీపీ నేతల మాటలు ఒక్కసారి ఆలోచించాలన్నారు.
 
రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదాగురించి చర్చించుకుంటుంటే సమ్మేళనం పేరుతో సింగపూర్‌కు ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలుసన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పూటకోమాట మాట్లాడి చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారన్నారు. ఎమ్మెల్యే అంజాద్‌బాష మాట్లాడుతూ 5 సార్లు ప్రజల చేత ఓడిన సోమిరెడ్డి, 3 సార్లు ప్రజల చేతిలో ఓడిన సతీ్‌షరెడ్డి, గత ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్లతో ఓడిన శ్రీనివాసరెడ్డి లాంటి ప్రజా వ్యతిరేకులు ప్రజల నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి పదవి చేపట్టి దాదాపు సంవత్సరం కావస్తున్నా జిల్లాకు ఏం చేశావో... ఎంత నిధులు తీసుకొచ్చావో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం 16న చేసే బంద్‌కు అందరూ సహకరించాలని, 14న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాస్‌, జిల్లా అధికార ప్రతినిధి అఫ్జల్‌ఖాన్‌, నగర అధ్యక్షుడు పులిసునీల్‌, నాయకుడు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

loader